హిడ్మా ఎన్కౌంటర్ ప్రాంతానికి విద్యార్థులు !

👉 పలు యూనివర్సిటీ విద్యార్థులు హిడ్మా  కుటుంబాన్ని కలవనున్నారు !

J.SURENDER KUMAR,

మావోయిస్టు పార్టీ మిలిటరీ విభాగం చీఫ్, కేంద్ర కమిటీ సభ్యుడు మాద్వి హిడ్మా, ఎన్కౌంటర్ జరిగిన  ప్రాంతాన్ని అఖిలభారత విశ్వవిద్యాలయాల విద్యార్థులు సందర్శించనున్నారు.

ఆంధ్ర ప్రదేశ్  అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో నవంబర్ 18న జరిగిన ఎదురుకాల్పుల ఘటనపై నిజనిర్ధారణ కోసం యూనివర్సిటీ విద్యార్థుల బృందం వెళుతున్నట్లు ఓయూ విద్యార్ధులు తెలిపారు.


ఓయూలోని ఆర్ట్స్ కాలేజీ వద్ద సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరులు సమావేశంలో విద్యార్థి ప్రతినిధులు మాట్లాడుతూ గతనెల 18న మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన కాల్పుల సంఘటనతో దేశం మొత్తం ఉలిక్కిపడిందన్నారు.

  ఎన్కౌంటర్లో  మాద్వి హిడ్మా, అతని భార్య రాజేతో పాటూ మరో నలుగురు చనిపోయారని పోలీస్ అధికారులు ప్రకటించినప్పటికీ ఆ ఘటనపై అనేక అనుమానాలున్నాయని విద్యార్థులు ఆరోపించారు.

మీడియా సమావేశంలో విద్యార్థులు.


దేశ వ్యాప్తంగా హక్కుల సంఘాలు, పౌర, ప్రజా సంఘాలు ఇది బూటకపు ఎన్ కౌంటర్ అని ఆరోపిస్తున్నప్పటికీ ఏపీ ప్రభుత్వం నుంచి, ముఖ్యంగా ముఖ్యమంత్రి నుండి ఎటువంటి అధికారిక ప్రకటన రాకపోవడం పెను అనుమానాలకు అవకాశం కలిగిస్తుందని సమావేశంలో విద్యార్థి ప్రతినిధి ఆరోపించారు.

దేశంలోని ప్రజాస్వామిక వాదుల్లో, ప్రజల్లో భయానక వాతావరణం, గందరగోళం నెలకొన్న ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని మారేడుమిల్లి ప్రాంతాల్లో జరిగిన సంఘటనకు సంబంధించిన వాస్తవాలు వెల్లడికావాల్సిన అవసరం ఎంతైన ఉందనీ, దీనికోసమే తాము నిజనిర్ధారణ కోసం వెళుతున్నట్లు విద్యార్థులు తెలిపారు.

దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులతో ఏర్పడిన తమ బృందం డిసెంబర్ 4వ తేదీన హైదరాబాద్ నుండి బయలుదేరి 5వ తేదీన సంఘటన స్థలాన్ని సందర్శించడమే కాకుండా మృతిచెందిన మావోయిస్టు కుటుంబ సభ్యులను కూడా కలుస్తామన్నారు.

మావోయిస్టు పార్టీకి విద్యార్థులు రాసిన లేఖ.


ఈ మేరకు విద్యార్థులు మావోయిస్టులకు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కి, డీజీపీకి , బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో డిసెంబర్ 4న బయలుదేరే తమ బృందానికి ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
పోలీసులు, ఇటు మావోయిస్టు పార్టీ తమదైన వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రజలకు నిజాలు తెలిపేందుకే దేశవ్యాపిత విద్యార్థులతో కూడిన తమ బృందం ఈ నిర్ధారణను చేపడుతుందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ, దళిత, బహుజన, వామపక్ష విద్యార్ధి సంఘాల నాయకులు పాల్గొన్నారు.