అసెంబ్లీలో చర్చించి జెడ్పిటిసి ఎన్నికల పై నిర్ణయం !

👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !

J SURENDER KUMAR,

బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లను సాధించడంపై శాసనసభ సమావేశాల్లో చర్చించి అన్ని పార్టీల అభిప్రాయం మేరకు ఎంపీటీసీ, జేడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలపై నిర్ణయానికి వస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, ధనసరి అనసూయ సీతక్కతో పాటు పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి గురువారం హైదరాబాదులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు.

👉 రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతమైన వాతావరణంలో, ప్రజాస్వామిక బద్ధంగా ఎక్కడా ఎలాంటి  లోటుపాట్లు లేకుండా నిర్వహించినందుకు ఎన్నికల యంత్రాంగానికి, అధికారులకు ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  అభినందనలు తెలిపారు.

👉 గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించినందుకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు.

👉 బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లను సాధించడంపై శాసనసభ సమావేశాల్లో చర్చించి అన్ని పార్టీల అభిప్రాయం మేరకు ఎంపీటీసీ, జేడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలపై నిర్ణయానికి వస్తామని చెప్పారు.

👉 రాష్ట్రంలో 12,728 పంచాయతీలకు గాను 12,702 గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు జరగ్గా, ప్రజాస్వామిక బద్ధంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడం, ప్రజలు స్వేచ్ఛగా తీర్పును ఇవ్వడం అభినందనీయమని అన్నారు.

👉 ప్రజా ప్రభుత్వం రెండేళ్ల పరిపాలన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలతో ప్రజల ముందుకు వెళ్లగా, తమకు 7,527 గ్రామ పంచాయతీల్లో (66 శాతం) ప్రజలు అందించిన ఆశీర్వాదం.. ప్రభుత్వంపై మరింత బాధ్యత పెంచిందని చెప్పారు. ప్రజల ఆశీర్వాదంలో రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి రెండిండినీ సమపాళ్లలో ముందుకు తీసుకెళుతున్నామని అన్నారు.

👉 “రాష్ట్రంలో కొత్తగా రేషన్ కార్డుల జారీ, సన్నబియ్యం పంపిణీ, రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్నధాన్యానికి బోనస్ చెల్లింపు, ఉచిత కరెంట్, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్, ₹500 లకే సిలిండర్, ₹27 వేల కోట్ల రూపాయల మేరకు సున్నా వడ్డీకే మహిళా సమాఖ్యలకు రుణాలు, 4.5 లక్షల మంది నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు, అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే 61 వేల ఉద్యోగాల భర్తీ, సుదీర్ఘకాలం అపరిష్కృతంగా ఉన్న ఎస్సీ వర్గీకరణ సమస్యకు పరిష్కారం, వందేళ్లుగా జరగని బీసీ కులగణన చేపట్టడం, పేదలకు మంచి విద్యను అందించాలన్న ప్రయత్నాలు… ఇలా అనేక అంశాల్లో ప్రభుత్వం ఒక క్రమపద్ధతిలో అభివృద్ధిని, సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు వెళుతోంది”  అని ముఖ్యమంత్రి  వివరించారు.

👉 ఒకవైపు ఆదాయాన్ని పెంచుకుంటూ దుబారాను తగ్గిస్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం జరక్కుండా ప్రజలకు మేలు చేయాలన్నదే ప్రభుత్వ తాపత్రయమని ఒక ప్రశ్నకు సమాధానంగా ముఖ్యమంత్రి  చెప్పారు.

👉 కృష్ణా, గోదావరి జలాలపై తెలంగాణ హక్కులకు సంబంధించి పూర్తి వివరాలతో శాసనసభలో చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.