👉 ట్రక్ షీట్ల లో నమోదు అయినా రైస్ మిల్లర్లపై చర్యలకు జంకుతున్న యంత్రాంగం !
👉 విండో కార్యదర్శిని బలి పశువును చేశారా ?
👉 అడిషనల్ కలెక్టర్ తనిఖీలలోనే వెలుగు చూసిన ట్రక్ షీట్ల అవకతవకలు !
J.SURENDER KUMAR,
సన్నధాన్యం కొనుగోలులో వెలుగు చూసిన అవినీతి లో ధాన్యం సేకరించిన బాధ్యులైన కొన్ని రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకోకుండా, ఏదో మొక్కుబడిగా సింగిల్ విండో కార్యదర్శిని బాధ్యుడిని చేస్తూ. సస్పెండ్ చేసి ప్రభుత్వ యంత్రాంగం ఆ ఉద్యోగిని బలి పశువును చేశారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ట్రక్ షీట్ మాయాజాలంలో సూత్రధారులు పాత్రధారులను, తప్పించి అవినీతి అక్రమాల కథ అటకెక్కించారు అని జగిత్యాల జిల్లా ప్రభుత్వ యంత్రాంగం పై ఆరోపణలు, విమర్శలు వినిపిస్తున్నాయి.
👉 వివరాల్లోకి వెళితే..
సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలన ప్రభుత్వ మానస పుత్రిక, పేద ప్రజలకు రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ పథకం. ఈ పథకం ను జిల్లాలో కొన్ని రైస్ మిల్లర్లు తమ పాలిట వరంగా మార్చుకొని ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. సన్న ధాన్యం కొనుగోలు అక్రమాల ఉదాంతం పై గత శుక్రవారం ధర్మపురి మండలంలో అడిషనల్ కలెక్టర్ తనిఖీలలో వెలుగు చూసింది.

అక్రమ పద్ధతిలో ఆయా మిల్లర్లకు ధాన్యం చేరినట్టు దమ్మన్నపేటలో అధికారులు స్వాధీనపర్చుకున్న ట్రక్ షీట్ రికార్డులలో మిల్లుల పేరు స్పష్టంగా అగుపిస్తున్న ఆ మిల్లులపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వ యంత్రాంగం జంకుతున్నట్టు చర్చ మొదలైంది.
👉 అక్రమాలు వెలుగు చూసింది ఇలా..
ధాన్యం సేకరణకు ప్రభుత్వం, బ్యాంక్ గ్యారంటీ (BG) కలిగి ఉన్న రైస్ మిల్లర్లకు ఆయా ప్రాంతాల ధాన్యం కొనుగోలు కేంద్రాలను కేటాయిస్తుంది. ఓ రైస్ మిల్లుకు కేటాయించిన కేంద్రాల నుండి ధాన్యం ఆ రైస్ మిల్లుకు తరలించకుండా నిర్వాహకులు మరో రైస్ మిల్లుకు వందలాది లారీల ధాన్యం తరలిస్తున్నారు అనే సమాచారంతో ఈ బాగోతం వెలుగు చూసింది.
ఈ నేపథ్యంలో రైస్ మిల్ యజమాని కి ప్రభుత్వం కేటాయించిన కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యం రావడంలేదని ఇతర రైస్ మిల్లులకు నిర్వాహకులు తరలిస్తున్నారని ఫిర్యాదు చేసినట్టు సమాచారం.

మిల్లు యాజమాని ఫిర్యాదు మేరకు ఈనెల 21న అడిషనల్ కలెక్టర్, జిల్లా సివిల్ సప్లై అధికారి, తహసీల్దార్ తదితరుల ఆధ్వర్యంలో ధర్మపురి మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను వారు ఆకస్మికంగా తనిఖీలు చేశారు.
దమ్మన్నపేట గ్రామంలోని కొనుగోలు కేంద్రం నుండి తరలిస్తున్న ధాన్య వాహనంలో గ్రేడ్ వన్ సన్న వడ్లు సాయిరాం తరలిస్తూ, ట్రక్ షీట్ లో బిపిటి వడ్లు / దొడ్డు వడ్లుగా నమోదు చేసిన ఉదంతా తనిఖీ అధికారుల బృందం గుర్తించి నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేసి రికార్డులను స్వాధీన పరుచుకున్నారు.
విచారణ జరిపిన అధికారులు కొనుగోలు కేంద్ర నిర్వహకులను తొలగించడంతోపాటు ట్రక్ షీట్ నమోదులో అవినీతికి పాల్పడిన సింగిల్ విండో కార్యదర్శిని గత కొన్ని రోజుల క్రితం సస్పెండ్ చేసినట్టు అధికారులు ప్రకటించారు.
👉 రైస్ మిల్ పై చర్యలు ?
దమ్మన్నపేట ఇతర కొనుగోలు కేంద్రాల నుండి నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ధాన్యం సేకరించిన రైస్ మిల్లుపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు ? ట్రక్ షీట్ లలో నమోదైన రైస్ మిల్లులో అధికార యంత్రాంగం రికార్డులను, ధాన్యం నిల్వలు, తనిఖీలు చేశారా ? లేదా ? అనేది గురువారం నాటికి చిదంబర రహస్యంగా కొనసాగుతున్నది.
ఇదిలా ఉండగా దేశంలో రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ పథకం అమలు చేస్తున్న ఏకైక మొదటి రాష్ట్రం తెలంగాణ.
