👉 న్యాయ సహాయం కోసం ముఖ్యమంత్రికి విజ్ఞప్తి !
J.SURENDER KUMAR,
సిద్ధిపేట జిల్లా, అక్బర్‌పేట – భూంపల్లి మండలం పోతరెడ్డిపేట గ్రామానికి చెందిన మహ్మద్ అబ్దుల్ ఖాదర్ ను మలేసియా జైలు నుంచి విడుదల చేయాలని ఆయన కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. ఖాదర్ భార్య సలీమా బేగం, కుమారుడు సల్మాన్, మంగళవారం హైదరాబాద్ బేగంపేట లోని ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి వినతిపత్రాన్ని సమర్పించారు.
తాము ఇదివరకే మెదక్ ఎంపీ ఎం. రఘునందన్ రావును ఈ విషయమై సంప్రదించినట్టు వారు వెల్లడించారు.
తన భర్త గత 11 నెలలుగా మలేసియా జైల్లో ఉన్నారని, ఆయనకు తక్షణ న్యాయ సహాయం (లీగల్ ఎయిడ్), దౌత్య సహాయం (కాన్సులార్ హెల్ప్) అందించాలని సలీమా బేగం కోరారు.
టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ సూచనలతో తాము ప్రవాసీ ప్రజావాణిని ఆశ్రయించామని తెలిపారు. ఎన్నారై అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి వారికి మార్గదర్శనం చేశారు.

2018లో ఉద్యోగం నిమిత్తం మలేసియాకు వెళ్లిన ఖాదర్, సహోద్యోగితో జరిగిన గొడవ నేపథ్యంలో జైల్లోకి వెళ్లినట్టు కుటుంబ సభ్యులు వివరించారు. మలేసియాలోని తెలంగాణ సామాజిక సేవకుడు బూరెడ్డి మోహన్ రెడ్డి, కౌలాలంపూర్‌లోని ఇండియన్ హైకమీషన్‌తో ఈ కేసు విషయంలో సమన్వయం సాగిస్తున్నారని తెలిపారు.
ఈ సందర్భంగా ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం ప్రతినిధి మహ్మద్ బషీర్ అహ్మద్, నేషనల్ వర్కర్ వెల్ఫేర్ ట్రస్ట్ ప్రతినిధి భార్గవి, బహరేన్ లోని తెలంగాణ సోషల్ వర్కర్ నోముల మురళి, తెలంగాణ ప్రభుత్వ జిఏడి ఎన్నారై శాఖ సెక్షన్ ఆఫీసర్ కంచర్ల శ్రీనివాస రెడ్డి, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు రాజీవ్ కుమార్, సమీనా బేగంలు ఆ కుటుంబాన్ని ఓదార్చి, ధైర్యం చెప్పారు.
