👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
తన పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు రాజకీయ ప్రత్యర్థులతోనూ, ప్రజలతోనూ విశాల హృదయంతో కలసి, ప్రజా సంక్షేమ అభివృద్ధి పనులలో రాజీపడని మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి మృతి తీరని లోటు అని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఎమ్మెల్యే కాలనీలో శుక్రవారం మాజీ మంత్రి దామోదర్ రెడ్డి గృహంలో ఆయన పార్దివ దేహానికి పూలమాలలు వేసి మంత్రి నివాళులు అర్పించి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
👉మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…
మాజీ మంత్రి దామోదర్ రెడ్డిది, విశిష్ట లక్షణమని, ఆయన నిష్కళంక సాధుస్వభావం, ప్రజల పట్ల ఆయన నిబద్ధత ఈ తరానికీ ఆదర్శమని మంత్రి అన్నారు.
నల్గొండ జిల్లాలో నాలుగు దశాబ్దాలకుపైగా ప్రజలకు అంకితభావంతో సేవలందించిన దామోదర్‌రెడ్డి సూర్యాపేట, తుంగతుర్తి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని మంత్రి లక్ష్మణ్ కుమార్ గుర్తుచేశారు. పల్లె సమస్యల నుంచి జిల్లా అభివృద్ధి వరకు ఆయన కృషి విశిష్టమని అన్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాకు శ్రీరామసాగర్ జలాలను తరలించేందుకు చేసిన కృషి, నీటిపారుదల ప్రాజెక్టుల కోసం నిస్వార్థంగా పోరాడిన త్యాగం చిరస్మరణీయమని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
నల్గొండ జిల్లాలో కమ్యూనిస్టుల కంచుకోటలో దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో గెలిపిస్తూ, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి అన్ని స్థానాల్లో అభ్యర్థుల గెలుపుకు విశేషంగా ఆయన కృషి చేశారనీ మంత్రి గుర్తు చేసారు..
యువజన కాంగ్రెస్ నాయకుడిగా ఆయన యూత్ కాంగ్రెస్ కు ఆదర్శంగా నిలిచి యువతను కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆయన విశేషంగా కృషి చేశారు మంత్రి ఆయన రాజకీయ జ్ఞాపకాలను గుర్తు చేశారు.

1985 నుండి 2009 వరకు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి స్వతంత్ర అభ్యర్థిగా ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవడం ఆయన ప్రజాభిమానానికి నిదర్శనమని అన్నారు. మొట్టమొదటిసారిగా ఆయన ప్రస్థానం తుంగతుర్తి నుంచి ఎమ్మెల్యేగా మొదలైందన్నారు.
స్వర్గీయ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో ఐటీ శాఖ మంత్రిగా రాష్ట్రానికి నూతన దిశ చూపారని అన్నారు. దామోదర్‌రెడ్డి మృతి కాంగ్రెస్ పార్టీకి మాత్రమే కాకుండా, ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు కూడా పెద్ద లోటు అని మంత్రి పేర్కొన్నారు.
ఈ దుఃఖ సమయంలో రాంరెడ్డి కుటుంబ సభ్యులకు ధైర్యం కలగాలని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.