👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !
J.SURENDER KUMAR,
రాసిపెట్టుకోండి. రెండోసారి కాంగ్రెస్ పాలనను తీసుకువస్తాం. కెసిఆర్ ను తిరిగి అధికారంలోకి రానివ్వను అనిసీఎం రేవంత్ రెడ్డి సర్పంచుల సమావేశంలో సవాల్ చేశారు. నేను నల్లమల నుంచి వచ్చి జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ తర్వాత ముఖ్యమంత్రిని అయ్యాను. పగ సాధించడం మొదలు పెడితే రాష్ట్రానికి నష్టం జరుగుతుందని వదిలి పెట్టా.అని సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ ను హెచ్చరించారు.
కాంగ్రెస్ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్‌లకు కొడంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం సన్మానించారు. నారాయణపేట జిల్లా కోస్గిలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో కోస్గి, దౌల్తాబాద్, కొడంగల్, బొంరాస్‌పేట్, కొత్తపల్లికి చెందిన 180 మంది సర్పంచ్‌లు, 180 మంది ఉప సర్పంచ్‌లు, 1,739 మంది వార్డు సభ్యులకు సీఎం సన్మానం చేశారు.
👉 ఈ సందర్భంగా గ్రామాల అభివృద్ధిపై సీఎం దిశానిర్ధేశం చేశారు..
ఎన్నికలు ముగిశాయి.. ఇక రాజకీయాలు లేవు.. పార్టీలు, పంతాలకు పోకుండా.. వివక్ష చూపకుండా అందర్నీ కలుపుకుని పోవాలి.. పక్క పార్టీ నుంచి గెలిచిండని వివక్ష చూపకండి.. అలా చేస్తే గ్రామాభివృద్ధి నిలిచిపోతుంది.. చిన్న గ్రామాలకు ₹ 5 లక్షలు, పెద్ద గ్రామాలకు ₹ 10 లక్షలు ప్రత్యేక నిధులు ఇస్తాం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులకు ఈ నిధులు అదనం.. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు సంబంధం లేకుండా సీఎం నుంచి నేరుగా గ్రామాలకు ప్రత్యేక నిధులు అందిస్తానని సీఎం అన్నారు.
👉 ఈ సందర్భంగా సర్పంచులు ఉప సర్పంచ్ లు వార్డు సభ్యుల ఉద్దేశించి సీఎం మాట్లాడుతూ..
2029లో 80 శాతానికి పైగా సీట్లతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.. నేను రాజకీయాల్లో ఉన్నంతకాలం కల్వకుంట్ల కుటుంబాన్ని అధికారంలోకి రానివ్వను.. వాటా ఇవ్వాల్సి వస్తుందనే సొంత బిడ్డను, అల్లుడిని కెసిఆర్ వెల్లగొట్టిండు అని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.
కేసీఆర్ ఉడత ఊపులకు భయపడేవాడిని కాదు.. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు అసెంబ్లీ పెడతా.. పార్టీ ఆఫీసులో కాదు.. అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి.. కూలిన కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ అనేక అంశాలపై చర్చిద్దాం రా అని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేశారు.
