👉 రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో !
J.SURENDER KUMAR,
గత ప్రభుత్వం తరహాలో, ప్రస్తుత ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలను విస్మరిస్తే రాష్ట్ర వ్యాపితంగా ఆందోళన బాట తప్పదని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) స్పష్టం చేసింది.
రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని పొద్దటూరులో గురువారం ప్రగతి రిసార్ట్స్ లో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కే. విరాహత్ అలీ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో, జర్నలిస్టుల ప్రధాన సమస్యలు, వాటి పరిష్కారంలో ప్రభుత్వం నుండి జరుగుతున్న జాప్యం పై కార్యవర్గం చర్చించింది. ప్రస్తుత ప్రభుత్వం అధికారాన్ని చేపట్టి దాదాపు రెండేళ్లు కావస్తున్నా, జర్నలిస్టుల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించక పోవడం విచారకరమని సమావేశం అభిప్రాయపడింది.
గత ప్రభుత్వం ఇలాంటి వైఖరినే అనుసరిస్తే గల్లీ నుండి ఢిల్లీ దాక తమ సంఘం లెక్కలేనన్ని ఉద్యమాలు చేపట్టిన విషయాన్ని సమావేశం గుర్తుచేసింది. జర్నలిస్టుల ప్రధాన సమస్యలైన ఇంటి స్థలాలు, ఆరోగ్య పథకం, అక్రెడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియను వీలైనంత తొందరలో పరిష్కరించాలని సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

ఈఅంశంపై ఐజేయు జాతీయ అధ్యక్షులు, మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. ఇప్పటికే ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించి సమస్యల పరిష్కారానికి చర్చించినట్లు ఆయన స్పష్టం చేసారు.
ఫిబ్రవరి మొదటి వారంలో విజయవాడలో జరగనున్న ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయు) జాతీయ ప్లీనరీని విజయవంతం చేసేందుకు సన్నాహాలు ప్రారంభమైనట్లు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అయితే ఈ ప్లీనరీ సందర్భంలో జనవరి మాసంలో రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ కేంద్రాల్లో సదస్సులు నిర్వహించేందుకు సమావేశం నిర్ణయించింది. మహాసభలు పెండింగులో ఉన్న జిల్లాల్లో జనవరి మొదటి వారంలోపు వాటిని పూర్తి చేయాలని సమావేశం నిర్ణయించింది.

యూనియన్ నియమించిన ఆయా సబ్ కమిటీల సమావేశాలను త్వరలో నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. ఇటీవల జరిగిన హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కార్యవర్గ ఎన్నికల్లో ఫ్రెండ్స్ ప్యానెల్ కు మద్దతు పలికి, ప్యానెల్ గెలుపు కోసం శ్రమించిన రాష్ట్ర అధ్యక్షులు కే. విరాహత్ అలీతో పాటు ఇతర నాయకులను కార్యవర్గం అభినందించింది.
అలాగే ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గానికి సమావేశం శుభాకాంక్షలు తెలిపింది. గత కార్యవర్గ సమావేశం తర్వాత యూనియన్ చేపట్టిన వివిధ కార్యక్రమాలపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. రాంనారాయణ నివేదిక సమర్పించారు. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో అకాల మరణం చెందిన 16మంది జర్నలిస్టులకు సమావేశం నివాళి అర్పిస్తూ, సంతాప సూచికగా మౌనం పాటించింది. రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశానికి ఆథిత్యం ఇచ్చిన రంగారెడ్డి జిల్లా శాఖను సమావేశం కృతజ్ఞతలు తెలిపింది.
సమావేశంలో ఐజేయు జాతీయ మాజీ అధ్యక్షులు, స్టీరింగ్ కమిటీ సభ్యులు దేవులపల్లి అమర్, ఎం.ఏ. మాజీద్, జాతీయ కార్యదర్శి వై. నరేందర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు కల్లూరి సత్యనారాయణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు బి. సంపత్ కుమార్, గాడిపల్లి మధు గౌడ్, కార్యదర్శులు కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి, జి. మధు గౌడ్, కోశాధికారి మోతె వెంకట్ రెడ్డి, రాష్ట్ర చిన్న, మధ్యతరగతి పత్రికల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యూసుఫ్ బాబు, అశోక్ లతో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, 30 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.
