J SURENDER KUMAR,
ధర్మపురి పట్టణానికి చెందిన ప్రముఖ పిల్లల డాక్టర్ కస్తూరి జగదీష్, ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
జగిత్యాల పంచాయితీ సమితి మాజీ కో ఆప్షన్ సభ్యుడు ధర్మపురికి చెందిన కస్తూరి రామ్ కిషన్ కుమారుడు, డాక్టర్ జగదీష్. అమెరికాలో విద్యాభ్యాసం చేసిన డాక్టర్ జగదీష్
హైదరాబాద్ లోని ప్రముఖ కార్పొరేట్ పిల్లల హాస్పిటల్ రెయిన్ బో లో కొంతకాలం పనిచేశారు.
ఏదో అత్యవసర ఫోన్ కాల్ రావడంతో, తన సొంత కారులో కాకుండా రాపిడో బుక్ చేసుకుని (ద్విచక్ర వాహనం) పై వెళుతుండగా ఫ్లై ఓవర్ వద్ద వెనకనుంచి లారీ వీరి వాహనం ఢీకొంది. సంఘటన స్థలంలో డాక్టర్ జగదీష్ మృతిచెందగా. ద్విచక్ర వాహనం నడుపుతున్న మరో వ్యక్తి తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉండగా హుటాహుటిన యశోద ఆసుపత్రికి తరలించారు. అప్పటికి డాక్టర్ జగదీష్ మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. డాక్టర్ జగదీష్ సెల్ ఫోన్లో కాల్ ఆధారంగా ప్రముఖ గుండె వైద్య నిపుణుడు డాక్టర్ శ్రీధర్ కస్తూరికి పోలీసులు సమాచారం ఇచ్చారు. పంచనామా పూర్తి చేసి పోస్టుమార్టంకు గాంధీ ఆసుపత్రికి మృతదేహం తరలించారు.
డాక్టర్ శ్రీధర్ కస్తూరి తో శనివారం సాయంత్రం జగదీష్ ఆయన చాంబర్లో మాట్లాడారు. దసరా పండుగ రోజున డాక్టర్ జగదీష్ ధర్మపురి కి వచ్చి ఆనందంగా గడిపారు. ధర్మపురిలో కస్తూరి రామ్ కిషన్ ఇంటికి పలువురు వెళ్లి ఓదారుస్తున్నారు. జగదీష్ మృతితో పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి.