మా లొంగుబాటుతో కొంత కాలం ఎన్కౌటర్ లు జరగలేదు !

👉ఎన్కౌంటర్ల పై ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నం చేసాం !

👉 ఉప్పు ప్రతినిధి, సురేందర్ కుమార్ తో. మల్లోజుల వేణుగోపాల్ @ సోను, @ అభయ్!

J.SURENDER KUMAR,

మాలొంగుబాటు తర్వాత కొంత కాలం ఎన్కౌటర్లు జరగలేదు. ఎన్కౌంటర్ల పై ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నం చేసాం, అని మల్లోజుల వేణుగోపాలరావు @ సోను, @ అభయ్ అన్నారు.
అజ్ఞాతంలో ఉన్న కామ్రేడ్స్, మావోయిస్టు నాయకులు, దళాలు, దళ నాయకులు ఆయుధాలు వదులుకుని పోలీసులకు లొంగుబాటు, వెసులుబాటు కోసం కృషి చేశాను, శాంతి చర్చలు, కాల్పుల విరమణకు  కృషి చేశాను. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు మా శక్తి సామర్ధ్యాలు చాలడం లేదు అని జనజీవన స్రవంతిలో కలిసిన మాజీ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్  అన్నారు.

బుధవారం ఆయన మీడియాకు విడుదల చేసిన వీడియో సందేశంలో, పిఎల్‌జిఎ మొదటి బెటాలియన్ కమాండర్ మాదివి హిడ్మాతో నిరంతర ఎన్‌కౌంటర్లు జరుగుతున్నట్లు నివేదికలు వచ్చాయని, మంగళవారం జరిగిన ఒక సంఘటనలో ఐదుగురు మరణించారని, గతంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారని వేణుగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు.

👉 గత నాలుగు రోజులుగా వేణుగోపాల్, ప్రచార సాధనాలు ప్రకటించిన సెల్ ఫోన్ నెంబర్ కు పలుసార్లు ఉప్పు ప్రతినిధి, ప్రయత్నించగా శుక్రవారం మల్లోజుల వేణుగోపాల్ ఫోన్ లో మాట్లాడారు…


👉 ఉప్పు ప్రతినిధి !

దండకారణ్యంలో భద్రత దళాల మొహరించి ఉన్న ప్రస్తుత పరిస్థితులలో అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు లొంగుబాటుకు వెసులుబాటు  సాధ్యమా ?

👉 వేణుగోపాల్…….

మీరు గమనించండి సెప్టెంబర్ మొదటి వారం నుంచి నవంబర్ మొదటివారం వరకు దండకారణ్యంలో ఎన్కౌంటర్లు జరిగాయా ? అంతర్గతంగా దళాలకు, దళ సభ్యులకు లేఖలు రాయడం, సానుభూతిపరులతో చర్చించడం, సమాచారం ఇవ్వడం లొంగుబాటుకు వెసులుబాటు పరిస్థితి ఉందని మా మార్గాల ద్వారా ప్రయత్నాలు చేశాము, చేస్తూనే ఉన్నాము.

👉 ఉప్పు ప్రతినిధి !

మీరు జనజీవన స్రవంతిలో చేరిక గూర్చి..

👉 వేణుగోపాల్…..

మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆయుధాలతో పోరాడటం సాధ్యం కాదని భావించి తాను, తన సహచరులు ఒకటిన్నర నెల క్రితం ఆయుధాలను వదులుకొని ప్రధాన స్రవంతిలో చేరమన్నారు.

👉 ఉప్పు ప్రతినిధి !

మీది సమిష్టి నిర్ణయమా ? మీ సొంత నిర్ణయమా ?

👉 వేణుగోపాల్…..

ఉద్యమమే ఊపిరిగా నా సుదీర్ఘ అజ్ఞాత ప్రస్థానంలో 28 సంవత్సరాల కేంద్ర కమిటీ సభ్యుడిగా 18 సంవత్సరాలు పొలిటి బ్యూరో సభ్యుడిగా, కొనసాగిన నేను పలు సందర్భాల లో ఆయుధాలు వదలి జన జీవన స్రవంతిలోకి వెళ్లడానికి సమిష్టిగా చర్చించాను.


నా అభిప్రాయాలు తోటి కామ్రేడ్స్ కు వివరించాను. మెరిట్స్ డి మెరిట్స్ పై అనేకసార్లు మేధోమదనం జరిగింది. దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు, నాతోటి కామ్రేడ్స్ అవగాహన చేసుకొని ఆయుధాలతో పాటు 60 మంది కీలక నాయకులు, కామ్రేడ్స్ నాతో పాటు జనజీవన స్రవంతిలో కి రావడం  నా సొంత నిర్ణయమా?  సమిష్టి నిర్ణయమా ? ఆలోచించండి.

👉  ఉప్పు ప్రతినిధి!


మీరు, మీ అనుచరులు, పార్టీ  ఆయుధాలను పార్టీకి అప్పగించి జనజీవన స్రవంతిలోకి రావచ్చు కదా ?


👉 వేణుగోపాల్……


దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు, మా సిద్ధాంతాల పోరాటాలు, అజ్ఞాతంలో ఉంటూ ఆయుధాలతో పోరాటం సాధ్యం కాదు అని జనజీవన స్రవంతిలో చేరాము.  మా ఆయుధాలను పార్టీకో, మరొకరికో అప్పగించినా, పరోక్షంగా ఆయుధాలతో పోరాటానికి మరికొందరిని సిద్ధం చేసినట్టు కదా ?  ప్రజాస్వామిక పద్ధతిలో ప్రజా సమస్యలపై పోరాటానికే జన జీవన స్రవంతిలో కలిశాము అందుకే ఆయుధాలను ప్రభుత్వానికి అప్పగించాం.

👉 ఉప్పు ప్రతినిధి !

హిడ్మా తదితరులు ఎన్కౌంటర్ గూర్చి….

👉 వేణుగోపాల్…..

హిడ్మా ,తోటి కామ్రేడ్స్ ఎన్కౌంటర్ లో మృతి చెందడం నన్ను తీవ్రంగా కలచివేసింది.  ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో చేరిక విషయంపై ఆగస్టు 2 న పార్టీ లో చర్చ, తీర్మానం జరిగింది. హిడ్మా, దేవ్ జి కూడా ఉన్నారు. మనతో పాటు  మన వెన్నంటే ఉన్న కామ్రేడ్స్ కు ఉపాధి అవకాశాలు మనమే ప్రభుత్వం ద్వారా కల్పించకపోతే వారి పరిస్థితి ఏమిటి ? వారి జీవనం ఎలా ? అనే చర్చ జరిగిందన్నారు.

( ఆ సమావేశంలో జరిగిన కొన్ని విషయాలు చెప్పలేను )

👉 ఉప్పు ప్రతినిధి !

గణపతి, తిరుపతి,  తదితర నాయకుల గూర్చి   పౌర హక్కుల సంఘాలు, మేధావులు, ప్రజాస్వామికవాదులు, న్యాయస్థానాలను ఆశ్రయించడం, రౌండ్ టేబుల్ సమావేశాలతో వారి తపన ఆవేదన మీరు గమనించారా ?

👉 వేణుగోపాల్…..

కేంద్రం ప్రభుత్వం మొండిగా  కాల్పుల విరమణకు ఒప్పుకోవడం లేదు, ఆ స్థాయిలో నేను ప్రభావితం చేసే పరిస్థితి లేదు, అయినా ప్రయత్నం  చేస్తున్నాను.

👉 ఉప్పు ప్రతినిధి!

పౌర సమాజం మీ నిర్ణయం పట్ల ఎలా..?

👉 వేణుగోపాల్….


సెంట్రల్ యూనివర్సిటి కి చెందిన మేధావులు, తెలంగాణతోపాటు ఇతర  రాష్ట్రాలకు చెందిన ప్రజాస్వామికవాదులు, పౌర హక్కుల సంఘం నాయకులు,  మేధావులతో పాటు చత్తీస్గడ్ హోమ్ మినిస్టర్ తో నవంబర్ మొదటి వారంలో  గెట్ టుగెదర్ జరిగింది.  పలు అంశాలు చర్చకు వచ్చాయి, మా నిర్ణయాన్ని వారు అభినందించారు.  శాంతి చర్చలు, సమాజంలో ప్రశాంత వాతావరణం కోసం పలు సలహాలు సూచనలు అభిప్రాయాలను వారు వ్యక్తం చేశారు. అజ్ఞాతంలో ఉన్న మా కామ్రేడ్స్ పరిస్థితులను అవగాహన చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.

👉 ఉప్పు ప్రతినిధి !

ముప్పాల లక్ష్మణరావు, @ గణపతి, దేశంలో ఉన్నాడా ? విదేశాలలో ఉన్నాడా.?

👉 వేణుగోపాల్..

మీరు  ప్రచార మాధ్యమాలలో ( టీవీ చానల్స్ లో)
కామ్రేడ్ జంపన్న  పార్టీ గూర్చి వివరిస్తున్న తీరు వాస్తవాలు, ఆయనకు పార్టీ పట్ల సంపూర్ణ అవగాహనతోనే వివరిస్తున్నాడు. ప్రస్తుతం రహస్య స్థావరాల నుంచి బయటికి వెళ్ళలేని దుస్థితి.

👉 ఉప్పు ప్రతినిధి!


చివరగా ఏం చెప్పదలుచుకున్నారు !

👉 వేణుగోపాల్…

ప్రజా సమస్యలను రాజ్యాంగబద్ధంగా పరిష్కరించడానికి కామ్రేడ్స్ పని చేయవచ్చు. సాయుధ పోరాటం వల్ల మేము చాలా నష్టపోయాం. ప్రపంచం మారిపోయింది, దేశం మారిపోయింది, పరిస్థితులు మారుతున్నాయి, కాబట్టి ఆయుధాలతో పోరాడటానికి బదులుగా అజ్ఞాతంలో ఉన్న మా కామ్రేడ్స్ ప్రధాన స్రవంతి సమాజంలో చేరాలని అన్నారు.

శాంతి కోసం విజ్ఞప్తి చేస్తూ, చురుకైన మావోయిస్టులు లొంగిపోవాలని, సమాజంలో తిరిగి కలిసిపోవాలని , కొత్త జీవితాలను ప్రారంభించడానికి ప్రభుత్వ పునరావాస పథకాలను ఉపయోగించుకోవాలని వేణుగోపాల్ కోరారు.ప్రస్తుతంరాజ్యాంగం ప్రకారం ప్రజల కోసం పనిచేయడమే ఏకైక పరిష్కారం అని మల్లోజుల వేణుగోపాల్ అన్నారు.