సిబిఐ విచారణ కు హాజరైన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు దంపతులు !

👉 న్యాయవాది వామన్ రావు దంపతుల హత్య కేసులో


J.SURENDER KUMAR,

ఇది రాజకీయ కుట్ర మాత్రమే తన రాజకీయ ఎదుగుదలను అడ్డుకునేందుకు మంథని ఎమ్మెల్యే తెర వెనుక ఉండి తనపై హత్య కేసును మోపేందుకు ప్రయత్నిస్తున్నారని సిబిఐ విచారణకు హాజరైన అనంతరం మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు సోమవారం మీడియా సమావేశంలో ఆరోపించారు.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గట్టు వామన్ రావు నాగమణి దంపతుల హత్య కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ దర్యాప్తు చేస్తున్న విషయం విధితమే.


విచారణలో భాగంగా సిబిఐ అధికారులు సోమవారం విచారణకు రావాలని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు దంపతులకు సమాచారం ఇచ్చారు.  ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం రామగుండం పోలీస్ కమిషనరేట్ లో ఏర్పాటు చేసిన సీబీఐ ప్రత్యేక కార్యాలయానికి పుట్ట మధు దంపతులు చేరుకున్నారు. విచారణకు సిబిఐ అధికారుల ముందుకు వెళ్లిన వారు దాదాపు మూడు గంటల పాటు అక్కడే ఉన్నారు. 

సీబీఐ అధికారుల విచారణ తర్వాత పోలీస్ కమిషరేట్ బయటకు వచ్చారు. సుమారు మూడు గంటల పాటు హత్య కేసుకు సంబంధించిన పలు అంశాలపై వారిని సీబీఐ అధికారులు విచారించినట్టు సమాచారం.

వామన్ రావు తండ్రి కిషన్ రావు  హత్య జరిగిన సమయంలో ఎక్కడ తమ పేర్లను ప్రస్తావించలేదని, సుప్రీం కోర్టులో సీబీఐ విచారణ కోరుతూ వేసిన పిటీషన్ ల ఒత్తిడి పెంచేందుకు తమ పేర్లు చేర్చారన్నారు అనిమాజీ ఎమ్మెల్యే పుట్ట మధు మీడియా తో అన్నారు.

రాజకీయాల్లో తాను  ఉండకూడదన్న కుట్రలో భాగంగానే తెర వెనుక మంథని ఎమ్మెల్యే  శ్రీధర్ బాబు రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. హైకోర్టులో ఉన్న మంథని మధుకర్ హత్య కేసును ఎందుకు వెలుగులోకి తీసుకురావడం లేదని ప్రశ్నించారు.

వామన్ రావు దంపతుల హత్య కేసులో తమ అల్లుడు ఉన్నాడన్న కారణంతో పదే పదే ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ తమకు అంటగట్టేందుకు ప్రయత్నిస్తు న్నారని ఆరోపించారు.

తమకు చట్టాలు, రాజ్యాంగం అంటే గౌరవం ఉందని, సీబీఐ విచారణతో వాస్తవాలు వెల్లడవుతాయని ఆశిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అన్నారు.