👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !
J.SURENDER KUMAR,
అందెశ్రీ ప్రతి మాట, ప్రతి పాట ప్రజా జీవితం నుంచి వచ్చిందే, ప్రతి పాట ఉద్యమ స్ఫూర్తిని నింపింది. అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తన జీవితాంతం నిస్వార్థంగా తన రక్తాన్ని చెమటగా మార్చి, తన గళాన్ని తెలంగాణకు అంకితం చేశారు. అలాంటి అందెశ్రీ కుటుంబం ఎన్ని సమస్యలు ఎదుర్కొంటుందో నాకు తెలుసు. వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తాం అని సీఎం స్పష్టం చేశారు.
👉 చివరి శ్వాస వరకు జీవితం సర్వస్వాన్ని ధారపోసి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో గొప్ప పాత్రను పోషించిన ప్రజాకవి అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ..’ గీతాన్ని పాఠ్య పుస్తకాల్లో ప్రథమ అంశంగా చేర్చుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.
👉 రాబోయే మంత్రిమండలి సమావేశంలో మంత్రుల సహకారంతో ఈ అంశంపై నిర్ణయం తీసుకోవడంతో పాటు తెలంగాణ ఉన్నంత వరకు అందెశ్రీ పేరును శాశ్వతం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు.
👉 ఘట్‌కేసర్‌లో జరిగిన అందెశ్రీ అంతిమ సంస్కార కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ముఖ్యమంత్రి అక్కడ మీడియాతో మాట్లాడారు.
👉 తెలంగాణ సమాజం కోసం జీవితాన్ని త్యాగం చేసిన అందెశ్రీ కి పద్మశ్మీ అవార్డును అందించి గౌరవించుకోవలసిన అవసరం ఉందని ముఖ్యమంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి విజ్ఞప్తి చేశారు. అందెశ్రీ కి పద్మశ్రీ ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వం సూచిస్తుందని, ఈ విషయంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి , బండి సంజయ్ కూడా చొరవ తీసుకోవాలని కోరారు.

👉 “చివరి శ్వాస వరకు తన సర్వం ధారపోసి తెలంగాణ రాష్ట్ర సాధనలో గొప్ప పాత్ర పోషించిన అందెశ్రీ గారిని కోల్పోవడం వ్యక్తిగతంగా నాకు, నా కుటుంబానికి తీరని లోటు. నాకే కాదు యావత్ తెలంగాణ సమాజానికి ఎంతో బాధాకరం.
👉 తెలంగాణ విషయంలో వారితో చర్చించిన అనేక విషయాలు నాకు గొప్ప స్ఫూర్తినిచ్చాయి. రాష్ట్ర సాధనలో కోట్లాది మందిని ఏకం చేసి, తెలంగాణ ఉద్యమ బాటను నడిపించిన అందెశ్రీ తో మాట్లాడుతున్నప్పుడు, చదువుకోవడానికి పట్నం వచ్చిన తమ్ముడిని ఊర్లో వ్యవసాయం చేసే అన్న చూడటానికి వచ్చినప్పుడు కలిగే అనుభూతి కలుగుతుంది.
👉 పరిపాలనలో పేదలకు ప్రయోజనం చేకూర్చాలన్న ఆలోచన వచ్చినప్పుడు గద్దరన్నతో పాటు అందెశ్రీ సమానమైన స్ఫూర్తిని కలిగించారు. వారు రాసిన జయ జయహే.. గీతం కోట్లాది ప్రజలకు స్ఫూర్తినిచ్చింది. తెలంగాణ ఏర్పడిన 10 సంవత్సరాల తర్వాత రాష్ట్ర గీతంగా కోట్లాది మంది ప్రజలకు స్ఫూర్తిని నింపుతోంది.
👉 అందెశ్రీ ని ఖననం చేసిన ప్రాంతాన్ని స్మృతివనంగా తీర్చిదిద్దుతాం. తెలంగాణ ఉన్నంత కాలం అందెశ్రీ పాత్రను శాశ్వతం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం.
👉 వారు చేసిన రచనలకు సంబంధించిన పుస్తకం నిప్పులవాగు పుస్తకం ఒక స్ఫూర్తి. ఒక ప్రజ్వలనం. భవిష్యత్ తరాలకు ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్ లా తెలంగాణ యువతకు, ఉద్యమ కారులకు, సమస్యలపై పోరాటం చేసే వారికి దిక్సూచిలా పనిచేస్తుంది.
👉 తెలంగాణ సమాజానికి వారి రచనలు అందించే విధంగా నిప్పులవాగు పుస్తకాన్ని 20 వేల ప్రతులను రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ లైబ్రరీల్లో ఉంచడానికి చర్యలు తీసుకుంటాం. ఇవే కాకుండా అందెశ్రీ ని అభిమానించే వారందరి సూచనలు తీసుకుని వారి పేరు శాశ్వతంగా, పదిలంగా ఉండటానికి ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటుంది.
👉 అందెశ్రీ ఏనాడూ ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ పరిస్థితుల గురించి ఆలోచన చేయలేదు. సమాజమే తన కుటుంబంగా భావించిన గొప్ప మానవతా వాది. అందెశ్రీ పట్ల అభిమానం చూపించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు” అని ముఖ్యమంత్రి అన్నారు.
