J.SURENDER KUMAR,
కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ లో గ్రూపులు, ఇరువర్గాల అంశం అంతర్గతంగా కొనసాగుతున్నప్పటికీ రాష్ట్ర పార్టీ అధిష్టానం మాత్రం టీ కప్పులో తుఫాన్ అంటూ పేర్కొన్నడం విధితమే.
రాష్ట్రంలో వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయా రాజకీయ పార్టీలలో వర్గ విభేదాలు ఉండవచ్చు ఉండకపోవచ్చు అయితే..
జిల్లా కేంద్రమైన జగిత్యాల్ నియోజకవర్గంలో గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ల పట్టేదారుల, కౌలుదారుల ఆరోపణల వివాదం జగమెరిగిన సత్యమే..
జగిత్యాల పట్టణం వరకే పరిమితమైన ఈ వర్గ వివాదం పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో మొదలైంది. పంచాయతీ ఎన్నికలలో రాజకీయ పార్టీ గుర్తులు లేనప్పటికీ జగిత్యాల నియోజకవర్గంలోని ప్రతి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా పోటీలో ఉన్న అభ్యర్థులలో ఒకరిపై జీవన్ రెడ్డి వర్గంగా, మరో అభ్యర్థికి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గంగా ఆయా గ్రామాలలో రాజకీయ వర్గాలు ఏర్పడిందనే చర్చ ప్రజల్లో మొదలైంది. గ్రామాల్లో బిజెపి బీఆర్ఎస్, బీఎస్పీ, కాంగ్రెస్ ఆయా పార్టీల వర్గాలుగా కొనసాగేవి. ప్రస్తుత పంచాయతీఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలోనే రెండు వర్గాలుగా ఏర్పడడం గమన హారం.ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, బిజెపి పార్టీల పక్షాన అభ్యర్థుల ఉనికి అగుపించడం లేదు.
దీనికి తోడు ఇరువురు నాయకులు ఆయా గ్రామా సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ లో వెంట ఉండి నామినేషన్లు వేయించిన సందర్భం గానీ, బహిరంగంగా ప్రచారాలు చేసిన సందర్భం లేదు. అయితే కొన్ని పంచాయతీలలో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ లు మాత్రం ఇరువురి నాయకులను కలసి కృతజ్ఞతలు తెలపడం ప్రత్యేకత.
ఇదిలా ఉండగా ఆయా రాజకీయ పార్టీలో కొనసాగుతున్న నాయకులు త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పిటిసి, ఎన్నికల్లో పార్టీ గుర్తులపై పోటీ చేయాల్సి ఉంటుంది, గ్రామాల్లో వర్గాల సాంప్రదాయం, సంస్కృతి కొనసాగితే ప్రశాంతమైన పల్లె ప్రాంతాలలో శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని బీర్పూర్ గ్రామానికి చెందిన ఓటరు ఆవేదన వ్యక్తం చేశాడు.
👉 బీర్పూర్ లో పండుగ తరహాలో ఎన్నికలు ప్రక్రియ సిద్ధం !

రెండో విడత ఆదివారం జరుగునున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో దాదాపు మూడు వేల ఓటర్లు ఉన్న బీర్పూర్ గ్రామపంచాయతీ కార్యాలయ ప్రహరి నీ పండగ వాతావరణంగా తీర్చిదిద్దారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేర్కొన్న ” ఓటు హక్కు వినియోగించుకుందాం ప్రజాస్వామ్య గెలిపించుకుందాం ” తదితర సందేశాల చిత్రపటాలను అలంకరించారు.
👉 మూడు దశాబ్దాల క్రితం..
దాదాపు రెండున్నర దశాబ్దాల కాలం క్రితం వరకు ఎమ్మెల్యే, ఎంపీ, స్థానిక సంస్థల ఎన్నికలంటే ప్రభుత్వ యంత్రాంగంలో, జాతీయ స్థాయి ప్రచార సాధనాల్లో బీర్పూర్ గ్రామం పేరు మారుమోగేది..
కారణం మావోయిస్టు అగ్రనేత గణపతి @ ముప్పాల లక్ష్మణరావు స్వగ్రామం కావడంతో పాటు. ఎన్నికలు బహిష్కరించాలి అని నాటి నక్సల్స్ పిలుపుతో అధికార యంత్రాంగం తో పాటు, ప్రచార సాధనాలు ఉత్కంఠం కొనసాగేది. కొన్ని సార్లు సర్పంచ్, వార్డు పదవులు ఎన్నికలు జరగకుండా ఏకగ్రీవం అయినా సందర్భాలు ఉన్నాయి.

👉 బీర్పూర్ అంటే ఎనలేని క్రేజ్..
సందర్శించిన మొట్ట మొదటి ఏకైక హోం మంత్రి!
నక్సల్స్ ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్న తరుణంలో ఆ అగ్ర నాయకుడు, గణపతి @ ముప్పాల లక్ష్మణరావు స్వగ్రామం బీర్పూర్ ఎలా ఉంటుంది అనే క్రేజ్ ఉండేది. 1989 ఆగస్టు లో జగిత్యాల డివిజన్ సారంగాపూర్ మండల కేంద్రంలో అభివృద్ధి పనుల భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న నాటి తెలుగుదేశం ప్రభుత్వంలో హోం మంత్రిగా కొనసాగిన స్వర్గీయ ఏలేటి మాధవరెడ్డి, తన పర్యటన షెడ్యూల్ లో లేని బీర్పూర్ గ్రామాన్ని సందర్శించారు.
ప్రస్తుతం స్వేచ్ఛగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఆయా అభ్యర్థులు ప్రచారం చేసుకోవడంతో పాటు, ఓటింగ్ లో పాల్గొనాల్సిందిగా గడపగడపకు తిరుగుతూ ఓటర్లను ప్రాధేయపడుతున్నారు. ప్రస్తుతం బీర్పూర్ మండల కేంద్రంగా కొనసాగుతున్నది, పోలీస్ స్టేషన్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఆసుపత్రి, ఎమ్మార్వో ఎంపీడీవో, కార్యాలయాలు, మీసేవ కేంద్రాలు 108 అంబులెన్స్ అందుబాటులో ఉండడంతో పాటు. ఈ గ్రామ యువత ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు భారత సైన్యంలో పోలీస్ శాఖల విధులు నిర్వహిస్తున్నారు. ఈ గ్రామ యువత ఉద్యోగ అవకాశాలు, గుట్ట కింద గ్రామాల యువతకు స్ఫూర్తినిచ్చిందనే చర్చ జరుగుతోంది.
