👉 అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి !
J.SURENDER KUMAR,
భారీ వర్షాల వల్ల 16 జిల్లాల్లో జరిగిన నష్టంపై జిల్లాల వారిగా సమగ్రమైన నివేదికలు తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలిచ్చారు. భారీ వర్షాలు, వరదల వల్ల 12 జిల్లాల్లో తీవ్రంగా నష్టం వాటిల్లిందని, పంట నష్టానికి పరిహారం చెల్లించాల్సి ఉన్నందున అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వారం రోజుల్లో సమగ్రమైన నివేదికలు అందించాలని స్పష్టం చేశారు.
👉 భారీ వర్షాల వల్ల నష్టపోయిన ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం తదితర ప్రాంతాల మీదుగా శుక్రవారం ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే చేశారు. అనంతరం హనుమకొండ చేరుకున్న ముఖ్యమంత్రి జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితులతో మాట్లాడారు. వరద నష్టంపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు.
👉 అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి , కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి బాధిత కుటుంబాలను ఆదుకునే విషయంలో స్పష్టమైన సూచనలు ఇచ్చారు.

👉 “వరి, పత్తి పంటలకు తీవ్ర నష్టం జరిగింది. నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు ₹10 వేల రూపాయల చొప్పున పరిహారం అందించాలని అనుకుంటున్నాం. క్షేత్రస్థాయిల్లో పంట నష్టం వివరాలను నమోదు చేస్తూ నివేదికలివ్వాలి. వరదల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹5 లక్షల చొప్పున నష్టపరిహారం అందించాలని ప్రభుత్వం ఇదివరకే ఉత్తర్వులు జారీ చేసింది. విధానపరమైన లోటుపాట్లు లేకుండా వెంటనే వివరాలను నమోదు చేయాలి.
👉 ఎన్ఆర్ఈజీఎస్‌లో భాగంగా పొలాల్లో ఇసుక మేట తొలగించాలి. దానికి అంచనాలు రూపొందించండి. వరదల వల్ల నష్టపోయిన వారికి ఎంత చేసినా వారి నష్టం పూడ్చలేనిది. ఇండ్లు నష్టపోయిన వారికి ₹ 15 వేల చొప్పున పరిహారం అందించాలి. అత్యంత నిరుపేదలు ఉంటే వారి అర్హత మేరకు అదనంగా ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలి. వరదల వల్ల నిరాశ్రయులైన వారి జాబితాలను తయారు చేయండి.
👉 భారీ వర్షాల ప్రభావిత ప్రాంతాల్లో దాదాపు అన్ని చోట్లా దాదాపుగా ఇదే రకంగా నష్టం వాటిల్లింది. క్షేత్రస్థాయిలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పంట నష్టం, పశు నష్టంతో పాటు ఇండ్లు, రోడ్లు, కల్వర్టుల వంటి మౌలిక సదుపాయాలు దెబ్బతిన్న ప్రాంతాలకు సంబంధించి సమగ్రమైన నివేదికలు తయారు చేయాలి. ప్రజాప్రతినిధులు సైతం కిందిస్థాయిలో జరిగిన నష్టంపై కలెక్టర్లకు నివేదికలు సమర్పించాలి.
👉 నష్టం అంచనాలను తయారు చేయడంలో విపత్తు నిర్వహణ విభాగం ఒక ఫార్మేట్‌ను తయారు చేసి అన్ని జిల్లాల నుంచి నివేదికలు తెప్పించాలి. ఇలాంటి విపత్తు సమయాల్లో రాష్ట్ర ప్రభుత్వం అందించే సహాయంతో పాటు కేంద్రం నుంచి కూడా నిధులను రాబట్టుకోవలసిన అవసరం ఉంది. ఇందులో ఏమాత్రం అలసత్వం వద్దు.

👉 ఇలాంటి సమయాల్లో కేవలం తాత్కాలిక పరిష్కారం వైపు కాకుండా శాశ్వత పరిష్కారాలకు కృషి చేయాలి. వరదల విషయంలో అడ్డంకులను తొలగించకపోవడం కూడా నష్టం ఎక్కువగా జరగడానికి ఆస్కారమించింది. నీటి వనరుల ఇన్‌ఫ్లోస్, అవుట్‌ఫ్లోస్ విషయాల్లో నీటి పారుదల శాఖ అంచనాలను పరిగణలోకి తీసుకోవాలి. లేదంటే వర్షాలొచ్చినప్పుడు మళ్లీ ఇదే సమస్యలు వస్తాయి. అలాంటివి రానివ్వకండి.
👉 శాఖల మధ్య సమన్వయం ఉండాలి. ముఖ్యంగా రోడ్లు భవనాలు, నీటి పారుదల, మున్సిపల్, వైద్య ఆరోగ్య, విద్యుత్ తదితర శాఖల మధ్యన సమన్వయం ఉండాలి. ఏ విభాగం తర్వాత ఏ విభాగం పనులు పూర్తి చేయాలన్న సమన్వయం ఉండాలి. నాలాలను కబ్జా చేసి అడ్డంకులు సృష్టించే వారి విషయంలో ఎవరినీ వదలొద్దు. కఠినంగా వ్యవహరించాలి. పది మంది కబ్జాలకు పాల్పడితే పది వేల మందికి నష్టం జరుగుతోంది.
👉 ఉమ్మడి వరంగల్ కోర్ అర్బన్ ప్రాంతంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్లు ఇతర మౌలిక సదుపాయాల విషయంలో ఇంచార్జీ మంత్రి మున్సిపల్, నీటి పారుదల శాఖ అధికారులతో సమన్వయ పరిచి సమగ్రమైన ప్రణాళిక తయారు చేయాలి. కొన్ని చోట్ల స్మార్ట్ సిటీ పనులను వదిలేశారు. పనులను వదిలేయడానికి వీలులేదు. మిగిలిపోయిన పనులను పూర్తి చేయడానికి నివేదికలివ్వండి.
👉 క్లౌడ్ బరస్ట్ ఇక అయిపోయిందన్న నిర్లక్ష్యం వద్దు. గత ఏడాది కూడా ఇలాంటి వర్షాలొచ్చాయి. వాతావరణంలో పెనుమార్పులు సంభవిస్తున్నాయి. ఈ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాల్సిందే.
👉 భారీ వర్షాల వల్ల జరిగిన నష్టం, తీసుకోవలసిన చర్యలపై వారం రోజుల్లోగా కలెక్టర్లు నివేదికలు అందించాలి. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందే. నివేదికలను బట్టి వారం రోజుల్లో అన్ని జిల్లాల కలెక్టర్లు నివేదికలు అందించాలి. నివేదికలు అందిన తర్వాత రాష్ట్ర స్థాయిలో అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించి అవసమైన చర్యలు తీసుకుంటాం.
👉 వరద సహాయక కార్యక్రమాల కోసం ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది. బాధితులను ఆదుకోవడంలో లేదా క్షేత్రస్థాయిలో నివేదికలు రూపొందించడంలో ఎవరు నిర్లక్ష్యం వహించిన ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది.” అని ముఖ్యమంత్రి అన్నారు. ఈ వరదల సమయంలో కొందరు అధికారులు బాగా పనిచేశారని చెబుతూ వారిని ముఖ్యమంత్రి అభినందించారు.

 
													