👉 మీ ప్రభుత్వంలో మేడిగడ్డ బ్యారేజ్ కుంగింది వాస్తవం కాదా ?
👉 చెక్ డ్యామ్ ల నిర్మాణంలపై విజిలెన్స్ విచారణ జరిపించాలి !
J.SURENDER KUMAR,
అసత్యపు ఆరోపణలకు బీఆర్ఎస్ నాయకుల పెట్టింది పేరు అని టిపిసిసి ఎన్నికల కమిషన్ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు, న్యాయవాది శశిభూషణ్ కాచే అన్నారు. గురువారం మంథని లో మంత్రి శ్రీధర్ బాబు క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో కాచే మాట్లాడారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మానేరు పై నాణ్యత లేకుండా నిర్మించిన చెక్ డ్యాంలు కూలిపోవడంపై మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
గుంపుల వద్ద మానేరు నదిపై నిర్మించిన చెక్ డ్యాం నాణ్యత లోపంతో కూలిపోతే బాంబులుతో పేల్చి వేశారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించడం హాస్యస్పదమని అన్నారు. అసత్యపు ఆరోపణలు బీఆర్ఎస్ నాయకులు వారు మానుకోవాలని సూచించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోతే బాంబులతో పేల్చారని అప్పుడు అసత్యపు ఆరోపణలు చేస్తూ తెలంగాణ, మహారాష్ట్ర పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదులు చేయించారని కాచే గుర్తు చేశారు.
మానేరు పై దాదాపు ₹ 300 కోట్లతో నిర్మించిన చెక్ డ్యాంలు నాణ్యత లోపంతో కూలిపోయి వరదల్లో కొట్టుకుపోయాయని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సంఘటన జరిగితే కుంగిపోవడం, ప్రస్తుత ప్రభుత్వంలో సంఘటన జరిగితే పేల్చివేయడం అనడం ఎంతవరకు సమంజసమని శశిభూషణ్ ప్రశ్నించారు.
గత ప్రభుత్వంలో ఓడేడు మానేరు పై నిర్మించిన బ్రిడ్జి వర్షం వరదలకు కొట్టుకుపోయింది నిజం కాదా ? అని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించారు. మాజీ నీటి పారుదల శాఖ మంత్రి స్వీయ పర్యవేక్షణలో నిర్మించిన కాళేశ్వరం బ్యారేజ్, చెక్ డ్యాంలు, బ్రిడ్జిలు నాసిరకంతో నిర్మించి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. గత ప్రభుత్వ కట్టడాల పైన విజిలెన్స్ అధికారులు విచారణ జరిపి వెంటనే గత ప్రభుత్వ ప్రతినిధుల పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుత రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు లకు గత ప్రభుత్వ అవినీతిపైన ఫిర్యాదు చేయనున్నట్లు శశి భూషణ్ కాచే స్పష్టం చేశారు.
సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదల వెంకన్న, ఆర్టిఏ సభ్యుడు సురేష్, కాంగ్రెస్ పార్టీ యూత్ మండల అధ్యక్షుడు సాధుల శ్రీకాంత్, కాంగ్రెస్ నాయకులు శంకర్, పర్షవన మోహన్ యాదవ్, తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
