నాటి బలిదానాలతో నేటి పోలీస్ ప్రశాంత జీవనం !

👉 రేపటి పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా..

J.SURENDER KUMAR,

నక్సల్స్ విధ్వంస కార్యకలాపాలకు అడుగడుగునా అడ్డుకుంటూ ప్రశాంత సమాజం  కోసం తమ ప్రాణలను తృణ ప్రాయంగా నాటి పోలీసుల బలిదానం తో నేటి పోలీస్ యంత్రాంగం ప్రశాంత జీవనం కొనసాగిస్తున్నది. 

👉 అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా..

అమరులైన పోలీసులకు , వారి కుటుంబాలకు వందనాలు, శతకోటివందనాలు విధి నిర్వహణలో ఉన్న పోలీసులను వార్ నక్సలైట్లు హతమార్చిన వారిలో మొదట హైదరాబాద్ నగరంలో మహమ్మద్ ఇబ్రహీం ఖాన్, తర్వాత ధర్మపురి పట్టణంలో రిజర్వ్ కానిస్టేబుల్ కోమల్ రెడ్డిలతో  నక్సలైట్లు పోలీస్ హత్యలకు  శ్రీకారం చుట్టారు.

దేశంలో అక్టోబర్ 21న పోలీస్ సంస్మరణ దినోత్సవంగా జరుపుకుంటారు. విధి నిర్వహణలో తమ ప్రాణాలను అర్పించి వీర మరణం పొందిన పోలీసులను స్మరించుకోవడానికి వారి కుటుంబాలను సన్మానించుకోవడానికి ఈరోజుకు ప్రత్యేకత.

పీపుల్స్ వార్ నక్సల్స్  తొలి సారిగా పోలీసులను వర్గ శత్రువులుగా, ప్రకటిస్తూ వారిని హతమార్చడమే  లక్ష్యంగా  45 సంవత్సరాల క్రితమే హత్యలకు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రి తో పాటు, ధర్మపురి లోనే అవి పురుడు పోసుకున్నాయి.

👉 నాడు సాంకేతిక సమాచార వ్యవస్థ  లేదు..

నక్సలైట్ల సమాచార సేకరణకు పోలీస్ యంత్రాంగానికి  నాడు సెల్ ఫోన్లు, ఆధునిక  టెక్నాలజీ అందుబాటులో లేవు,  గ్రామ, గ్రామాన, ఇన్ఫార్మర్ వ్యవస్థ, ప్రజలతో స్నేహ సంబంధాలు, కొనసాగిస్తూ,  వారి కార్యకలాపాలను అడ్డుకోవడంలో పోలీసులు సఫలమయ్యారని చెప్పవచ్చు.

పోలీస్ స్టేషన్లలో రాజకీయ పైరవీలు, అధికార, అనధికార పార్టీ రాజకీయ నాయకుల, ప్రజా ప్రతినిధుల, జోక్యం, తదితర పైరవీలను నాటి పోలీస్ యంత్రాంగం కర్కశంగా  తిరస్కరించేవారు. హోంగార్డు, మొదలుకొని కానిస్టేబుల్స్, వారి కుటుంబ సభ్యులను, పోలీస్ ఉన్నతాధికారులు ప్రేమాభిమానాలతో తమ కుటుంబ సభ్యులుగా ప్రేమించేవారు, గౌరవించేవారు…

👉 సమిదలైన పోలీసులు, కకావికలమైన కుటుంబాలు !

ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నక్సల్స్ ఉద్యమాన్ని  ఉక్కు పాదంతో అంతం చేయుటకు, సాయుధ పోలీసులు, పోలీస్ అధికారులు, నక్సల్స్ సృష్టించిన మారణ హోమంలో సమిధులయ్యారు. వారి కుటుంబాలు, ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి కకావికలమై వీధిన పడిన కుటుంబాలు ఎన్నో, ఎన్నెన్నో, సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం వెలకట్టలేని తమ అమూల్య ప్రాణాలను సైతం లెక్కచేయకుండా  దట్టమైన కీ కారణ్యంలో  మృత్యుదేవత ముంగిట నడుస్తూ  అమరత్వం పొందిన వీరులు పోలీసులు, తమ కుటుంబాలను అనాధలుగా వీధిన పడవేసి కానరాని లోకాల్లో వారు కలిసిపోయారు.

ప్రత్యేకంగా ఉత్తర తెలంగాణ జిల్లాలలో నక్సల్స్ తో, పోలీసు బలగాలు అమీ ,తుమీగా రాజి లేని యుద్ధమే చేశారు అని చెప్పవచ్చు, ఎత్తులకు పై ఎత్తులు, దాడులకు ప్రతి దాడులు చేస్తూ, మందు పాతర మారణ హోమంలో, తుపాకీ తుటాలకు ఎదురొడ్డి, ప్రాణాలను బలిదానం చేస్తూ పోలీసులు ప్రశాంత వాతావరణం కోసం, చేసిన ఎనలేని కృషి, ప్రాణ త్యాగాలు చరిత్ర పుటలలో చిరస్థాయిగా నిలిచిపోయేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిన అవసరం  ఉంది

👉 భయం భయంగా నాటి పోలీసుల విధి నిర్వహణ !

1980 సంవత్సరం నుండి  దాదాపు రెండున్నర దశాబ్దాల కాలం పాటు ఉత్తర తెలంగాణ జిల్లాలలో పోలీసులు, వారి కుటుంబాలు భయం భయంగా జీవనం కొనసాగించాల్సిన దుస్థితి ఉండేది. అనుక్షణం మృత్యు భయంతో, వారు వృత్తి ధర్మాన్ని నిర్వహించేవారు. భార్య పిల్లలు బిక్కుబిక్కుమంటూ దినదిన గండం నూరేళ్ల ఆయుషుగా, అనుక్షణం ఆందోళనలతో జీవనం కొనసాగించాల్సి పరిస్థితి నాటిది. పిల్లల విద్యాభ్యాసము, ఏ ప్రాంతం, ఏ పట్టణం, ఏ పాఠశాల, ఏ హాస్టల్  తదితర వివరాలు కానిస్టేబుల్ బంధువులకు, రక్తసంబంధికులకు,  కూడా తెలిసేవి కావు. పోలీసులు యూనిఫామ్  ధరించకుండా సాదాసీదా  దుస్తులు ధరించి ( నక్సల్స్ గుర్తించకుండా సామాన్య ప్రజల తరహాలో )  విధులు నిర్వహించేవారు.  నక్సల్స్ టార్గెట్ లో ఉన్న కొందరు పోలీసు కుటుంబాలు ఇతర రాష్ట్రాల నివాసం ఏర్పాటు చేసుకునేవారు.

అనేక పోలీస్ కుటుంబాలు  ఎలాంటి వసతి సౌకర్యాలు లేకున్నా స్టేషన్ ఆవరణలో శిథిలమైన క్వార్టర్స్ లోనే  పోలీసులు ( ప్రాణ భయంతో ) నివాసం ఉండేవారు.  పోలీస్ స్టేషన్ల చుట్టూ 24 గంటలు ( డీజిల్ ఇంజన్ జనరేటర్ల తో ) ఎలక్ట్రికల్ ఫెన్సింగ్. ఫ్లడ్ లైట్స్ వెలుతురు, సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకు, పోలీస్ స్టేషన్ ముందు రాకపోకల నిషేధం. బారికెట్ల ఏర్పాటు, పోలీస్ స్టేషన్ కు  రాత్రి పగలు ఏ ఫిర్యాదు దారుడు వచ్చిన గేటు ముందు నిల్చండి, దూరంలో  కాపలా సెంట్రి అనుమతితోనే లోనికి రావాల్సిందే.

పండుగలు, పబ్బాలకు, శుభ, ఆశుభ కార్యక్రమాలకు  పోలీసులు వెళ్లేవారు కాదు. అడవుల్లో, గ్రామాల్లో కూంబింగ్ లో పోలీస్ బృందంలో కనీసం 25 మంది సాయుధ పోలీసులు ఉండేవారు. జీపులు, ఇతర వాహనాలు, ద్విచక్ర వాహనాలు వినియోగించేవారు కాదు. ఎంత దూరమైనా, ఎన్ని కిలోమీటర్లు అయినా కాలినడకన వెళ్లక తప్పని దుస్థితి . అర్ధరాత్రి, అపర రాత్రి ,వర్షంలో తడుస్తూ, అడవి జంతువులు, విష కీటకాల నడుమ వారు  క్యూబింగ్ నిర్వహించేవారు, తమ టార్గెట్ కోసం ఎన్నో తిండి,నిద్రలేని రాత్రులు గడుపుతూ  రోజుల తరబడి మాటు వేసేవారు.

👉 నేటి కొందరు పోలీసుల వైభవం…

నేడు పోలీస్ యంత్రాంగంలో కొందరు లగ్జరీ వాహనాలు, పోలీస్ స్టేషన్ లలో ఏసీలు, ఆన్లైన్ సమాచార వ్యవస్థ, పైరవీ కారులను పెంచి పోషిస్తూ, సివిల్ తగాదాలలో, భూ, భార్యాభర్తల వివాదాలు తదితర వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొందరు పోలీసులు ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే పదమే మర్చిపోయి, బాధితులను ఆరేయ్, ఒరేయ్ , అంటూ  సంబోధించడం  నెలసరి మాముళ్ళ మత్తులో జోగుతున్నారు  అనే విమర్శలు సైతం ఉన్నాయి.

పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల కంటే, అధికార పార్టీ నేతల ఆదేశాలు, ఆచరిస్తూ, అమలు చేస్తూ, వారిని ప్రసన్నం చేసుకుంటూ ఉద్యోగాల్లో పదోన్నతులు, కోరుకున్న చోటికి బదిలీలు చేయించుకుంటూ కొందరు పోలీసులు అధికార పార్టీ నాయకుల సేవలో భక్తులు అవుతున్నారని ఆరోపణలు, విమర్శలు వినిపిస్తున్నాయి.

👉 పోలీస్ యంత్రాంగం కనీస బాధ్యత !

విధి నిర్వహణలో నక్సలైట్ల చేతిలో ప్రాణాలు కోల్పోయిన అమరులైన పోలీసుల చిత్రపటాలు  ప్రతి పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసి వారి ప్రాణ త్యాగాలను వివరాలు ప్రదర్శించాల్సిన కనీస బాధ్యత  ఉన్నతాధికారులది.   నక్సల్స్ చర్యలతో ప్రాణాలు కోల్పోయిన ఉన్నత స్థాయి పోలీస్ అధికారులకు, సామాన్య పోలీసుల ప్రాణ త్యాగాల లక్ష్యం ఒకటే అనే అంశం పోలీస్ యంత్రాంగం గుర్తుంచుకోవాలి అనేది సామాన్య పోలీసుల ఆవేదన.

అమరులైన పోలీస్ కుటుంబాలను, వారి కుటుంబ సభ్యులను, ఏదోమొక్కుబడిగా అమరవీరుల దినోత్సవం సందర్భంగా  నివాళులు అర్పించడం కాకుండా, సైనిక బోర్డు తరహాలో, పోలీస్ శాఖ విధిగా ప్రత్యేక విభాగం ఏర్పాటుచేసి ఆ కుటుంబ సభ్యుల యోగక్షేమాలు, వారి సమస్యలు పరిష్కారానికి కృషి చేసి వారి కనీస అవసరాలు తీర్చ గలిగితే  అమరులైన పోలీసులకు నిజమైన నివాళి తో పాటు వారి ఆత్మలకు  పరిపూర్ణమైన శాంతి లభిస్తుంది.