👉 వసతి గృహాల్లో విద్యార్థుల భద్రతే ప్రభుత్వ తొలి బాధ్యత !
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్య, సంక్షేమ రంగాలకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు నాణ్యమైన విద్యతో భవిష్యత్తును నిర్మించుకునేలా ప్రభుత్వం స్పష్టమైన దిశానిర్దేశం చేస్తోందని రాష్ట్ర షెడ్యూల్ కులాలు, గిరిజన సంక్షేమం, దివ్యాంగులు, వయోవృద్ధులు మరియు ట్రాన్స్‌జెండర్ సాధికారిక శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.
బుధవారం భూపాలపల్లి ఐడీఓసీ కార్యాలయంలో భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు, పోలీస్ అధికారులు, ఎస్సీ–ఎస్టీ సంక్షేమ శాఖ అధికారులు, ఆర్సీఓలు, జిల్లా కోఆర్డినేటర్లు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీలతో వసతి గృహాల నిర్వహణ, మౌలిక వసతులు, విద్యా ప్రమాణాలు, వైద్య సేవలు, భద్రతా ఏర్పాట్లపై మంత్రి సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు

.
సమావేశానికి ముందు మంత్రి లక్ష్మణ్ కుమార్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడారు. వారి సమస్యలను స్వయంగా తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇటీవల జరిగిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకుని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
👉 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..

ముఖ్యమంత్రి మార్గదర్శకాల మేరకు రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, విద్య, భోజనం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఉండబోదని ఆయన స్పష్టం చేశారు.
వసతి గృహాల్లో నివసిస్తూ చదువుతున్న ప్రతి విద్యార్థిని తమ స్వంత పిల్లలుగా భావించి సంపూర్ణ బాధ్యతతో సంరక్షించాలని, విధుల్లో అలసత్వం, బాధ్యతారాహిత్యం కనబడితే సంబంధిత అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.
@@ సమీక్షి సమావేశ ముఖ్యాంశాలు.@@
👉 నాణ్యమైన విద్యే లక్ష్యం !
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంక్షేమ వసతి గృహాలు కేవలం భోజనం, నివాసానికి మాత్రమే కాకుండా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే కేంద్రాలుగా మారాలని పేర్కొన్నారు. విద్యా ప్రమాణాలు మెరుగుపడితేనే ఉత్తమ ఫలితాలు సాధ్యమవుతాయని, అందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. జిల్లాల వారీగా విద్యార్థుల సంఖ్య, తరగతి వారీ హాజరు, ఉత్తీర్ణత శాతం, డ్రాప్‌ఔట్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ప్రతి వసతి గృహంలో స్టడీ అవర్స్‌ను కచ్చితంగా అమలు చేయాలని, అవసరమైన చోట అదనపు ఫ్యాకల్టీ, గెస్ట్ లెక్చరర్ల సేవలు వినియోగించి విద్యార్థుల విద్యా సామర్థ్యాన్ని పెంచాలని సూచించారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రత్యేక శిక్షణ అందించే విధంగా ప్రణాళిక రూపొందించాలని చెప్పారు.
👉 ఆహారం, ఆరోగ్యం పై రాజీ ప్రసక్తే లేదు !
వసతి గృహాల్లో మెనూ ప్రకారం నాణ్యమైన బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం అందేలా కఠిన పర్యవేక్షణ ఉండాలని మంత్రి ఆదేశించారు. ఆహార నాణ్యతలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించాలని స్పష్టం చేశారు.

విద్యార్థుల ఆరోగ్య భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. చిన్న ఆరోగ్య సమస్యలు కూడా పెద్దగా మారకుండా ముందస్తు వైద్య చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైన చోట సమీప ప్రభుత్వ ఆసుపత్రులతో అనుసంధానం కల్పించాలని ఆదేశించారు.
👉 భద్రతపై కట్టుదిట్టమైన చర్యలు !
వసతి గృహాల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని మంత్రి స్పష్టం చేశారు. అనుమతి లేకుండా విద్యార్థులను హాస్టళ్ల నుంచి బయటకు పంపరాదని, బయటి వ్యక్తులు హాస్టళ్లలోకి ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి వసతి గృహంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ చేయాలని తెలిపారు.
మహిళా వసతి గృహాల్లో షీ–టీమ్‌ల ద్వారా తరచూ తనిఖీలు నిర్వహించి భద్రతా భావాన్ని బలోపేతం చేయాలని సూచించారు. విద్యార్థులు భయంలేకుండా, ఆత్మవిశ్వాసంతో చదువుకునే వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
👉 సిబ్బంది బాధ్యత – జీతాలపై స్పష్టత !
వసతి గృహాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ సిబ్బందికి గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతినెల వేతనాలు సకాలంలో అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. జీతాల ఆలస్యం కారణంగా సేవల్లో లోపాలు తలెత్తకుండా స్పష్టమైన వ్యవస్థ అమలు చేస్తున్నట్లు చెప్పారు.
ప్రతి హాస్టల్‌కు ప్రత్యేక పర్యవేక్షణ అధికారిని నియమించి విద్యార్థులతో మమేకమై డైట్, సంరక్షణ, భద్రత, క్రమశిక్షణపై ప్రత్యక్ష బాధ్యత వహించేలా చూడాలని ఆదేశించారు.
👉 మౌలిక వసతుల మెరుగుదల !

మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుత్ సరఫరా, భవన మరమ్మతులు వంటి మౌలిక వసతుల్లో ఎక్కడైనా లోపాలు ఉంటే వెంటనే పరిష్కరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. వసతి గృహాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పారు.
👉 ప్రభుత్వ ప్రాధాన్యత – సీఎం దృష్టి !
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్య, సంక్షేమ రంగాలను సామాజిక మార్పుకు కీలక ఆయుధాలుగా భావిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. పేద కుటుంబాల పిల్లలు చదువుతోనే పైకి ఎదగాలన్నదే ప్రభుత్వ సంకల్పమని తెలిపారు.

ఈ సమావేశంలో వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు స్నేహ శబరిస్, సత్య శారద, భూపాలపల్లి ఎస్పీ సంకీర్త్, ఐటిడిఎ పీఓ చిత్రామిశ్రా, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఎస్సీ అభివృద్ధి శాఖ అదనపు డైరెక్టర్ సి. శ్రీధర్, ఎస్సీ కార్పొరేషన్ జీఎం హన్మంతు నాయక్, గిరిజన సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ పోశం, మంత్రి ఓఎస్డీ విజయ్ కుమార్, పీఆర్‌వో అమృత్ తదితరులు పాల్గొన్నారు.
