ఔను దీన్ని సరెండర్ అనకూడదు !

👉 కిరణ్

J.SURENDER KUMAR,

దీన్ని సరెండర్ అనకండి’  గతంలో ఆశన్న, ఇప్పుడు రూపేశ్ పేరుతో చెలామణి అవుతున్న తక్కళ్లపల్లి వాసుదేవరావు, నిన్న జర్నలిస్టులకు, యూట్యూబర్లకు చెప్పిన మాట. దీన్ని సరెండర్‌గా చూడబోమని ‘విజయ్ శర్మాజీ’ కూడా ఈయన హామీ ఇచ్చాడట. అంటూ కిరణ్ పేరిట ఓ పోస్ట్ ప్రచారం మాధ్యమాల్లో చెక్కర్లు కొడుతున్నది.

అవును ఇది సరెండర్ ఎట్లా అవుతుంది? సరెండర్ అంటే ఉద్యమంలో కొంత కాలం పని చేసిన వాళ్లు బతుకు మీద ఆశతోనో, ఏవో విభేదాల వల్లనో, వ్యక్తిగత స్వార్థం పెరగడం వల్లనో, మరే కారణంతోనో పార్టీకి చెప్పి, తెలియజేసి బయటకు వచ్చి ప్రభుత్వం ముందు లొంగిపోవడం. ఇదీ సాధారణంగా అందరికీ తెలిసిన సరెండర్.

చాలా అరుదుగా కొందరు వ్యక్తులు ఆయుధాలతో సహా పారిపోయి వచ్చి సరెండర్ అయిన ఘటనలు కూడా ఉన్నాయి. వారిని ద్రోహులుగా, ఉద్యమ శత్రువులుగా ప్రకటించిన చరిత్ర కూడా మనకు తెలుసు. కానీ వేణుగోపాల్, వాసుదేవరావులు పాల్పడ్డది ఈ రెండు కోవల్లోకీ వచ్చేది కాదు. అందుకే ఇది సరెండర్ కాదు. ఇది విద్రోహం కూడా కాదు…. ఇది విప్లవ ప్రతిఘాతుకత్వం. వీళ్లిద్దరూ విప్లవ ప్రతిఘాతకులు.

👉  కౌంటర్ ప్రకటన..

వాసుదేవరావు అడవిలోంచి ఇంకా పూర్తిగా బయటకు రాకముందే మీడియా ముఖంగా తన ఫోన్ నెంబర్, ఒకటికి రెండు సార్లు రెట్టించి మరీ ప్రకటించాడు. తన ‘శాంతి’ మార్గానికి మద్దతు పలికేవాళ్లు తనను కాంటాక్ట్ చేయొచ్చని చెప్పాడు. అది ఆయనకు రాజ్యం ఇచ్చిన ఫోన్ అని, అది ఆయనకు రాజ్యం ఇచ్చిన డైరెక్షన్ అని తెలుసుకోవడానికి పెద్దగా శ్రమ పడనక్కరలేదు.

అంటే.. పోరాటాన్ని కొనసాగిస్తామంటున్న అగ్ర నేతలతో ఉన్న గెరిల్లా దళ సభ్యుల్లో బలహీనులు ఎవరైనా ఉంటే, వారు ఈ ఫోన్ నెంబర్‌ను కాంటాక్ట్ చేస్తే చాలు… ఈయనకు ఈ ఫోన్ అందించిన వారు లొకేషన్‌ను ట్రాక్ చేసి వెంటనే వారిని మట్టుపెట్టేందుకు వేసిన ఎత్తుగడ ఇది అని అర్థం చేసుకోవడానికి మనం సైంటిస్టులు కావాల్సిన  అవసరం లేదు. ఇంతకన్నా విప్లవ ప్రతిఘాతుకత్వం మరేదైనా ఉంటుందా?  అంటూ సోషల్ మీడియాలో కిరణ్ పేరిట జారీ అయిన పోస్టు చెక్కర్లు కొడుతున్నది.