మా ప్రభుత్వ పాలనలో సర్పంచుల పాత్ర కీలకం !

👉 ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్‌చార్జ్‌, మంత్రి  అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

మా కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనలో సర్పంచుల పాత్ర   కీలక భాగస్వాములుగా భావిస్తోందని, వారి ప్రతిపాదనలకు పూర్తి సహకారం అందిస్తామని  రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి మంత్రి  అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఘన విజయం సాధించిన నూతన సర్పంచుల ఆత్మీయ సన్మాన కార్యక్రమన్నీ  ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత చీఫ్ విప్  బిర్ల ఐలయ్య ఆధ్వర్యంలో  మంగళవారం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్‌చార్జ్‌,  మంత్రి  అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని నూతన సర్పంచులను శాలువాలతో సత్కరించారు.

👉 ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..

ముఖ్యమంత్రి . రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పాలనకు పెద్దపీట వేస్తోందని స్పష్టం చేశారు. గ్రామాలు బలపడితేనే రాష్ట్రం బలపడుతుందన్న దృఢమైన నమ్మకంతో ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు.

సర్పంచులు గ్రామాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ పారదర్శకంగా, వివక్ష లేకుండా అందేలా ముందుండి కృషి చేయాలని మంత్రి సూచించారు. దళితులు, గిరిజనులు, బీసీలు, మైనారిటీలు, మహిళలు, దివ్యాంగులు సహా అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా గ్రామ పాలన సాగాలన్నారు.

గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, తాగునీరు, పారిశుధ్యం, అంతర్గత రహదారులు, విద్యుత్‌, పల్లె ఆరోగ్య సేవలు, మహిళా స్వయం సహాయక సంఘాల బలోపేతం వంటి అంశాలపై సర్పంచులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

గ్రామాల్లో సామాజిక సామరస్యాన్ని కాపాడుతూ, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పాలన సాగించాలని, ప్రజల సమస్యలను నేరుగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే వారధులుగా సర్పంచులు పనిచేయాలని మంత్రి ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఆలేరు ఎమ్మెల్యే, చీఫ్ విప్  బీర్ల ఐలయ్య, భువనగిరి ఎంపీ  చామల కిరణ్ కుమార్ రెడ్డి  పాల్గొని నూతన సర్పంచులకు దిశా నిర్దేశం చేశారు.

కాంగ్రెస్ పార్టీకి గ్రామస్థాయిలో లభించిన ఆదరణకు ఇది నిదర్శనమని వారు పేర్కొంటూ, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా సర్పంచులు పని చేయాలని పిలుపునిచ్చారు.

ఈసన్మాన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో నూతన సర్పంచులు పాల్గొన్నారు.