J.SURENDER KUMAR,
4వ జాతీయ ఏకలవ్య మాడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ స్పోర్ట్స్ మీట్ 2025 లో ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌ను సాధించిన విద్యార్థులను శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు.
ఒడిశాలోని రూర్కేలాలో నవంబర్ 11 నుంచి 15 వరకు జరిగిన ఈఎంఆర్ఎస్ స్పోర్ట్స్ మీట్ 2025 లో అథ్లెటిక్స్, ఆర్చరీ, స్విమ్మింగ్, జిమ్నాస్టిక్స్, బాక్సింగ్, జూడో, రెజ్లింగ్, వెయిట్ లిఫ్టింగ్, టైక్వాండో, యోగా, షూటింగ్, చెస్‌తో పాటు ఇతర ఈవెంట్లలో అన్ని రాష్ట్రాలకంటే అత్యధికంగా తెలంగాణ విద్యార్థులు రికార్డు స్థాయిలో 230 పతకాలు గెలిచి ఓవరాల్ ఛాంపియన్స్‌గా నిలిచారు. ఈ సందర్భంగా విద్యార్థులు, అధికారులు రాష్ట్ర.ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు.

👉 ఈ జాతీయ క్రీడల్లో తెలంగాణలోని ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని 23 పాఠశాలల నుంచి 580 విద్యార్థులు పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా 22 రాష్ట్రాల నుంచి 499 ఈఎంఆర్ఎస్ సంస్థలకు చెందిన 5,500 మంది విద్యార్థులు ఈ క్రీడల్లో పాల్గొన్నారు.
👉 ఈ క్రీడల్లో నిర్వహించిన 22 ఈవెంట్లలో 15 వ్యక్తిగత ఈవెంట్లు, 7 జట్టు ఈవెంట్లు ఉన్నాయి. వాటిల్లో దాదాపు అన్ని విభాగాల్లో తెలంగాణ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబరిచారు.

👉 ఈ క్రీడల్లో మొత్తంగా 230 పతకాలతో (88 బంగారు, 66 వెండి, 76 కాంస్య పతకాలు), 714 పాయింట్లు సాధించి ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుని తెలంగాణ కీర్తిని జాతీయ స్థాయిలో చాటారు. వీటిల్లో టీమ్ ఈవెంట్స్, వ్యక్తిగత ఈవెంట్లలోనూ తెలంగాణ విద్యార్థులు సత్తా చాటి అన్ని రాష్ట్రాలకన్నా అగ్రభాగాన నిలిచారు.

👉 స్పోర్ట్స్ మీట్ 2025 లో ఓవరాల్ ఛాంపియన్ షిప్ సాధించిన నేపథ్యంలో విద్యార్థులు ముఖ్యమంత్రి ని కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి విద్యార్థులను ప్రశంసిస్తూ, భవిష్యత్తులోనూ ఇదే క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
