దొర గణపతి – బీర్ పూర్ కు రా!

👉 మావోయిస్టు సుప్రీమ్  గణపతి నీ జనజీవనంలోకి రమ్మని గుట్ట కింద గ్రామస్తులు విజ్ఞప్తి !

J.SURENDER KUMAR,

” పుట్టింది దొర కులంలో (వెలమ సామాజిక వర్గం) నియంతల శాసించే అవకాశం ఉన్నా, బాంచన్ దొర, అని పిలిపించుకునే స్థాయిలో ఉన్నా, దొరగా పుట్టి దర్జాగా జీవితాన్ని అనుభవించే ఆస్తులు, ఉద్యోగం, బలమైన బంధు వర్గం ఉన్న, అతడు అన్ని కులాలలోని అణగారిన వర్గాల పట్ల ఆవేదన చెందాడు. బానిస బతుకుల్ని చూసి కలత చెందాడు, గత కొన్ని దశాబ్దాల  క్రితమే బందుకు చేతబట్టి తిరుగుబాటుదారుడయ్యాడు, బహుజనుల పాలిట ఆరాధ్యుడయ్యాడు. అజ్ఞాత దళాలకు అగ్రనేతగా మారాడు, అతడే ముప్పాల లక్ష్మణరావు @ గణపతి. ఆయన అజ్ఞాతవాసంను, అడవులను వీడి బీర్పూర్ గ్రామ గడపలోకి రా దొర అంటూ గుట్ట కింద గ్రామస్తులు ముక్తకంఠంతో విజ్ఞప్తి చేస్తున్నారు.”

దండకారణ్యంలో కొనసాగుతున్న ఆపరేషన్ కగర్  నేలకొరుగుతున్న మావోయిస్టు కేంద్ర కమిటీ  కార్యదర్శి, నంబాల కేశవరావు, హీడ్మా, తదితర అగ్ర నేతలు, ఆయుధాలతో సహా లొంగిపోతున్న కేంద్ర కమిటీ సభ్యులు, దళ నాయకులు, దళాలు, కేంద్ర ప్రభుత్వం విధించిన డెడ్ లైన్ 2026 మార్చి 31.  జనజీవన స్రవంతిలో రావాలి అంటూ ఆయా అగ్రనేతల కుటుంబ సభ్యుల విజ్ఞప్తుల  నేపథ్యంలో గణపతి కి ఇద్దరు సోదరులు, ఇద్దరు తోబుట్టువులు, తల్లి తండ్రి, ఓ సోదరుడు సోదరి గతంలోని మృతి చెందారు. భార్య విజయ, కుమారుడు, శ్రీనివాస్ హైదరాబాద్, అమెరికాలో జీవనం కొనసాగిస్తున్నారు. గణపతి స్వగ్రామం బీర్పూర్ లో ఆయన రక్తసంబంధికులు ఎవరూ లేరు. కూలిన ఇంట్లో పెరిగిన తుమ్మలు, చెట్లు చెదారం.

👉 శిథిలమైన గణపతి పూర్వీకుల ఇల్లు !

దాదాపు ఎనిమిది పదుల వయసులో, అనారోగ్య సమస్యలు, తదితర అంశాల నేపథ్యంలో గణపతి స్వగ్రామం బీర్పూర్, గుట్ట కింద గ్రామాల ప్రజల, మాజీ మిలిటెంట్ల, సానుభూతిపరుల, మనోగతం ఉప్పు పాఠకుల కోసం..

👉 బీర్పూర్ నుంచి…..

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మోస్ట్ వాంటెడ్ పర్సన్, ముప్పాల లక్ష్మణరావు @ మావోయిస్టు సుప్రీమ్ బాస్ గణపతి, ఆయన తలకు దాదాపు ₹ 3 (మూడు) కోట్ల పైనే రివార్డు. అతడి కోసం కాకులు దూరని కారడవులు, దండకారణ్యలు, జనఅరణ్యాలను,  ఆధునిక పరికరాల నిఘా నేత్రాలు, అతడి కోసం అనుక్షణం అంతరిక్షం నుంచి గాలించినా, కేంద్ర నిఘా సంస్థలు పసిగట్టలేని రహస్య జీవనాన్ని చేదించడానికి కోట్లాది రూపాయల రివార్డులను ప్రకటించినా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు గణపతి ఎప్పుడు ఓ పెను సవాలే ..  అడవులు, గెరిల్లా శిక్షణలు, విప్లవ సాహిత్యం, మందు పాతరలు, ఎదురు కాల్పులు, ఇవన్నీ గణపతి శరీరంలో ప్రవహించే ఎర్ర రక్త కణాలు, అతని పాదముద్రలు కనిపించే ఆయా ప్రాంతాలు, రక్త గాయాలు, సంగ్రామాలు, భూమికోసం, భుక్తి కోసం అడవి బాట పట్టిన ‘లక్ష్మణుడు’ ఆయన ఓ’ జనం మహల్’ అతడు ఒక ‘జంగల్ మహల్.’

👉 ఐదున్నర దశాబ్దాల క్రితమే గణపతి అజ్ఞాతం లోకి..

ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా, మొదటి పోస్టింగ్ ఎలిగేడు మండల కేంద్రంలో, తర్వాత ఎలగందుల, మేడిపల్లి మండలం గోవిందారంలో విధులు నిర్వహిస్తూ 1972-73 లో బీఈడీ ట్రైనింగ్ కోసం వరంగల్ కు వెళ్లి అజ్ఞాత బాట పట్టాడు. పీపుల్స్ వార్ నక్సల్స్ పార్టీ వ్యవస్థాపకుడు కొండపల్లి సీతారామయ్య ఆధ్వర్యంలో 1975 -76 లో మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తపాలపూర్, భూస్వామి పితంబర్ రావు, ఆయనను ఆయన కుటుంబ సభ్యులను హతమార్చిన సంఘటనలో నాటి కలమడుగు పోలీస్ స్టేషన్ లో నమోదైన ఎఫ్ఐఆర్ లో A 1 గా కొండపల్లి సీతారామయ్య, A 8 గా గణపతి పేరు  నమోదయింది. ఈ కేసులో మొత్తం 16 మందిపై కేసులు నమోదయ్యాయి.

1992లో పీపుల్స్ వార్ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన గణపతి, 2004లో బీహార్ మావోయిస్టు పార్టీతో కలిసి దేశంలో అనేక రాష్ట్రాలలో మావోయిస్టు పార్టీ కార్యకలాపాలను  విస్తరింప చేశారు.
1976-77 లో గణపతిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. బెయిల్ పై బయటికి వచ్చిన గణపతి  ఇప్పటివరకు ఆచూకీ లేదు.  బీర్పూర్ గుట్ట కింద గ్రామాలలో దాదాపు 60 సంవత్సరాల పైబడిన వారికి ఆయన రూపురేఖలు గుర్తిస్తారు.

👉 మొదటిసారి టీవీ ప్రచార సాధనాలలో..!

దాదాపు ఏడు పదుల వయసులో  2010 లో మావోయిస్టు దళాలను ఉద్దేశించి గణపతి ప్రసంగిస్తున్న వీడియో టీవీ ఛానల్ లో ప్రచురితమైంది. మా గణపతి ఇలా ఉంటాడా అంటూ బీర్పూర్,  పరిసర గ్రామాల ప్రజలు నాడు టీవీలకు అతుక్కుపోయారు. ప్రస్తుతం నాటి వీడియో ఫోటోలే ప్రచార మాధ్యమాల్లో చలామణి అవుతున్నాయి..

2009 -10 సంవత్సరంలో ఓపెన్ మ్యాగజైన్ డిప్యూటీ ఎడిటర్, రాహుల్ పండిత్ కు గణపతి మొట్టమొదటిసారిగా ఇచ్చిన వీడియో ఛానల్ ఇంటర్వ్యూ, ప్రచార మాధ్యమాల్లో ప్రచురితం కావడంతో గణపతి రూపం అగుపించింది.

👉 బీర్పూర్  బస్టాండ్ లో అమరవీరుల స్తూపం (ఫైల్ ఫోటో )

👉 రేవంత్ రెడ్డి ప్రభుత్వం సానుకూలంగా ఉంది బీర్పూర్ కు రండి ( శీలం రమేష్. తుంగూరు )

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సానుకూలంగా ఉంది, అన్నా మీరు అజ్ఞాతం వీడి బీర్పూర్ కు రండి అంటూ మావోయిస్టుగా ముద్ర పడిన అమాయకుడు 16 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించిన, తుంగూరు గ్రామానికి చెందిన శీలం రమేష్ విజ్ఞప్తి చేశారు.  మారిన పరిస్థితులు ప్రజల జీవన విధానం, సాంకేతిక విప్లవం తదితరు అంశాలు మీకు తెలుసు,  ప్రభుత్వ విధానాలు  సానుకూలంగా ఉన్నాయి మీరు జనజీవన స్రవంతిలోకి రావాలి అని రమేష్ విజ్ఞప్తి చేశాడు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  2004 లో నక్సలైట్లకు వైఎస్ ప్రభుత్వానికి జరిగిన శాంతి చర్చలలో, అక్రమ కేసులో నక్సలైట్లుగా ముద్ర పడి  అరెస్టయి జైల్లో మగ్గుతున్న  శీలం రమేష్, బీర్పూర్ కు చెందిన సముద్రాల మల్లేష్ @ కుమ్మరి మల్లేష్ లను భేషరతుగా విడుదల చేయాలని నాడు శాంతి చర్చల ప్రతినిధులు ప్రభుత్వానికి డిమాండ్ పెట్టారు.  వీరిని రాజకీయ ఖైదీలుగా గుర్తించాలని మరో డిమాండ్ పెట్టారు. ప్రభుత్వం ఈ డిమాండ్లను తిరస్కరించింది.

రొటీన్ ప్రాతిపదికన ఖైదీల విడుదలకు నాటి ప్రభుత్వం జారీ చేసిన జీవోలో వీరిద్దరి పేర్లు సైతం ఉన్నాయి. అయినా ప్రభుత్వం శీలం రమేష్,( తుంగూర్ ) సముద్రాల మల్లేష్ ( బీర్పూర్) విడుదల చేయకుండా జైల్లోనే ఉంచింది. వీరి విడుదలకు ప్రముఖ న్యాయవాది హైకోర్టులో వాదించడంతో విడుదలయ్యారు. వీరిని విడుదల చేస్తే తిరిగి నక్సలైట్లో కలుస్తారని నాటి ప్రభుత్వం వాదించింది.

👉 బాపు బీర్పూర్ కు రా…. సముద్రాల మల్లేశం ( బీర్పూర్ )

గణపతిని బీర్పూర్ గ్రామస్తులు ప్రేమగా బాపు, దొర అంటూ సంబోధిస్తారు.. సముద్రాల మల్లేష్ బీర్పూర్ గ్రామస్తుడు. పదహారున్నర సంవత్సరాల కాలం పాటు జైలు జీవితం అనుభవించాడు.. గత 15 సంవత్సరాలుగా ప్రశాంతంగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు, ఉద్యమం వద్దు, ఉన్న ఊరే మనకు ముద్దు, బాపు బీర్పూర్ అంటూ విజ్ఞప్తి చేశాడు.


గ్రామంలో చిన్న, పెద్దకు గణపతి పట్ల ఓ ప్రత్యేక అభిమానం ఉంది.  గణపతి కుటుంబం వామపక్ష భావజాల కుటుంబంగా వివరిస్తారు.1970 లో గ్రామానికి వచ్చినప్పుడు గణపతి పంట చేలలో తిరిగేవాడని, పుస్తక ప్రియుడు, మౌనమునిగా, 60 సంవత్సరాల పైబడిన వారు చెప్తుంటారు.

👉 దొర… మన ఊరికి రా.. ( చిరుత రాములు  బీర్పూర్ )

ఇప్పుడు సాయిధ పోరాటం తో సాధించేది ఏమున్నది, ప్రభుత్వమే అన్ని విధాల ప్రజల ఆదుకుంటున్నది.  దొర ( గణపతి నీ ) మన ఊరు బీర్పూర్ కు రా ఇక్కడనే ఉండు మేమంతా లేమా అంటూ రాములు అభ్యర్థించాడు.

👉 బాపు నువ్వు సర్కారుకు లొంగిపో…( చీర్నేని సత్తయ్య   బీర్పూర్ )

బాపు ( గణపతి ) మీ తబియత్ ( ఆరోగ్యం ) మంచిగా లేదు. ఎందుకు జంగల్ లో (అడవిలో) ఉంటావు సర్కార్ కు  లొంగిపో మన బీర్పూర్ కు రా అంటూ  బీర్పూర్ గ్రామానికి చెందిన రైతు   సత్తయ్య విజ్ఞప్తి చేశాడు.

👉 బాపు,  బీర్పూర్ నీ పుట్టిన ఊరు కనుకనే  మండల కేంద్రం అయింది .(మాజీ మిలటెంట్ సంపత్ రాజన్న, తుంగూరు )

బాపు ( గణపతి ) నీ పుట్టిన ఊరు బీర్పూర్ కనుకనే సర్కార్ బీర్పూర్ ను మండల కేంద్రం చేసింది. జూనియర్ కాలేజ్, పోలీస్ స్టేషన్, ఎమ్మార్వో, ఎంపీడీవో, ఆఫీస్ లో వచ్చాయి. సాగు నీరు ,  అన్ని వచ్చాయి. బాపు ఇక చాలు బీర్పూర్ కు రా, ఇక నుంచి ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల సమస్యలు పరిష్కరించుకుందాం. అని మాజీ  మిలిటెంట్ సంపత్ రాజన్న గణపతి కి విజ్ఞప్తి చేశాడు.

👉  సాయుధ పోరాటంలో ఏమున్నది ? మాజీ మిల్టన్ దోసరపు  (బుచ్చన్న  తుంగూరు )

సాయుధ పోరాటంలో ఏమున్నది దొర ( గణపతి) ఆ కాలం అయిపోయింది. ప్రభుత్వమే ప్రజల అవసరాలు తీరుస్తున్నది. అంతా ఆన్ లైన్ విధానం అయింది. దొరలు లేరు, దోపిడీ లేదు. వెట్టి చాకిరి లేదు,  ఉద్యమం ఎందుకు ? ఎవరికోసం ? దొర గణపతి  బీర్పూర్ కు రా ఊరిలోనే ఉండు,  మాకు సలహాలు, సూచనలు ఇవ్వు అని బుచ్చన్న విజ్ఞప్తి చేశారు.