👉 అందెశ్రీ సంతాప సభలో. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !
J . SURRENDER KUMAR,
పెన్నులపై మన్నుకప్పితే గన్నులై మొలకెత్తుతాయి, గన్నులై గడీలే కుప్పుకూలుతయన్న నినాదాన్ని అందెశ్రీ నిజం చేశారు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
తెలంగాణ ఉద్యమం ఎవరు చేశారంటే అందెశ్రీ, గద్దర్, గోరటి వెంకన్న, ఒక జయరాజ్ చేశారన్న చర్చ వస్తుందని గత పాలకుల హయాంలో జయ జయహే తెలంగాణ గీతం మూగబోయింది అని సీఎం అన్నారు.
👉 హైదరాబాద్ రవీంద్రభారతిలో శనివారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన అందెశ్రీ సంతాప సభలో ముఖ్యమంత్రి పాల్గొని మాట్లాడుతూ..
👉 వజ్రాల గురించి దశాబ్దాలు, శతాబ్దాలు చర్చించినా కోహినూర్ వజ్రానికి పోటీ లేనట్టే.. కవులు, కళాకారులు ఎంత మంది ఉన్నా, ఎవరి గురించి చర్చించినా రేపటి తెలంగాణ చరిత్రలో అందెశ్రీ మొదటి స్థానంలో నిలబడుతారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

👉 అందెశ్రీ కీర్తిని తెలంగాణ చరిత్రలో శాశ్వతం చేయడంలో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవడమే కాకుండా ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
👉 జీవితంలో బడి ముఖమే చూడని సహజకవి అందెశ్రీ గారు రాసిన జయ జయహే తెలంగాణ.. గీతం ఈరోజు ప్రతి బడిలో పాడుకునేంతగా యావత్ తెలంగాణ సమాజాన్ని ప్రభావితం చేసిన గొప్ప కవి అని కొనియాడారు.

👉 “బడికి వెళ్లని, బడి ముఖమే చూడని అందెశ్రీ అన్న జయ జయహే తెలంగాణ.. అంటూ ముక్కోటి గొంతుకలను ఏకం చేసి ఈ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపితేనే రాష్ట్ర కల నిజమైంది. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలే కాదు. ప్రపంచంలోని ప్రతి మూలన ఉన్న గుండెకు జయ జయహే తెలంగాణ.. చేర్చి ఒక ఉద్యమ స్ఫూర్తిని నింపిన గొప్ప తెలంగాణ బిడ్డ అందెశ్రీ.
👉 నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు పాడుకున్నది. కోరుకున్నదే.. జయ జయహే తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించడమే కాకుండా చదువు చెప్పే ప్రతి పుస్తకంలో రాయాలని ప్రజా ప్రభుత్వం ఆ గీతాన్ని పాఠ్య పుస్తకాల్లో మొదటి అంశంగా చేర్చాం.

👉 బాధతో ఉద్వేగంతో ఈ మాట చెబుతున్నా. ఉద్యమంలో స్ఫూర్తిని నింపిన జయ జయహే తెలంగాణ… స్వరాష్ట్రం సాకారమైన తర్వాత ఆ గీతం రాష్ట్రీయ గీతంగా అధికారిక హోదా లభిస్తుందని 4 కోట్ల ప్రజలు ఆశించారు.
👉 ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్రకు సంబంధించిన సమైక్య వాదులు ఈ తెలంగాణపై ఆధిపత్యం చెలాయిస్తున్నప్పుడు గద్దరన్న, గూడ అంజన్న, అందెశ్రీ, గోరటి వెంకన్న.. వారి ఆధిపత్యానికి చెరమగీతం పాడాల్సిందేనని, తెలంగాణకు విముక్తి కల్పించాల్సిందేనని మలి దశ ఉద్యమానికి పునాదులు వేశారు.

👉 రాచరికం హద్దు దాటినప్పుడు, తెలంగాణ నేలను చెరబట్టాలని, ఈ నేలపై ఆధిపత్యం చెలాయించాలని అనుకున్నప్పుడల్లా ఈ గడ్డపై పుట్టిన కవులు, కళాకారులు, తమ దుప్పటి దుమ్ము దులిపి దిగంతాలకు తరిమిన చరిత్ర ఈ నేలకు ఉంది.
👉 సర్వం త్యాగం చేసి ఏమీ ఆశించకుండా, ఆలోచించకుండా 5 దశాబ్దాల పని చేసిన ఆ కుటుంబాన్ని ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత. గద్దర్, అందెశ్రీ, ఈ ప్రజా పాలన కోసం శాయశక్తులా పనిచేశారు. వారి పోరాట స్ఫూర్తిని మేము ఎవరూ మరిచిపోలేనిది.
👉 అందెశ్రీ కుటుంబంలో ఉద్యోగం ఇవ్వడంతో పాటు స్మతివనం కట్టాలనుకున్నాం. అందెశ్రీ నిప్పుల వాగు పుస్తకాన్ని ప్రతి లైబ్రరీలో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా వారి కుటుంబాన్ని ఆదుకునే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది.

👉 ప్రజా ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి చేసుకున్న తరుణంలో 9 మంది ఉద్యమ కారులు, కవులు, కళాకారులను సన్మానించుకోవడమే కాకుండా వారికి 300 గజాల ఇంటి స్థలాన్ని కూడా కేటాయించాం. వారు ఆత్మగౌరవంతో బతకేలా భారత్ ఫ్యూచర్ సిటీలో వారికి ఇండ్లు కట్టించే కార్యక్రమాన్ని కూడా తీసుకోవాలని మంత్రి దామోదర రాజనర్సింహ కి సూచిస్తున్నా.
👉 అందెశ్రీ పేరిట జానపద విశ్వవిద్యాలయంతో పాటు సభలో వక్తలు చేసిన సూచనలపైన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అవసరమైన నిర్ణయం తీసుకుంటాం.. నాకు అత్యంత ఆప్తుడు. మనసుకు చాలా దగ్గరివాడు. అందెశ్రీ యాదిలో ఈ సంస్మరణ సభ ఏర్పాటు చేసిన వారికి మనస్పూర్తిగా అభినందనలు..” అని ముఖ్యమంత్రి అన్నారు.

👉 ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ , పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ , పలువురు ఎంపీలు, ప్రజాప్రతినిధులు, అందెశ్రీ సతీమణి మల్లుబాయి తో పాటు కవులు, రచయితలు, కళాకారులు, మేధావులు ఈ సంస్మరణ సభలో పాల్గొని అందెశ్రీ కి నివాళులర్పించారు.
