👉 విచారణ నివేదిక ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం !
👉 ధర్మపురి నియోజకవర్గ సర్పంచ్ ల సన్మాన సభలో..
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను కాళేశ్వరం ప్రాజెక్టుకు మళ్లించడం ద్వారా దళిత, గిరిజన వర్గాలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఈ నిధుల మళ్లింపుపై త్వరలో తాను ఆశాఖ మంత్రిగా సమగ్ర విచారణ చేపట్టి, నివేదిక ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు.
నియోజకవర్గ కేంద్రమైన ధర్మపురి పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహ గార్డెన్స్‌లో ఆదివారం నియోజకవర్గ పరిధిలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచ్ లు, ఉపసర్పంచ్, వార్డు సభ్యులకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో మంత్రి లక్ష్మణ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాజంగి నందయ్య, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు, ముఖ్య నాయకులతో కలిసి మంత్రి పాల్గొన్నారు.
👉 ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…..

స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 70 శాతం పైగా సర్పంచ్ సీట్లు గెలుచుకొని ప్రజల విశ్వాసాన్ని మరోసారి పొందిందన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలిచారని అన్నారు.
👉 స్థానిక ఎన్నికల తర్వాత రాజకీయంగా ఉనికే కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు అసహనంతో, విచక్షణ రాహిత్యంగా మాట్లాడుతున్నారని మంత్రి ఆరోపించారు.

👉 ముఖ్యంగా కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరిస్తూ, కాంగ్రెస్ పార్టీ నాయకులు నిజాలు మాట్లాడితే తట్టుకునే స్థితిలో బీఆర్ఎస్ లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు.
👉 పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమిని ముందే ఊహించిన బీఆర్ఎస్ నాయకత్వం, పోలింగ్ రోజు బీజేపీకి ఓటేయాలని పరోక్షంగా ప్రచారం చేసిందని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు.

👉 కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి దోహదపడుతున్నాయని, సర్పంచ్‌లు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.
👉 సర్పంచ్‌ల విజయమే కాంగ్రెస్ పార్టీ బలానికి నిదర్శనమని, రాబోయే ఎన్నికల్లో మరింత ఘన విజయాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
👉 ఈ కార్యక్రమం కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపిందని,రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాలు మరింత వేగవంతం చేస్తామని నాయకులు తెలిపారు.
👉 ఈ కార్యక్రమంలో ధర్మపురి నియోజకవర్గ సర్పంచులు ఉపసర్పంచులు మరియు వార్డ్ మెంబర్లు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
