ఆడబిడ్డలను ప్రభుత్వం తరఫున సారె పెట్టి గౌరవించడం కోసం !

👉 కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ !

👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !

J.SURENDER KUMAR,

తెలంగాణలోని ఆడబిడ్డలకు ప్రభుత్వం తరఫున సారె పెట్టి గౌరవించాలన్న ఆలోచనతో కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టామని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  చెప్పారు. 2034 నాటికి రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకు వెళుతోందన్నారు.

👉 మాజీ ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ ఇందిరా గాంధీ  జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి  హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు కూడలి వద్ద ఉప ముఖ్యమంత్రి  మల్లు భట్టి విక్రమార్క , ఇతర మంత్రులతో కలిసి ఆ మహనీయురాలి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు.

👉 అనంతరం పలువురు మహిళా సమాఖ్య ప్రతినిధులకు చీరలను అందించి, రాష్ట్ర వ్యాప్తంగా కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా బుధవారం ప్రారంభించారు.

👉 ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  మాట్లాడుతూ, ఈరోజు నుంచి తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం 9 వ తేదీ డిసెంబర్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతగా గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షల చీరల పంపిణీ కార్యక్రమం చేపడుతారని చెప్పారు. మార్చి 1 నుంచి 8 తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం లోపు మున్సిపల్, పట్టణ, నగర ప్రాంతాల్లో పంపిణీ చేస్తామన్నారు.

👉 “ఇందిరా గాంధీ స్ఫూర్తితోనే స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లతో పాటు మహిళా సంఘాలకు జీరో వడ్డీ రుణాలు, పెట్రోల్‌బంక్‌లు అప్పగించడం, ₹ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యమే కాకుండా బస్సులకు యజమానులను కూడా ఆడబిడ్డలను చేశాం. సోలార్ పవర్ ప్లాంట్లు అందించడానికి ప్రత్యేక కార్యాచరణలో ముందుకు వెళుతున్నాం.

👉 స్వర్గీయ ఇందిరా గాంధీ  ప్రధానమంత్రిగా దేశంలో అనేక విప్లవాత్మకమైన, స్ఫూర్తిదాయకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా బడుగు, బలహీన, అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం చివరి రక్తపు బొట్టును ధారపోశారు.

👉 చీరల విషయంలో ఎవరూ బాధ పడాల్సిన అవసరం లేదు. ఇది మన ఆత్మగౌరవం. ప్రతి ఆడబిడ్డకు చీర అందుతుంది. ఆడబిడ్డలకు సారె పెట్టాలన్న ఆలోచనతో చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని నిండు మనసుతో ఆశీర్వదించాలి” అని ముఖ్యమంత్రి  అన్నారు.

👉 ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి తో పాటు మంత్రులు ధనసరి అనసూయ సీతక్క , దామోదర రాజనర్సింహ , కోమటిరెడ్డి వెంకటరెడ్డి , కొండా సురేఖ , పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి , వాకిటి శ్రీహరి, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి తో పాటు ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.