👉 టియుడబ్ల్యుజె రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానం !
J SURENDER KUMAR,
కేంద్ర ప్రభుత్వం అమలులోనికి తీసుకొచ్చిన నూతన ‘లేబర్ కోడ్’లను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయవద్దని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేయాలని టియుడబ్ల్యుజె-ఐజెయు, కేంద్ర కార్మిక సంఘాలు తీర్మానించాయి. నూతన లేబర్ కోడ్‌లను రద్ధు చేయాలని డిమాండ్ చేస్తూ సంయుక్త కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ధర్నాలతో పాటు ఇందిరాపార్క్ వద్ద ‘కార్మికుల తలపెట్టనున్న నిరసన గళం’ కార్యక్రమంలో పాల్గొని, విజయవంతం చేయాలని రౌండ్ టేబుల్ సమావేశం పిలుపునిచ్చింది.
👉 తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యుజె) అధ్యక్షుడు కె.విరాహత్ అలీ అధ్యక్షతన బషీర్‌బాగ్‌లోని దేశోద్ధారక భవన్‌లో మంగళవారం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు.
👉 ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమి చైర్మన్, ఐజెయు జాతీయ అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లతో కార్మికులతో పాటు వైట్ కాలర్ ఉద్యోగులు పరోక్షంగా తమ హక్కులను కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
👉 ప్రధాని మోడి కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ కనీసం కార్మిక సంఘాల నేతలతో చర్చించకుండానే నూతన లేబర్ కోడ్‌లను అమలు చేయడం ఆశ్చర్యకరమన్నారు. నూతన లేబర్ కోడ్‌లపై ప్రధాన మీడియాలు చర్చలు పెట్టకపోవడం విడ్డూరమని, కార్పొరేట్ శక్తుల చేతుల్లో మీడియా బంది అయిపోయిందని విమర్శించారు.
👉 రాబోయే రోజుల్లో న్యాయవ్యవస్థ కూడా రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్లిపోవడం ఖామమనే అభిప్రాయం వ్యక్తమవుతోందన్నారు. జాతీయ మీడియాతో పాటు తెలుగు ప్రధాన పత్రికలు సైతం ప్రస్తుతం అమల్లోకి వచ్చిన లేబర్ కోడ్‌ల కారణంగా కార్మికులు, ఉద్యోగులకు కలిగే లాభ, నష్టాలను వివరించకపోవడం బాధకరమని చెప్పారు.

👉 ప్రభుత్వాలు అవలంభిస్తున్న విధానాలతో వర్కింగ్ జర్నలిస్టు అంటే మెడికల్ రిప్రజెంటివ్ ఉద్యోగంతో సమానంగా చూస్తున్నారని శ్రీనివాస రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు 26 మందితో కమిటి వేసి 1955లో మొదటి న్యూస్ పేపర్ యాక్ట్ తీసుకొచ్చారని గుర్తు చేశారు.
👉 దాని ఫలితమే ప్రస్తుత ఆర్‌ఎన్‌ఐ, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పిసిఐ) ఏర్పాటు, జర్నలిస్ట్‌ల అపాయింట్‌మెంట్స్, 6 గంటల పని, మహిళ రక్షణ, సెలవులు తదితరవి జర్నలిస్టులకు రక్షణగా నిలుస్తున్నాయని ఆయన వివరించారు. మొదట్లో వేతన సవరణ ప్రతి సంవత్సరం అమలు చేసేవారని, కాలక్రమేణ 3 నుంచి 5 సంవత్సరాలకు పెరిగిందని, ప్రస్తుతం వేతన సవరణ అమలు 15 సంవత్సరాలు దాటినప్పటికీ చేయడం లేదన్నారు.
👉 అల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు పివి.కృష్ణ రావు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారం చెపట్టినప్పటీ నుంచి బ్యాంకింగ్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమవుతోందన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను నిర్లక్ష్యం చేస్తూ ప్రైవేట్ బ్యాంకులను ప్రోత్సహించడం, మెర్జ్ పేరుతో బ్యాంకుల విలీనం తదితర లాంటివి బ్యాంకు ఉద్యోగుల శ్రమదోపిడీ చేయడమేనని స్పష్టం చేశారు.
👉 కార్పొరేట్ శక్తులతో చేతులు కలిపి ప్రైవేటైజెషన్ పేరుతో బ్యాంకులను విదేశీ సంస్థలకు అప్పగించడంతో పాటు మనీలెండర్స్ చేతుల్లోకి దేశ ప్రజలను నెట్టివేసేలా మోడి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోందన్నారు.
👉 ఐఎన్‌టియుసి ప్రధాన కార్యదర్శి ఆర్.డి. చంద్రశేఖర్ మాట్లాడుతూ కేంద్రం అమల్లోకి తెచ్చిన నూతన లేబర్ కోడ్‌లతో ‘కంపెనీలకు లాభం, కార్మికులకు నష్టం’ అని అన్నారు. ఐటి ఎంప్లాయిస్, స్పెషల్ జోన్(ఆధిభట్ల) ప్రాంతాలలో ఉద్యోగులకు యూనియన్లు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
👉 నూతన లేబర్ కోడ్‌ల రద్దు కోసం సుప్రీం కోర్టుకు వెళ్లడంతో పాటు.పాఠశాల, కళాశాల విద్యార్థులకు సైతం నూతన లేబర్ కోడ్‌ల వలన కలిగే నష్టాలను వివరించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కార్మిక సంఘాలన్ని కలిసి 10 రోజులు నిర్విరామంగా సమ్మె చేస్తే కేంద్రం దిగివస్తుందని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
👉 ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు ఏండి. యూసుఫ్ మాట్లాడుతూ కార్మికుల సమస్యలపై పోరాడే యూనియన్లను లేకుండా చేయడమే లక్ష్యంగా మోడి ప్రభుత్వం నూతన లేబర్ చట్టాలను తీసుకొచ్చిందని విమర్శించారు.
శ్రామికులను నష్ట పరిచి పరిశ్రమలకు లాభం చేకూర్చేలా మోడి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా కార్మికులందరూ ఏకమై తమ నిరసన గళంతో నూతన లేబర్ కోడ్‌లు రద్దు చేసేలా మోడి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు.
👉 టియుసిఐ నాయకుడు సూర్యం మాట్లాడుతూ నూతన లేబర్ చట్టాల ద్వారా గిగ్ వర్కర్లకు మేలు జరుగుతుందని ప్రధాని మోడి చెప్పడం హాస్యాస్పదమన్నారు. కంపెనీలకు వచ్చే లాభాల నుంచి కాకుండా గిగ్ వర్కర్లకు వచ్చే వేతనంలో కొద్ది మొత్తం పన్నుల రూపంలో వసూలు చేసి, వారి ప్రొటెక్షన్ కోసమని గొప్పలు చెప్పుకొవడం విడ్డూరమని దుయ్యబట్టారు.
👉 దేశ వ్యాప్తంగా సుమారు 40 కోట్ల మంది కార్మికులు ఉంటే, అందులో కేవలం 7 కోట్ల మందికి మాత్రమే పిఎఫ్, 3 కోట్ల మందికి ఇఎస్‌ఐ అమలవుతుందని శోచనీయమన్నారు. నూతన లేబర్ కోడ్‌లతో కలిగే నష్టాలను ప్రతి కార్మికుని వద్దకు చేరే విధంగా విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.
👉 ఐఎఫ్‌టియు ప్రధాన కార్యదర్శి ఎస్.ఎల్. పద్మ మాట్లాడుతూ సత్యమేవ జయతే-శ్రమయేవ జయతే అని మోడి ప్రభుత్వం కార్మికుల శ్రమను దొపిడీ చేస్తుందన్నారు. మహిళ ఉద్యోగులకు పట్టపగలే రక్షణ లేని పరిస్థితులు కనిపిస్తుంటే, రాత్రి సమయాల్లో కూడా మహిళలు ఉద్యోగం చేసుకొవచ్చనే హక్కు కల్పించడం బాధకరమని మండిపడ్డారు.
👉 ఐజెయు స్టీరింగ్ కమిటీ సభ్యులు దేవులపల్లి అమర్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన లేబర్ కోడ్‌లు శుస్క ప్రియులు- శూన్య హస్తాలు అనే సామేత చందంగా ఉందని ఎద్దేవా చేశారు. దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు పేరును శాశ్వతంగా రూపుమాపడానికే ఆయన అమలు చేసిన లేబర్ చట్టాలను ప్రస్తుత ప్రధాని మోడి రద్దు చేసి, వాటి స్థానాల్లో నూతన చట్టాలను తీసుకొస్తున్నారని ఆరోపించారు. ఎప్పుడు లేని విధంగా ప్రధాని మోడి తన ట్విట్టర్ ఖాతా ద్వారా నూతన లేబర్ కోడ్‌ల గురించి క్లుప్తంగా వివరించడం విడ్డూరమన్నారు.
👉 ఈ సమావేశంలో టియుడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామనారాయణ, ఐజేయు జాతీయ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, టియుడబ్ల్యుజె ఉప ప్రధాన కార్యదర్శి కే.రాములు, రాష్ట్ర కార్యదర్శి వి.యాదగిరి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏ.రాజేష్, హెచ్.యూ.జే అధ్యక్షుడు శిగా శంకర్ గౌడ్, చిన్న పత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ బాబు, ప్రధాన కార్యదర్శి అశోక్, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. బాలరాజ్, కార్యదర్శి బి. వెంకటేశం, ఐ.ఎఫ్.టి.యు నాయకులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
