👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !
J SURENDER KUMAR,
ఇతర మతాలను కించపరిచేలా మాట్లాడితే శిక్షించే విధంగా చట్టం తెస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. సమాజంలో ఎవరి మతాన్ని వారు ఆచరిస్తూనే ఇతర మతాలను గౌరవించుకుంటూ శాంతిని కాపాడుకోవలసిన అవసరం ఉందని, ఇతర మతాలను కించపరిచే వారిని శిక్షించే విధంగా వచ్చే శాసనసభ సమావేశాల్లో చట్టం చేస్తామని అన్నారు.

👉 హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో శనివారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి , మహమ్మద్ అజారుద్దీన్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, ఉన్నతాధికారులు, క్రిస్టియన్ మత పెద్దలు, ప్రజాప్రతినిధులతో పాటు క్రిస్టియన్ పెద్దల సమక్షంలో కేక్ కట్ చేశారు. క్రిస్టియన్ సోదర, సోదరీమణులకు ముఖ్యమంత్రి క్రిస్మస్ శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
👉 ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, మత ప్రాతిపదికన దాడులకు పాల్పడితే ప్రభుత్వం సహించదని స్పష్టం చేశారు. అలాంటి ఘటనలను ప్రభుత్వం కఠినంగా అణిచివేసిందని, అన్ని మతాలకు సమాన హక్కును స్వేచ్ఛను కల్పిస్తామని అన్నారు.

👉 “శాంతిని ఇవ్వాలి, ప్రేమను పంచాలన్న ఏసు ప్రభువు ఇచ్చిన గొప్ప సందేశం స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం పనిచేస్తోంది. ఏసు ప్రభువు స్ఫూర్తితో తెలంగాణలోని 4 కోట్ల మంది ప్రజలకు శాంతిని, సంక్షేమ కార్యక్రమాలను అందిస్తోంది. మానవ సేవయే మాధవ సేవ అని భావించి ప్రేమను పంచాలని, శాంతిని పెంచాలని ఏసు క్రీస్తు చాటారు.
👉 ఏసు క్రీస్తు జన్మించిన డిసెంబర్ నెల ప్రభువు ఆరాధకులకు మాత్రమే కాదు. తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్‌కు కూడా ఒక మిరకిల్ (అద్భుతమైన) మాసం. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుకూలంగా ప్రకటన వెలువడటమే కాకుండా ప్రజా ప్రభుత్వం ఏర్పడింది కూడా డిసెంబర్ నేలలోనే.

👉 ఎవరెన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టినా, దుష్ప్రచారం చేసినా రాష్ట్రంలో శాంతిని కాపాడుతూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. గతంలో ఎప్పుడూ లేని విధంగా నిరుపేదలకు సంక్షేమ కార్యక్రమాలను అందిస్తున్నాం.
👉 క్రిస్టియన్ మిషనరీలు విద్య, వైద్యం ప్రాధాన్యతను గుర్తించి పేదలకు ఎంతో అంకిత భావంతో, ప్రభుత్వంతో పోటీ పడి పేదలకు ఉదాత్తమైన సేవలు అందిస్తున్నాయి.
👉 మైనారిటీలకు ప్రభుత్వం అందించే సంక్షేమం, అభివృద్ధి ఎవరి దయ కాదు. అది వారి హక్కు. ఆ హక్కులను కాపాడటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. క్రిస్టియన్, ముస్లిం మైనారిటీల స్మశాన వాటికల సమస్యను పరిష్కరిస్తాం. ఊరికి కొంత దూరమైనప్పటికీ స్మశాన వాటికలను ఏర్పాటు చేస్తాం.
👉 నూతన సంవత్సరం గొప్ప మార్పును తీసుకురావాలి. తెలంగాణ రైజింగ్ 2047 తో నిర్దేశించుకుని లక్ష్యాలను సాధించడానికి, అందుకు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళతాం. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణను దేశంలోనే రోల్ మాడల్‌గా నెంబర్ వన్‌గా తీర్చిదిద్దాలన్న లక్ష్య సాధనకు మీరందరూ ఆశీర్వాదం అందించాలి..” అని ముఖ్యమంత్రి కోరారు.
