ఆదిలాబాద్‌ను అభివృద్ధి లో అగ్రస్థానంలో నిలబెడతాం !

👉 ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాల   కార్యక్రమాల్లో…

👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !

J . SURENDER KUMAR,

తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్‌ను అభివృద్ధి చెందిన జిల్లాగా అగ్రస్థానంలో నిలబెట్టే విధంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  చెప్పారు. తుమ్మిడిహట్టి వద్ద డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టి ఈ జిల్లా పంట పొలాలకు నీళ్లిస్తామన్నారు. త్వరలోనే ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి ఆదిలాబాద్ జిల్లాకు విశ్వవిద్యాలయం మంజూరు చేస్తామని ప్రకటించారు.

👉 ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలు కార్యక్రమాల్లో భాగంగా గురువారం ఆదిలాబాద్ పట్టణంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి  శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు, చనాక – కొరాట ప్రాజెక్టు నిర్మాణంతో పాటు, విమానాశ్రయం, విశ్వవిద్యాలయం ఏర్పాటు, సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం వంటి పలు కీలక అంశాలను వివరించారు.

👉 అత్యంత వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటా. జిల్లా అభివృద్ధి కోసం ప్రత్యేకమైన ప్రణాళికలు తయారు చేసి సమీక్షా సమావేశం నిర్వహించి ఇక్కడి సమస్యలను పరిష్కరిస్తాం.

👉 ఎక్కడైతే ఎడ్యుకేషన్, ఇరిగేషన్, కమ్యునికేషన్ సరిగా ఉంటుందో ఆ ప్రాంతంలో అభివృద్ధి ఉంటుంది. జిల్లాకు ఇప్పటికే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, ఏటీసీ మంజూరు చేశాం. మెడికల్ కాలేజీ ఇచ్చాం. ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన తర్వాత జిల్లాకు విశ్వవిద్యాలయం ఇచ్చే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది.

👉 జిల్లాకు విశ్వవిద్యాలయం మంజూరు చేస్తాం. ఎక్కడ పెట్టాలన్నది స్థలం ఎంపికను ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు చర్చించి నిర్ణయం తీసుకోవాలి. ఈ వర్సిటీని ఇంద్రవెల్లిలో పెడితే బాగుంటుందని నా అభిప్రాయం. దానికి కొమురం భీం విశ్వవిద్యాలయంగా నామకరణం చేస్తే మరింత బాగుంటుంది. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. ఎక్కడ పెట్టాలన్నది ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు చర్చించి నిర్ణయం తీసుకోవాలి.

👉 ఆదిలాబాద్ జిల్లాకు నీరివ్వడానికి 150 మీటర్ల ఎత్తులో ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించినప్పటికీ గత ప్రభుత్వం ఆ ప్రాజెక్టును పక్కనపెట్టింది. తొందరలోనే పనులు ప్రారంభించి ప్రాజెక్టును చేపట్టి రైతులను ఆదుకునే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే చనాక – కొరాట ప్రాజెక్టు పనులను కూడా పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం.

👉 ఆదిలాబాద్‌లో విమానాశ్రయం నిర్మాణంపై ప్రత్యేక దృష్టిని సారిస్తా. ఏడాది తిరిగే లోపు విమానాశ్రయ నిర్మాణ పనులను ప్రారంభిస్తాం. వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాలో ఎర్రబస్సులు ఆపడమే కష్టమనుకున్న ప్రాంతంలో విమానాలు దిగేలా చేస్తాం.

👉 తెలంగాణ ఉద్యమం అంటేనే నీళ్లు, నిధులు, నియామకాలు. కానీ గడిచిన దశాబ్ద కాలంలో నియామకాలు చేపట్టకపోతే, ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సరం తిరిగే లోపు 61 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ప్రక్షాళన చేశాం. 563 మందికి గ్రూప్ -1 ఉద్యోగాలిచ్చాం.

👉 ప్రజా పాలన – ప్రజా విజయోత్సవ సంబరాలు ముగిసిన తర్వాత సమీక్ష నిర్వహించి మరో 40 వేల ఉద్యోగాల నియామకాల ప్రక్రియ చేపడుతాం. మొత్తంగా లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తాం. యువత ఉన్నతంగా చదువుకుని ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఉద్యోగాలు సాధించి తెలంగాణ కీర్తిని చాటాలి. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి. యువతను ప్రోత్సహించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది.

👉  ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటగా ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్‌కు వచ్చాను. ఆదివాసీ హక్కుల కోసం పోరాటానికి మారుపేరైన కొమురం భీమ్  ను ఆదర్శంగా తీసుకుని, ఇంద్రవెళ్లి పోరాట స్ఫూర్తిగా ముందుకు వెళుతున్నాం. ఇంద్రవెల్లి అమర వీరుల స్థూపాన్ని పర్యాటక కేంద్రంగా ప్రకటించడమే కాకుండా అమర వీరుల కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి ఆదుకున్నాం.

👉 జిల్లాలో సున్నపురాయి గనులున్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడానికి తొందరలోనే ప్రైవేటు పెట్టుబడిదారులను తీసుకొచ్చి ఇక్కడ సిమెంట్ పరిశ్రమను ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటాం. తద్వారా స్థానికులకు ఉపాధి కల్పించే చర్యలు చేపడుతాం.

👉 ఎన్నికల సమయంలోనే రాజకీయాలు, అవి ముగిసిన తర్వాత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అందించడమే మా లక్ష్యమని చెప్పాం. అభివృద్ధి, సంక్షేమం మాకు రెండు కళ్లలా భావిస్తాం. అందుకోసం నిరంతరం పనిచేస్తాం. తెలంగాణ ప్రజలకు సేవ చేయడం నాకు దేవుడిచ్చిన వరం. ప్రజలందించిన ఆశీస్సులు.. అని ముఖ్యమంత్రి  అన్నారు.