👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోల్ హైలైట్ !
J.SURENDER KUMAR,
ఎన్నో రోజులుగా ఉత్కంఠగా ఎదురుచూసిన ప్రపంచ పుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటినా కెప్టెన్ లియోనెల్ మెస్సీ హైదరాబాద్ ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం మైదానంలో క్రీడాభిమానులను ఉర్రూతలూగించింది. మెస్సీ స్టేడియంలోకి అడుగుపెట్టడం నుంచి ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఎగ్జిబిషన్ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో సింగరేణి ఆర్ఆర్-9 టీమ్ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోల్ సాధించి హైలైట్‌గా నిలిచారు.
👉 ⚽ ఫుట్‌బాల్ దిగ్గజాలు రోడ్రిగో డి పాల్ (అర్జెంటీనా), లూయిస్ సువారెజ్ (ఉరుగ్వే) లతో కలిసి హైదరాబాద్ చేరుకున్న మెస్సీ స్టేడియంలో అడుగుపెట్టినప్పటి నుంచి చివరి వరకు గ్యాలరీలో ఉన్న క్రీడాభిమానులకు అభివాదం చేస్తూ వారిలో జోష్ నింపారు. ప్రారంభంలో సింగరేణి ఆర్ఆర్ 9 టీమ్‌కు, అపర్ణ ఆల్ స్టార్స్ టీమ్‌కు మధ్యన సాగిన ఎగ్జిబిషన్ మ్యాచ్‌ను మెస్సీ ఆసక్తిగా తిలకించారు.
👉 ⚽ ఉత్తేజంగా సాగిన ఈ మ్యాచ్‌లో సింగరేణి ఆర్ఆర్-9 టీమ్ 4-0 గోల్స్‌తో విజయం సాధించింది. ఆర్ఆర్ టీమ్ తరఫున మధ్యలో చేరిన రేవంత్ రెడ్డి నాలుగో గోల్ సాధించినప్పుడు అభిమానులు పెద్ద ఎత్తున కేరింతలు కొట్టారు. అతిధిగా హాజరైన రాహుల్ గాంధీ ఈ మ్యాచ్ జరుగుతున్నంత సేపు గ్యాలరీ నుంచి తిలకించారు.

👉 ⚽ రేవంత్ రెడ్డి గోల్ చేసిన అనంతరం మెస్సీ మైదానంలోకి వచ్చారు. మెస్సీకి స్వాగతంగా క్రీడాభిమానుల హర్షధ్వానాలతో స్టేడియం దద్దరిల్లింది. మొదట ఫుట్‌బాల్ టీమ్‌లకు చెందిన పిల్లలతో మెస్సీ కరచాలనం చేస్తూ సరదాగా గడిపారు. ఎగ్జిబిషన్ ఫుట్‌బాల్ మ్యాచ్ అనంతరం మెస్సీ బృందాల వారిగా ఫుట్‌బాల్ కిక్స్ ఇస్తూ పిల్లలతో ఆడారు.
👉 ⚽ స్టేడియమంతా కలియతిరుగుతూ క్రీడాభిమానుల్లో జోష్‌ను నింపారు. ఒకచోట కాకుండా స్టేడియం నలుమూల తిరుగుతూ ఫుట్‌బాల్‌ను గ్యాలరీలోకి కిక్ చేస్తూ ప్రేక్షకులకు ఫుట్‌బాళ్లను బహూకరించారు. మెస్సీతో పాటు రొడ్రిగో, సువారెజ్‌లు సైతం అభిమానులను అలరించారు. వారు స్టేడియంలో అన్ని వైపుల తిరుగుతూ ఫుట్‌బాల్ టీమ్‌లకు చెందిన పిల్లలతో బృందాల వారిగా రౌండప్ చేసి ఆడుతూ జోష్ నింపారు.
👉 ⚽ 14 సంవత్సరాల తర్వాత భారత్‌లో అడుగు పెట్టిన ఈ అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ క్రీడాభిమానులను మెప్పించారు. మెస్సీ హైదరాబాద్ పర్యటన అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో విజయవంతంగా సాగింది. మెస్సీతో పాటు హైదరాబాద్‌కు చేరుకున్న ఫుట్‌బాల్ క్రీడాకారులు రోడ్రిగో డిపాల్ (అర్జెంటీనా), లూయిస్ సువారెజ్ (ఉరుగ్వే) లు, రేవంత్ రెడ్డి మైదానంలోకి దిగిన సందర్భంలో మెస్సీ.. మెస్సీ.. అంటూ స్టేడియం దద్దరిల్లింది.
👉 ⚽ చివరగా మెస్సీ పిల్లల టీముల వారిగా విడివిడిగా ఫోటోలు దిగారు. మెస్సీ చేతుల మీదుగా ఆర్ఆర్ 9 టీమ్ గోట్ GOAT కప్‌ను స్వీకరించింది. అలాగే అపర్ణ ఆల్ స్టార్స్ టీమ్ రన్నరప్ కప్ అందజేశారు. అర్జెంటీనా టీమ్ 10వ నంబర్ జెర్సీని మెస్సీ స్వయంగా రేవంత్ రెడ్డి , రాహుల్ గాంధీ కి అందజేశారు.

👉 ⚽ ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్‌కు ముందు మ్యూజిక్ కన్సర్ట్, అద్బుతమైన లేజర్ షోతో కార్యక్రమం ప్రారంభమైంది. ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ నాటు నాటు… పాటతో అభిమానులను అలరించారు. గాయకురాలు మంగ్లీ పాటలతో అభిమానుల్లో జోష్ నింపారు. ప్రతాప్ రాణా ప్రత్యేకంగా కంపోజ్ చేసిన పాటను లియోనెల్ మెస్సీ కోసం అంకితం చేశారు.
👉 ⚽ భారత్ పర్యటన, అభిమానులు చూపిన ఆదరణ తనకెంతో ఆనందం కలిగించిందని మెస్సీ వ్యాఖ్యానించారు. తెలంగాణకు స్వాగతం, తెలంగాణ ఈజ్ రైజింగ్.. కమ్ జాయిన్ ద రైజ్… అంటూ ముఖ్యమంత్రి మెస్సీ బృందాన్ని ఉద్దేశించి మాట్లాడారు. క్రీడాభిమానులకు మెస్సీ బృందం అభివాదంతో కార్యక్రమం ముగిసింది.
