వేణు @ అభయ్ శాంతి ప్రతిపాదనకు సికాస మద్దతు !

👉 సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస) ప్రకటన !

👉 సికాస మావోయిస్టు పార్టీ మిలిటెంట్ ట్రేడ్ యూనియన్ !


J.SURENDER KUMAR,

కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ @ సోను @అభయ్ శాంతి ప్రతిపాదనను సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస) మద్దతు ప్రకటిస్తూ ఆ సంస్థ కార్యదర్శి అశోక్ బుధవారం ప్రకటన విడుదల చేశారు.

👉 సికాస విడుదల చేసిన ప్రకటనలో….

మా పార్టీలో రెండు పంథాల మధ్య జరుగుతున్న పోరాటం వాస్తవమే గత రెండు సంవత్సరాలుగా మా పార్టీలో రెండు పంథాల మధ్య ఘర్షణ జరుగుతున్నది వాస్తవమే.

👉 విప్లవ పార్టీలో రెండు పంథాల మధ్య పోరాటం అభివృద్ధికరమైనదే. అనేక కేంద్ర కమిటీ సమావేశాలలో పార్టీ అవలంభిస్తున్న వ్యూహం ఎత్తుగడల గురించి లోతైన చర్చలు జరిగినప్పటికీ వాటిని మార్చుకోవడంలో మా కేంద్ర కమిటీ మరియు రాష్ట్ర కమిటీలు విఫలం అయ్యాయనేది వాస్తవం. ఫలితంగా వాస్తవ పరిస్థితులకు పొసగని తప్పుడు ఆదరణ కొనసాగడంతో మా పార్టీ తీవ్రంగా నష్టపోయింది.

👉 మా కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి అమరుడు బస్వరాజు అభయ్ పేరుతో విడుదల చేసిన శాంతిచర్చల ప్రతిపాదనలను, ఆ తరువాత సోను అభయ్ పేరుతో విడుదల చేసిన ప్రకటనలను సైతం కేంద్ర ప్రభుత్వం గుర్తించకుండా పోలీసు ఆపరేషన్లను, ఎన్కౌంటర్స్ను కొనసాగిస్తున్నది.

👉 ప్రజాస్వామిక దేశం అని భావించే మన దేశంలో భారత ప్రభుత్వం ఇటువంటి మొండి వైఖరిని అవలంభించడం ఏ రకంగానూ సరైనది కాదు.

👉 దీర్ఘకాలిక ప్రజాయుద్ధ మార్గంలో మా పార్టీ తీవ్రంగా నష్టపోయిన ఈ స్థితిలో ఆయుధాలను త్యజించి రాజ్యాంగ పరిధిలో చట్టబద్ధంగా ప్రజల సమస్యల పై పని చేస్తూనే రాజ్యాధికారం లక్ష్యంగా విప్లవ పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేసుకోవడమే సరైన ఎత్తుగడగా సికాస గుర్తిస్తున్నది.

👉మెజారిటీ పార్టీ యూనిట్లు శాంతిని నెలకొల్పడం, సాయుధ పోరాటాన్ని విరమించడం అనే విషయంలో సానుకూల వైఖరిని కలిగి వున్నాయి. ఈ సందర్భంగా సికాస మా సిబిఎం సోను శాంతి ప్రతిపాదనలను సమర్థిస్తున్నది

👉 మా పార్టీ యొక్క ఆచరణ పై సుదీర్ఘ కాలం నుండి తెలంగాణ ప్రజలు లోతైన అవగాహన కలిగి వున్నారు. తెలంగాణ ప్రజలు రాజకీయంగా చైతన్యవంతులు. అభ్యుదయ భావాలను ఎల్లప్పుడూ ఆదరిస్తారు.

👉 తెలంగాణ ప్రజల చైతన్యం కారణంగానే సుదీర్ఘ కాలంగా ప్రజాస్వామిక ఉద్యమాలు కొనసాగుతున్నాయి. పార్టీనీ, క్యాడర్లనూ రక్షించుకోవడం కోసం సాయుధ పోరాటం వదిలి చట్టబద్ద పోరాటాలలోకి రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు.

👉 ప్రస్తుత అనివార్య పరిస్థితుల్లో మేము తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రజలు, ప్రజాస్వామిక వాదులు అర్ధం చేసుకోవాలని కోరుతున్నాం.
ఈ శాంతి ప్రక్రియ సజావుగా సాగేందుకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. తెలంగాణ రాష్ట్ర కమిటీ నుండి శాంతి ప్రక్రియనూ, సాయుధ పోరాట విరమణను ఆమోదించిన వారు సికాసను సంప్రదించాలని కోరుతున్నాము అంటూ ప్రకటనలో పేర్కొంది.

👉 మారిన మా మెజారిటీ పార్టీ వైఖరిని గమనంలో వుంచుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాంతిని నెలకొల్పడం కొరకు మా పార్టీతో శాంతి చర్చలు జరపడానికి చొరవ చేయాలని కోరుతున్నాం.

👉 సానుకూల వాతావరణం ఏర్పర్చాలని కోరుతున్నాము. ప్రభుత్వం తమవైపు ప్రతినిథి వర్గాన్ని ప్రకటిస్తే మా పార్టీ వైపు నుండి త్వరలోనే ప్రతినిధులను ఏర్పాటు చేసి ఆయుధాలను త్యజించి, శాంతియుతంగా చట్ట పరిధిలోకి పార్టీని తీసుకువచ్చే ప్రక్రియను ప్రారంభిస్తామని సికాస కార్యదర్శి అశోక్ ప్రకటనలో పేర్కొన్నారు.

👉 సింగరేణి కార్మిక సమాఖ్య ( సికాస )

సింగరేణి ప్రాంతంలో చురుగ్గా పనిచేసే సింగరేణి కార్మిక సమాఖ్య ( సికాస )  మావోయిస్ట్ పార్టీ మిలిటెంట్ ట్రేడ్ యూనియన్, 1978 లో పురుడు పోసుకుంది.

జమ్మికుంట ప్రాంతానికి చెందిన హుస్సేన్ @ రమాకాంత్  సింగరేణిలో జనరల్ మజ్దూర్‌గా పనిచేస్తూ మావోయిస్టు భావజాలానికి ఆకర్షితుడై  వామపక్ష భావజాల కార్మికులతో కలిసి ఆయన సికాసా వ్యవస్థాపక సభ్యులలో ఒకరు. సింగరేణి కార్మికుల సమస్యలు, తదితర అంశాల పరిష్కారంలో గతంలో సికాసాకు గుర్తింపు ఉంది.