మాట తప్పని నాయకురాలు సోనియాగాంధీ !

👉 సోనియా గాంధీ జన్మదిన వేడుకలలో..

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J SURENDER KUMAR,

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తాను అని ఇచ్చిన మాటను తప్పని మహా నాయకురాలు  సోనియా గాంధీ అని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. సోనియా గాంధీ జన్మదినోత్సవం సందర్భంగా ధర్మపురి  మంత్రి  క్యాంప్ కార్యాలయంలో  మంగళవారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు  జరిగాయి.


👉 ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ….

ప్రత్యేక రాష్ట్ర హామీని నిలబెట్టుకున్న నాయకురాలని అన్నారు. దేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబానికి చెందినవారని, నిబద్ధత కలిగిన నాయకురాలు సోనియా గాంధీ అనే మంత్రి కొనియాడారు.

👉 దేశ ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా, దేశ హితాన్ని దృష్టిలో పెట్టుకుని డా. మన్మోహన్ సింగ్‌ను ప్రధానమంత్రిగా చేశారని గుర్తు చేశారు. సోనియా గాంధీ లేకుంటే తెలంగాణ ఉండేదే కాదని  మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న వ్యాఖ్యలను ప్రస్తావించారు.

👉 తెలంగాణను దేశంలో అగ్రస్థానానికి తీసుకెళ్లడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ద్వారా విదేశీ పెట్టుబడులు తీసుకురావడంలో సీఎం రేవంత్ రెడ్డి  ప్రత్యేకంగా శ్రమిస్తున్నారని మంత్రి అన్నారు.

👉 గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలుచేసిందని విమర్శించారు. అయినప్పటికీ రాష్ట్రాన్ని ఆర్థికంగా నిలబెట్టేందుకు ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. ప్రస్తుతం నెలకు ₹ 6 వేల కోట్ల వడ్డీ భారం పడుతోందని వెల్లడించారు.

👉 కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 60 వేల మంది నిరుద్యోగులకు నియామక పత్రాలు అందించామని చెప్పారు. గత పదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదని మంత్రి లక్ష్మణ్ కుమార్ వ్యాఖ్యానించారు.

👉 పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత మా ప్రభుత్వానిదని, కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు.

👉 దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌ను సీఎం రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్నారని తెలిపారు. మరో 20 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధి దిశగా ఈ సమ్మిట్ నిర్వహిస్తున్నామని చెప్పారు.

👉 ఇందిరమ్మ ఇండ్లపై విమర్శలు చేసిన బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. పేదలకు ఇండ్లు ఇస్తూ, ప్రతి సోమవారం నిధులు విడుదల చేస్తున్నామని స్పష్టం చేశారు. గత సీఎం, వారి కుటుంబ సభ్యులు ఫామ్ హౌజులు, బంగ్లాల నిర్మాణాలకే పరిమితమయ్యారని మంత్రి ఆరోపించారు.