👉 ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ !
J SURENDER KUMAR,
హైదారాబాద్ రహమత్ నగర్ లో ఆదివారం జరిగిన మీడియా సమావేశ వేదికపై రాష్ట్ర ఎస్సీ ఎస్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన అనుచిత వ్యాఖ్యలు సిగ్గుచేటని, ధర్మపురి మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ధర్మపురి పట్టణంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ..
వెంటనే మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు బహిరంగ క్షమాపణలు చెప్పాలని, డిమాండ్ చేశారు. దళిత సామాజిక వర్గానికి చెందిన మంత్రి లక్ష్మణ్ కుమార్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా వున్న మంచి వ్యక్తి మంత్రి లక్ష్మణ్ కుమార్ అని గత పదిహేనేళ్లుగా ఎంత ఎత్తు ఎదిగిన, ఒదిగి వుండడం అనేది ఆయనను చూసి నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్ నాయకులం నేర్చుకున్నామని వారు అన్నారు.
గతంలో కాంగ్రెస్ నాయకుడిగా పొన్నం ప్రభాకర్ ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి పలుమార్లు వచ్చిన సందర్భంలో వెంట ఉండి దర్శనం తదితర ఏర్పాట్లు కల్పించారని వారు గుర్తుకు చేశారు. ఇప్పటికైనా మంత్రి పొన్నం ప్రభాకర్, స్పందించి మీడియా సాక్షిగా మంత్రి లక్ష్మణ్ కుమార్ కు బహిరంగ క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
అలాగే దళిత సామాజిక వర్గానికి చెందిన మరో మంత్రి గడ్డం వివేక్ ఈ ఘటనపై స్పందించకపోవడం బాధాకరమన్నారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.