👉 ఢిల్లీలో జరిగిన యూఎస్ – ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సు లో….!
👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !
J.SURENDER KUMAR,
అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు, పరిశ్రమలకు అనువైన వాతావరణం, భద్రతకు ఎటువంటి ఢోకా లేకుండా భౌగోళికంగా కేంద్రస్థానంలో ఉన్న హైదరాబాద్ నగరం ప్రపంచవ్యాప్త పెట్టుబడిదారులకు ఉత్తమ భద్రత నగరం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
దేశంలోనే పెద్ద సంఖ్యలో యువత, వేగవంతమైన వృద్ధి రేటుతో ఉన్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. ఢిల్లీలో జరిగిన యూఎస్ – ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సు లో ముఖ్యమంత్రి ప్రసంగించారు.
👉 తెలంగాణలో గత 35 ఏళ్లుగా కాంగ్రెస్‌తో పాటు అనేక పార్టీలు ప్రభుత్వాలకు సారథ్యం వహించినా, పెట్టుబడులకు మరియు పెట్టుబడిదారులకు అందరూ మద్దతుగా నిలిచారని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. భారతదేశంలో పెట్టుబడులకు హైదరాబాద్ ప్రధాన ద్వారం అని తెలిపారు. జీసీసీలకు గమ్యస్థానంగా ఉన్న హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు.
👉 మహిళా సాధికారిత, నాణ్యమైన విద్య, యువతకు నైపుణ్య శిక్షణ, పట్టణాభివృద్ధితో పాటు మెరుగైన వసతులు, అత్యున్నత జీవన ప్రమాణాలతో కూడిన అంతర్జాతీయ స్థాయి నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడమే తన ప్రథమ ప్రాధాన్యత అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
👉 గత 23 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించిన ముఖ్యమంత్రి, అద్భుతమైన మౌలిక వసతులతో 30 వేల ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ భారత్‌లోనే అత్యాధునిక నగరంగా రూపుదిద్దుకుంటోందని తెలిపారు. మూసీ నది పునరుజ్జీవనం పూర్తయితే లండన్, టోక్యో, దుబాయ్, సియోల్ రివర్‌ఫ్రంట్‌ల మాదిరిగా హైదరాబాద్ నైట్ ఎకానమీ కొత్త దశలోకి ప్రవేశిస్తుందని అన్నారు.
👉 డ్రైపోర్ట్, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్లు, మధ్య మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ వంటి కీలక ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల పురోగతిని వివరించారు. చైనా ప్లస్ వన్ మోడల్‌కు గ్లోబల్ సమాధానం తెలంగాణ అవుతుందని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు.
👉 హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్, ఆక్స్‌ఫర్డ్ వంటి ఐవీ లీగ్ విశ్వవిద్యాలయాలు హైదరాబాద్‌లో ఆఫ్‌షోర్ క్యాంపస్‌లు ఏర్పాటు చేస్తే, తక్కువ ఖర్చుతో, సులభమైన వీసా విధానాల ద్వారా గ్లోబల్ సౌత్ విద్యార్థులకు నాణ్యమైన విద్య లభిస్తుందని ముఖ్యమంత్రి ప్రపంచస్థాయి విద్యాసంస్థలను ఆహ్వానించారు.

👉 భారతదేశంలో రోడ్లకు ఎక్కువగా నేతల పేర్లు ఉంటాయని, హైదరాబాద్‌లో ఆ ట్రెండ్‌ను మార్చాలని తాము అనుకుంటున్నామని, ముఖ్యమైన రోడ్లకు గూగుల్, మెటా, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి సంస్థల పేర్లను ఇవ్వాలన్న ఆలోచన ఉందని ముఖ్యమంత్రి తెలిపారు.
సదస్సు ప్రారంభంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ను ప్రదర్శించారు.
👉 తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి లక్ష్యానికి, తెలంగాణ రైజింగ్ 2047 విజన్ కు సదస్సులో విశేష స్పందన లభించింది. గ్లోబల్ ఇన్వెస్టర్లకు పెట్టుబడుల అవకాశాలు వివరిస్తూ సాగిన ముఖ్యమంత్రి ప్రసంగం అంతర్జాతీయ వ్యాపార వర్గాలను ఆకట్టుకుంది.
👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ విజన్ పారదర్శకంగా, సాహసోపేతంగా, సాధించదగినదిగా ఉందని, తెలంగాణ ప్రభుత్వ ప్రణాళికలు, భవిష్యత్ ప్రాజెక్టులు, వాటి సామాజిక ప్రభావం ఎంతో ప్రేరణాత్మకంగా ఉన్నాయని టెక్ దిగ్గజం సిస్కో మాజీ సీఈఓ జాన్ ఛాంబర్స్ ప్రశంసించారు.
👉 ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు USISPF సభ్యులలో అత్యధికులు డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సు కు హాజరవుతారని, తెలంగాణ విజన్‌ను దగ్గరగా తెలుసుకునేందుకు ఆసక్తిగా ఉన్నామని అధ్యక్షుడు డాక్టర్ ముఖేష్ ఆఘీ తెలిపారు.
