👉 మావోయిస్టు పార్టీలో చర్చ..?
J.SURENDER KUMAR,
దండకారణ్యంలో ఆపరేషన్ కగర్ తో పాటు ఎదురు కాల్పులు, అగ్ర నేతలు, కేంద్ర కమిటీ సభ్యులు హతం, కీలక నేతల లొంగుబాట్ల తో మావోయిస్టు పార్టీ కీలక నేతలు తమ దళాలతో ప్రభుత్వానికి లొంగి పోదామా ? కొంతకాలం పాటు ఆయుధాలు వదిలి కార్యకలాపాలకు దూరంగా ఇతర రాష్ట్రాలలో అజ్ఞాతంలో గడుపుదామా ? అనే చర్చ కీలక నేతల సమావేశంలో జరిగినట్టు సమాచారం.
ఈ సమావేశం ఆ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్ కు ముందు జరిగిందా ? తరువాత జరిగిందా ? అనే అంశంలో స్పష్టత లేదు. అయితే ఇటీవల కేంద్ర బలగాలకు చిక్కిన మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సర్క్యులర్ లోని అంశాలు ప్రచార మాధ్యమాల్లో చెక్కర్లు కొడుతున్న తరుణంలో కీలక నేతల సమావేశ విషయం పై చర్చ కొనసాగుతున్నది.
కీలక అగ్రనేతల సమావేశంలో దళ నాయకులు, సభ్యులు ఇతర రాష్ట్రాలలో రహస్య జీవనం కొనసాగించాలని, సంవత్సరకాలం తర్వాత పరిస్థితులు మనకు అనుకూలంగా ఉంటే తిరిగి యధావిధిగా కార్యక్రమాలు కొనసాగించాలని, కొందరు కీలక అగ్రనేతలు తన అభిప్రాయాలు వ్యక్తం చేసినట్టు చర్చ.
నిత్యం మనతోపాటు చావు బ్రతుకుల మధ్య వెన్నంటి ఉండే కామ్రేడ్స్ లు ఇతర రాష్ట్రాలలో రహస్య జీవనం కొనసాగించడం సాధ్యమా ? వయస్సు, ఆరోగ్య పరిస్థితులు, ఆయా ప్రాంతాలలో వారు జీవనం ఎలా కొనసాగిస్తారు ? ఉపాధి అవకాశాలు ఉంటాయా? ఇంతకాలం మనతో పాటు ఉన్న వారిని ఎవరి దారి వారు చూసుకోండి అంటే ఎలా? వర్గ శత్రువులతో పొంచి ఉన్న ముప్పు అని మరికొందరు కీలక నేతలు పరస్పరంగా చర్చించినట్లు సమాచారం.
ప్రభుత్వానికి లొంగి ఆయా ప్రభుత్వాలు కల్పించే ఉద్యోగ ఉపాధి అవకాశాలు, రివార్డులను తీసుకోవడమే సమంజసమనే చర్చ జరిగినట్టు సమాచారం. కీలక నాయకుల మధ్య భిన్న అభిప్రాయాల నేపథ్యంలో సాయుధ పోరాట విరమణ, లొంగుబాటులు, తదితర అంశాల పై మరోసారి చర్చించుకుందాం, అంటూ సమావేశం వాయిదా వేసినట్టు సమాచారం.

జనజీవన స్రవంతిలోకి చేరిన మావోయిస్టు అగ్ర కీలక నేతలు, లొంగుబాటులు, అజ్ఞాతవాసం గూర్చి సమావేశంలో చర్చ జరిగిందా ? లేదా ? అనే విషయం వారు నిర్ధారిస్తే కానీ వాస్తవమా ? వదంతి మాత్రమేనా ? అనేది తేట తెల్లం కానున్నది.
