పోటీ చేయడానికి ముగ్గురు పిల్లలు అయినా ముద్దే !

👉 ఆర్డినెన్స్ జారీకి క్యాబినెట్ ఆమోదం !

J SURENDER KUMAR,

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి ముగ్గురు పిల్లలు కలిగి ఉన్న ముద్దే అని ఇద్దరు పిల్లల నిబంధన  ఎత్తివేయడానికి ఆర్డినెన్స్ జారీకి గురువారం క్యాబినెట్ తీర్మానం చేసింది.
ప్రస్తుతం అమలులో ఉన్న ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తి వేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి ఇద్దరు పిల్లల నిబంధనను తొలగించడానికి వీలుగా తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం -2018 లోని సెక్షన్ 21(3) ని తొలగిస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలని తీర్మానించింది.

👉 ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టును 2026 చివరి నాటికి లేదా 2027 ప్రారంభం నాటికి పూర్తి చేయాలని నిర్దేశించింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3.5 లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు జిల్లాలోని ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలను ఫ్లోరైడ్ రహిత ప్రాంతాలుగా చేయడానికి సంకల్పించిన ఈ ప్రాజెక్టు 44 కిలోమీటర్ల సొరంగంలో ఇప్పటికే దాదాపు 35 కి.మీ పూర్తయింది.

👉 మిగిలిన పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని మంత్రిమండలి తీర్మానించింది. ఇప్పటివరకు పనులు చేపట్టిన ఏజెన్సీ ద్వారానే పూర్తి చేయించాలని నిర్ణయించారు. ప్రాజెక్టు పూర్తి చేయడానికి ప్రభుత్వం అదనంగా ఆర్థిక భారం లేకుండా ప్రాజెక్టు పూర్తి చేయాలి. టన్నెల్ బోరింగ్ మిషన్ ద్వారా కాకుండా అత్యాధునిక డ్రిల్లింగ్ పద్ధతిలో ప్రాజెక్టును పూర్తి చేయడానికి మంత్రిమండలి ఆమోదించింది.

👉 స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేన్లు కల్పించాలని ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేసిందని మంత్రిమండలి అభిప్రాయపడుతూ, ఈ అంశంపై హైకోర్టు తీర్పును అనుసరించి తదుపరి నిర్ణయం తీసుకోవాలని మంత్రిమండలి భావించింది.

👉 వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ముఖ్యంగా ఎల్బీనగర్, సనత్‌నగర్, అల్వాల్, వరంగల్‌లలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను యుద్ధ ప్రాతిపదికన వాటి నిర్మాణాలను పూర్తి చేయాలని నిర్ణయించింది.

👉 రాష్ట్రంలో 1500 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ యూనిట్ల ఏర్పాటు ప్రతిపాదనలకు మంత్రివర్గం సూత్రప్రాయంగా  ఆమోదముద్ర వేసింది. అలాగే రామగుండంలో 52 ఏళ్ల కిందటి థర్మల్ స్టేషన్ (ఆర్టీఎస్ – బి 62.5 మెగావాట్ల యూనిట్) కాలపరిమితి ముగిసినందున దానికి తొలగించడానికి ఆమోదించింది.

👉 రాబోవు పదేళ్లకు విద్యుత్ అవసరాలు, డిమాండ్ అంచనాలకు అనుగుణంగా భవిష్యత్తు ప్రణాళికను తయారు చేయాలని విద్యుత్ శాఖను మంత్రిమండలి ఆదేశించినట్టు మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ , పొన్నం ప్రభాకర్ , వాకిటి శ్రీహరితో కలిసి సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మీడియా సమావేశంలో వివరించారు.