👉 హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు ను ఆహ్వానించేందుకు స్వయంగా వెళ్లిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
👉 తెలంగాణలో అభివృద్ధి పనులపై ఇరువురి మధ్య చర్చ !
👉 అభివృద్ధి అద్భుతమంటూ సీఎం సుఖ్వీందర్ ప్రశంస !
J.SURENDER KUMAR,
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’ కు తప్పకుండా హాజరవుతానని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు హామీ ఇచ్చారు.
ఈనెల 8, 9 తేదీల్లో తెలంగాణలో జరగనున్న గ్లోబల్ సమ్మిట్ కు రావాలని ఆహ్వానించేందుకు శుక్రవారం స్వయంగా రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హిమాచల్ ప్రదేశ్ కు వెళ్లారు. ఈమేరకు సీఎం సుఖ్వీందర్ ను కలిసి ఈ సమ్మిట్ కు హాజరవ్వాలని ఆహ్వానించారు.
అనంతరం తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఇరువురు చర్చించారు. తెలంగాణ డెవలప్‌మెంట్ అద్భుతమని ఈ సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ ప్రశంసించారు.
ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించడం, రాష్ట్ర బ్రాండ్‌ను అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయడంలో భాగంగా ఈ సమ్మిట్ ను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది.

దీనికి సంబంధించిన పనులు కూడా చకచకా పూర్తవుతున్నాయి. తెలంగాణ రైజింగ్-2047 దార్శనిక పత్రాన్ని ఈ సమ్మిట్ లోఆవిష్కరించనున్నారు.
ఈ సదస్సుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోని దాదాపు 3 వేల మంది ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు, టెక్నాలజీ నిపుణులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, దౌత్యవేత్తలు హాజరుకానున్నారు.
ఇదిలా ఉండగా ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేలను కూడా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆహ్వానించారు. సదస్సులో భాగంగా క్రీడా నగర ప్రాజెక్టులు, సినీ స్టూడియోలు, పర్యాటక భాగస్వామ్యాలు వంటి వివిధ రంగాల్లో అవగాహన ఒప్పందాలు కూడా కుదిరే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఈ సమ్మిట్‌ను దావోస్ సదస్సు తరహాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. రాష్ట్ర భవిష్యత్ ప్రణాళికలకు కీలక వేదికగా మీ సమ్మిట్ మారనుంది.
