👉 బస్ పాస్ లతో సహా ఇతర అన్ని సంక్షేమ పథకాలు వారికి వర్తింపజేయిస్తాం !
👉 టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ!
J.SURENDER KUMAR,
జర్నలిస్టుల సంక్షేమం కోసం గత 70 ఏళ్లుగా పాటుపడుతున్న తమ సంఘం డెస్క్ జర్నలిస్టులకు ప్రభుత్వం అన్యాయం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని, బస్ పాస్ లతో సహా అన్ని సంక్షేమ పథకాలను వారికి వర్తింపజేసేందుకు తాము ప్రభుత్వంతో చర్చించి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ భరోసా ఇచ్చారు.
ఆదివారం బషీర్ బాగ్ లోని యూనియన్ కార్యాలయంలో జరిగిన (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ముఖ్యుల సమావేశానంతరం యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రాంనారాయణ, రాష్ట్ర నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
డెస్క్ జర్నలిస్టులను ఇతర జర్నలిస్టులను తాము వేరుగా చూడడం లేదని, వారికి కూడా బస్ పాస్ లతో సహా ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటిని తప్పకుండా వర్తింప చేయిస్తామని విరాహత్ అలీ అన్నారు.

గత 10 ఏళ్ల కాలంలో డెస్క్ జర్నలిస్టులకు కొంతమందికి మాత్రమే అక్రిడేషన్ కార్డులు ఇచ్చారని, కానీ ఇప్పుడు తాము డెస్క్ లో పనిచేసే జర్నలిస్టులందరికీ మీడియా కార్డులు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డుతో పాటు ఇతర సంక్షేమ పథకాలను వర్తింపజేసేలా కృషి చేస్తామన్నారు.
అదేవిధంగా నానాటికి జర్నలిజంలో అడుగంటుతున్న విలువలను పెంపొందించేందుకే కొన్ని కట్టుదిట్టమైన నిబంధనలతో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 252 జీవోను తీసుకొచ్చిందని ఆయన తెలిపారు. ఉనికి చాటుకోవడానికి కొన్ని సంఘాలు, డెస్క్ జర్నలిస్టులకు అన్యాయం జరుగుతుందంటూ గగ్గోలు పెట్టడంలో వాస్తవం లేదని, అబద్దాలు, కల్పితాలతో వాళ్ళు చేస్తున్న అపోహలు నమ్మవద్దని ఆయన జర్నలిస్టులను కోరారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జర్నలిస్టులకు ఇచ్చిన అక్రిడేషన్ కార్డులు ఎంతవరకు పని చేశాయో, దానికి కారణం ఎవరన్నది ప్రతి జర్నలిస్ట్ కు తెలుసునన్నారు. జర్నలిస్టులను తీవ్ర నిర్లక్ష్యం చేసిన గత ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న సంఘాలే నేడు జర్నలిస్టులకు మేలు జరుగుతోందంటే ఓర్చుకోలేకనే రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
252 జీవో తెచ్చి జర్నలిస్టులకు అన్యాయం చేస్తున్నారని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డిని విమర్శించడం సరైంది కాదన్నారు. మీడియా అకాడమీ చైర్మన్ ఆధ్వర్యంలో ఏడుగురు ప్రముఖులైన పాత్రికేయులతో కమిటీ ఏర్పాటై, ఐదారుసార్లు సమావేశమై మార్గదర్శకాలు రూపొందించిన విషయం గగ్గోలు చేస్తున్న మిత్రులకు తెలియదా? అని విరాహత్ ప్రశ్నించారు. సమాచార శాఖ కమిషనర్ తో పాటు ఆంధ్రజ్యోతి మాజీ సంపాదకులు కే.శ్రీనివాస్, ది హిందూ పత్రిక పొలిటికల్ ఎడిటర్ రవికాంత్ రెడ్డి, వి6 వెలుగు పత్రిక సీఈవో అంకం రవి, సియాసత్ ఎడిటర్ ఆమెర్ అలీ ఖాన్, ఫోటో జర్నలిస్టు అసోసియేషన్ నాయకుడు కె.ఎన్.హరి తదితరులతో వేసిన కమిటీ రూపొందించిన నిబంధనల మేరకే 252 జీవో వచ్చిందన్న విషయాన్ని మర్చిపోవద్దన్నారు.
గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల నియమ నిబంధనలు రూపొందించేందుకు సీనియర్ సంపాదకులు రామచంద్రమూర్తి ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ సూచించిన సిఫార్సులను అప్పటి మీడియా అకాడమీ చైర్మన్ ఎందుకు అమలు చేయలేదని ఆయన ప్రశ్నించారు.
రామచంద్ర మూర్తి కమిటీ సిఫార్సులకు భిన్నంగా తీసుకువచ్చిన 239 జీవో తో జర్నలిస్టులకు అన్యాయం జరుగుతుంటే అప్పటి మీడియా అకాడమీ చైర్మన్, ఆయన సంఘం ఎందుకు నోరెత్తలేదన్నారు. ఆ జీవోతో చిన్న మధ్య తరహా పత్రికలకు, ఉర్దూ పత్రికలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.
252 జిఓ లో ఉన్న కొన్ని లోటు పాట్లను తాము గుర్తించామని, వాటిని సవరించేందుకు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళనున్నట్లు ఆయన స్పష్టం చేసారు.
ఈ విలేకరుల సమావేశంలో టీయుడబ్ల్యూజే రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి కల్కూరి రాములు, ఉపాధ్యక్షుడు గాడిపల్లి మధు, కార్యదర్శులు కె. శ్రీకాంత్ రెడ్డి, వరకాల యాదగిరి, జి. మధు గౌడ్, కోశాధికారి యం.వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏ. రాజేష్, తెలంగాణ చిన్న, మధ్యతరగతి పత్రికల సంఘం అధ్యక్షుడు యూసుఫ్ బాబు, హెచ్.యూ.జే అధ్యక్షుడు శిగా శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
