దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ !

👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !

J.SURENDER KUMAR,

రాబోయే రోజుల్లో తెలంగాణను దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టి ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దే మాడల్‌ను ప్రకటించ పోతున్నాము అని  ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  అన్నారు.. వరి ఉత్పత్తి, శాంతి భద్రతల పరిరక్షణ, మాదక ద్రవ్యాల నియంత్రణ, విద్య, వైద్య రంగాల్లో నంబర్‌ 1 గా ఉన్న తెలంగాణను భవిష్యత్తులో మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు.

👉 ‘ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలు’ కార్యక్రమాల్లో భాగంగా ముఖ్యమంత్రి నల్గొండ జిల్లా దేవరకొండ మున్సిపాలిటీలో శనివారం చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

👉 ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి  ప్రసంగిస్తూ.. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో, రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు జరుగుతున్న తీరును, భవిష్యత్తు ప్రణాళికలను  ఆవిష్కరిస్తున్నట్టు చెప్పారు.

👉 అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్‌లో వంద దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారని తెలిపారు. ఆ సదస్సులో తెలంగాణ అభివృద్ధి మాడల్‌ను ఆవిష్కరించడమే కాకుండా భవిష్యత్తులో రాష్ట్రాన్ని అభివృద్ధి పథాన నడిపించే వ్యూహాలను ప్రకటిస్తామన్నారు.  

👉 రాష్ట్రంలో పేదవారందరికీ అత్యుత్తమ సంక్షేమ పథకాలను అందిస్తున్నాం. పేదవారి ఆకలిని తీర్చినప్పుడే సంక్షేమ పథకాలకు సార్థకత ఉంటుంది. తెలంగాణలో నిరుపేదలకు ఇస్తున్న సన్నబియ్యం దేశంలోని ఏ ఇతర రాష్ట్రాల్లో  ఇవ్వడం లేదు. సన్నబియ్యం పంపిణీలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలబడింది.

👉 పేదవారిని ఆత్మగౌరవంతో జీవించేలా ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశాం, ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లో అదనంగా మరో 25 వేల ఇండ్లను మంజూరు చేశాం.

👉 గిరిజన, ఆదివాసీల కోసం అతిపెద్ద సేవాలాల్ విగ్రహాన్ని మద్దిమడుగులో ఏర్పాటు చేసి ఒక పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేసుకుందాం. ఉత్తమ పార్లమెంటేరియన్ ఎస్ జైపాల్ రెడ్డి  చదువుకున్న పాఠశాల అభివృద్ధి కోసం ₹ 6 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేస్తాం. పట్టణంలోని వెంకటేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటాం. దేవరకొండకు నర్సింగ్ కాలేజీ మంజూరు చేస్తాం. పదేండ్ల పాటు పడావు పెట్టిన ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతాం.  

👉 తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ రాష్ట్రంలో అధికారంలో ఉంది. అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. నెలాఖరులోపు సంబంధిత మంత్రులను జిల్లాకు పంపించి అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై సమీక్ష చేయిస్తా. అని ముఖ్యమంత్రి  చెప్పారు.

👉 ఈ పర్యటన సందర్భంగా దేవరకొండలో ముఖ్యమంత్రి  శంకుస్థాపన చేసిన పనులు !

👉 ₹ 13 కోట్ల రూపాయలతో దేవరకొండ మున్సిపాలిటీలో సీసీ రోడ్ల నిర్మాణం.!

👉 ₹ 2.5 కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు !

👉 ₹ 50 కోట్ల రూపాయలతో చేపట్టనున్న సీసీ డ్రైన్లు !

👉 ₹ 2 కోట్ల రూపాయలతో ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ట్రాక్ – అభివృద్ధి పనులు!

👉 ₹ 2 కోట్ల రూపాయలతో బీఎన్ఆర్ పార్క్ అభివృద్ధి పనులు !

👉 ₹ 11.33 కోట్ల రూపాయల మేరకు బ్యాంకు లింకేజీ చెక్కులను మహిళలా సంఘాలకు అందజేత.!