J.SURENDER KUMAR,
ప్రముఖ పాత్రికేయులు వల్లీశ్వర్ కు
అమృతలత జీవన సాఫల్య పురస్కారంను
ఇందూరు అపురూప అవార్డుల కమిటీ (2024-2025)  సంవత్సరానికి ప్రధానం చేశారు. కేంద్ర సాహిత్య అకాడెమీ తెలుగు సలహా మండలి కన్వీనర్, డాక్టర్ మృణాళిని  ఆదివారం  నిజామాబాద్ లో జరిగిన సాహిత్య వల్లీశ్వర్ ను సన్మానించి అవార్డును బహూకరించారు.
సాహిత్యంలో ‘వసుంధర’ అనబడే జొన్నలగడ్డ రాజగోపాలరావు – రామలక్ష్మి దంపతులకు, డా. శాంతి నారాయణకు, జర్నలిజంలో జి. వల్లీశ్వర్ కి, అనువాదాలు, కవిత్వం, కథలలో డా. నలిమెల భాస్కర్ కి, జి. వెంకట కృష్ణ , డా. పెద్దింటి అశోక్ కుమార్ లకు ప్రదానం చేసారు.

‘ఇందూరు అపురూప’ అవార్డులను సూరారం శంకర్, పంచరెడ్డి లక్ష్మణ్, స్వయంప్రకాశ్, ఎన్. విజయా కిషన్ రెడ్డి, కుసుమలతా రెడ్డి, టి. వసంతా వివేక్, వి. నరసింహా రెడ్డి, పి. సుజాత, సుమీలా శర్మ, డా. బోచ్కర్ ఓం ప్రకాశ్ లకు బహూకరించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ రచయిత్రి వి. ప్రతిమ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు.
👉 వల్లీశ్వర్ గూర్చి…
తెలంగాణాలో నాడు ‘బిట్స్’ (బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్) ఏర్పాటు ఇబ్బందులను వివరిస్తూ నిరాకరించిన బిట్స్ ను క్యాంపస్‌ని ఇక్కడ ఏర్పాటుకు తెర వెనక కృషి చేసిన ఘనత వల్లీశ్వర్ ది.
2006లో కేవలం తన పాత్రికేయ నైపుణ్యం తో బిట్స్ యాజమాన్యంతో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలతో ఒప్పించి, రప్పించిన సామర్థ్యం నాటి ముఖ్యమంత్రి మీడియా సలహాదారుగా వల్లీశ్వర్‌ది.

అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ 2006 నాటి తనపర్యటనలో అనూహ్యంగా హైదరాబాద్‌కు కొంత సమయం కేటాయించి రైతులతో, మహిళా స్వయం సహాయకబృందాలతో ఇప్పటి జైశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంక్షేత్రంలో ముఖాముఖీ సంభాషణలు చేయడం అనే చారిత్రాత్మక సంఘటనకు కారణం ముఖ్యమంత్రి మీడియాసలహాదారుగా వల్లీశ్వర్ నిర్వహించిన వ్యూహాత్మక పాత్ర… ఇటువంటి పలు చారిత్రాత్మక పరిణామాల్లో చెరగని ముద్రవేసిన పాత్రికేయుడు వల్లిశ్వర్.

ఏలూరులో తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు గుండు వేంకట కృష్ణమూర్తి, శ్రీమతి లక్ష్మీనర్సమ్మల మూడవ కుమారుడైన వల్లీశ్వర్… స్వాతంత్ర్య సమరయోధుడైన ప్రముఖ పాత్రికేయుడు, రాష్ట్ర జర్నలిస్టుల యూనియన్ నాయకుడు మంగళంపల్లి చంద్రశేఖర్ వద్దజర్నలిజంలో శిక్షణ పొంది, ఆయనకు వారసుడిగా ‘ఆంధ్రపత్రిక’ విలేఖరిగా జర్నలిజంలో అడుగుపెట్టి… వృత్తిని ప్రేమించే పాత్రికేయుడిగా సుమారు ఐదున్నరదశాబ్దాలుగా రాణిస్తున్నారు. ఇప్పటికీ సోషల్ మీడియాలోఈయన కలం చురుగ్గా పరుగెడుతూనే ఉంది.
శివలెంక రాధాకృష్ణ  సంపాదకత్వంలోని ‘ఆంధ్రపత్రిక’లో ఆరేళ్లు, నండూరి రామ్మోహన్ రావు  సంపాదకత్వంలోని ‘ఆంధ్రజ్యోతి’ లో కొంతకాలం రిపోర్టర్‌గా పనిచేశారు.
26 సంవత్సరాల పాటు ఏలూరు, తిరుపతి, విశాఖపట్నం, ఢిల్లీ, హైదరాబాద్ నగరాలలో ‘ఈనాడు, న్యూస్ టైం, ఈటీవీ’ లలో బ్యూరో చీఫ్ స్థాయి వరకు ఎదిగి సమున్నతప్రమాణాలతో జర్నలిస్టుగా తమ సేవలనందించారు.

1972-73 కాలంలో ఆంధ్ర ప్రాంతం మొత్తాన్ని కొన్నిమాసాల పాటు స్తంభింపజేసిన – రాష్ట్ర విభజన ఉద్యమంసహా ప్రాంతీయ, జాతీయ స్థాయిల్లో సంచలనాత్మకకథనాలను రాసి, వార్తా కథనాల రచనల్లో తనదంటూ ఒకముద్ర వేశారు.
ముఖ్యంగా విశాఖపట్నంలో భారతనౌకాదళం, హిందుస్థాన్ షిప్యార్డ్, స్టీల్ ప్లాంట్, పోర్ట్ ట్రస్ట్తదితర ప్రభుత్వ రంగ సంస్థలపై ప్రామాణికమైన పరిశోధకవ్యాసాలు రాసి సమర్థుడైన పాత్రికేయుడుగా ‘ఈనాడు’ అధిపతి రామోజీరావు ప్రశంసలు అందుకున్నారు.
‘ఈనాడు’ కోసం ఎనిమిది లోక్‌సభ ఎన్నికలనూ, ఏడు అసెంబ్లీ ఎన్నికలనూ, 1982 నాటి తిరుపతిలో సైన్స్ మహాసభలు, 1992, 1994 లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ ప్లీనరీలనూ, 1990- 95 కాలంలో పార్లమెంట్ సమావేశాలను ‘ఈటీవీ’ కోసం 1996, 1998, 1999, 2004లలో జరిగిన సార్వత్రిక ఎన్నికలనూ, 2001లో పశ్చిమబెంగాల్ శాసనసభ ఎన్నికలనూ సమర్థంగా రిపోర్ట్ చేసినఅనుభవాలు వల్లీశ్వర్‌ది.
తాను నమ్మిన ప్రమాణాల కోసం, వృత్తిలో సంతృప్తికోసం – కుటుంబ జీవితాన్ని నష్టపోతున్నా, ప్రలోభాలు, వ్యక్తిత్వ పరీక్షలు తట్టుకొంటూ, నిర్భీతి, నిబద్ధతతో, సాహసాలు, పోరాటాలతో సాగించిన కెరీర్ లో విస్తృత మానవసంబంధాలు తనకు ఎంతగానో ఉపకరించాయనినమ్ముతారు.
పాత్రికేయ వృత్తిలో నైపుణ్యాన్ని పెంచేందుకు 1988లోవిశాఖపట్నంలో ‘వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం’ ఏర్పాటు చేసి, దానికి అధ్యక్షులుగా  సేవలనందించారు.
హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌కి ఈ సహస్రాబ్ధి తొలి దశాబ్దంలో అధ్యక్షునిగా రెండుసార్లు ఎన్నికై, మూడేళ్ల పాటు దాన్ని ఒకఫ్యామిలీ క్లబ్‌గా తీర్చిదిద్దడం ఈయన ఘనత.
మాజీ ముఖ్యమంత్రులు డా. వై.ఎస్. రాజశేఖరరెడ్డికి, డా. కొణిజేటి రోశయ్యకు ఆధికారిక మీడియా సలహాదారుగా పనిచేశారు.
పదేళ్ల పాటు (2005-15) రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించే ‘ఆంధ్రప్రదేశ్’ మాసపత్రికకు ప్రధాన సంపాదకులుగా హాస్యకథల పోటీలను నిర్వహిస్తూ, వందలాది క్రొత్తరచయితలను వెలుగులోకి తీసుకువచ్చారు.
ప్రభుత్వ గణాంక వివరాల ప్రచురణకు పరిమితమైన ఆ మాసపత్రికలో- ‘తెలుగు సాహిత్యంలో హాస్యామృతం’ వంటి క్రొత్త సాహితీశీర్షికలను ప్రవేశపెట్టి, పఠనీయతను పెంచి; ఇతర సాహితీపత్రికలతో పోటీపడేలా తీర్చిదిద్దిన సంపాదకత్వ పటిమ వల్లీశ్వర్‌ది.
ఎమెస్కో సంస్థలో విషయసమన్వయకర్తగా విధులు నిర్వర్తిస్తున్నారు. 2004 నుంచి భారత ప్రభుత్వం వారి ప్రచురణ సంస్థ ‘నేషనల్ బుక్ ట్రస్ట్ఆఫ్ ఇండియా’కి పాలకవర్గ సభ్యులుగా ఉన్నారు.
2022లో హైదరాబాదులో కేంద్ర మంత్రులు, గవర్నర్‌లుపాల్గొన్న రెండు రోజుల ‘గోల్కొండ సాహితీ సదస్సు’ కన్వీనరుగా వల్లీశ్వర్ నిర్వహించిన పాత్ర చిరస్మరణీయం.
👉పాత్రికేయుడిగా పురస్కారాలు:

2010లో ముఖ్యమంత్రి డాక్టర్ రోశయ్య నుండి రాష్ట్రఅవతరణ దినోత్సవంలో విశిష్ట పురస్కారాన్నీ, 
2011లోఉత్తమ పాత్రికేయునిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంనుండి ఉగాది పురస్కారాన్నీ,
2012లో ఏలూరు ప్రెస్ఫోరమ్ నుండి మంగళంపల్లి చంద్రశేఖర్ స్మారక గోల్డెన్పెన్ పురస్కారాన్నీ,
2021లో స్వధర్మ సభ (హైదరాబాద్) నుండి పి.వి.ఆర్.కె ప్రసాద్ స్మారక పురస్కారాన్నీ,
2023లోపొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండిప్రతిభా పురస్కారాన్నీ పొందారు.
తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు చేతుల మీదుగా – 2025 ఉగాదినాడు జీవన సాఫల్య పురస్కారంగా ‘కళారత్న’ తో గౌరవించింది. ఇంకా అనేక సాహితీ వేదికలు వీరినిపురస్కారాలతో గౌరవించాయి.

తెలుగులో అనువాద రచనలు, ఆత్మకథలు, జీవితగాథలు, రాజకీయ చరిత్రకు సంబంధించిన 25 రచనలతో తనదంటూ ఒక విశిష్ట ముద్ర వేసిన అరుదైనపాత్రికేయుడు గుండు వల్లీశ్వర్. ముఖ్యంగా ప్రతి పాఠకుడ్నిఆలోచింపజేసే ‘99 సెకన్ల కథలు’ అనే వినూత్న ప్రయోగంతో సాహితీలోకంలో కొత్త అధ్యాయాన్ని తెరిచారు. 2013 డిసెంబర్ మాసం ధర్మపురిలో ‘ ఉప్పు పక్షపత్రిక ను ప్రారంభించారు.
