గ్రామాలను “డిజిటల్ విలేజ్” లుగా తీర్చిదిద్దండి!

👉 ప్రజాస్వామ్యంలో గ్రామాలు బలంగా ఉంటేనే… రాష్ట్రాలు, దేశం అభివృద్ధి !

👉 ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సర్పంచుల సన్మానోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు !

J.SURENDER KUMAR,

ప్రజల ముంగిటకు పౌర సేవలను చేర్చేలా గ్రామాలను “డిజిటల్ విలేజ్”లుగా తీర్చి దిద్దేందుకు కృషి చేయాలని సర్పంచులకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో కొత్తగా ఎన్నికైన సర్పంచులను ఆదివారం శంషాబాద్ లోని కేఎల్ సీసీ ఫంక్షన్ హాల్ లో మంత్రి శ్రీధర్ బాబు ఘనంగా సన్మానించారు.

👉 ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ….

టెక్నాలజీని అందిపుచ్చుకునే ప్రక్రియలో గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందన్నారు. గ్రామీణులకు మేలు చేయాలనే గొప్ప సంకల్పంతో యూపీఏ హయాంలో ప్రారంభమైన ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్ర పన్నుతుందన్నారు.

👉 ప్రజాస్వామ్యంలో “గ్రామం” అనేది పునాది వంటిదని, అది బలంగా ఉంటేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి పథంలో పయనిస్తాయన్నారు. పదవీ కాలం పూర్తయ్యేలోపు, “మా సర్పంచ్ మా గ్రామాన్ని పూర్తిగా మార్చేశాడు” అని ప్రజలు చెప్పుకునేలా పని చేయాలని సర్పంచులకు సూచించారు.


👉 ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి ఫలాలు చివరి వ్యక్తి వరకు అందేలా పారదర్శకంగా కృషి చేయాలని మార్గనిర్దేశం చేశారు. గ్రామ స్వరాజ్యానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాబోయే రోజుల్లో గ్రామ పంచాయతీలకు దండిగా నిధులు కేటాయిస్తామని స్పష్టం చేశారు.

👉 కొత్త సర్పంచులపై బృహత్తర బాధ్యత ఉందని, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఒక వారధిలా పని చేయాలన్నారు. గెలిచామనే గర్వంతో కాకుండా గ్రామాభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పని చేయాలన్నారు.

👉 గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, వీధి దీపాల ఏర్పాటు లాంటి మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గ్రామాల్లోని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్వహణను నిరంతరం పర్యవేక్షించాలన్నారు.

👉 అందరి భాగస్వామ్యంతో ఈ అయిదేళ్లలో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ లో ఉన్న బిల్లులు రాక ఎంతో మంది సర్పంచులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు.

👉 వాటిని దశల వారీగా క్లియర్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామని స్పష్టం చేశారు. దశల వారీగా సర్పంచులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందన్నారు.

👉 హుందాగా శాసనసభ సమావేశాలు నిర్వహిస్తామని, ప్రతిపక్షాల అసత్య ప్రచారాన్ని ధీటుగా తిప్పికొడతామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మల్ రెడ్డి రంగారెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, వీర్లపల్లి శంకర్,, రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహా రెడ్డి, వికారాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు ధారా సింగ్ తదితరులు పాల్గొన్నారు.