👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రజా పాలనలో జరిగిన స్థానిక గ్రామపంచాయతీ ఎన్నికలలో వచ్చిన ఫలితాలే మా ప్రభుత్వ పాలన తీరుకు నిదర్శనం అని, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో శుక్రవారం మీడియా సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గజంగి నందయ్యతో కలసి మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడారు.
👉 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాల కాలంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలుపరుస్తున్న తీరును, ప్రత్యేకంగా పౌరులకు ప్రతిపక్ష పార్టీలకు స్వేచ్ఛ స్వాతంత్రం, ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వ యంత్రాంగం ప్రశాంతంగా నిర్వహించిన ఎన్నికల తీరుకు ప్రజలు పట్టంకట్టి మెజార్టీ సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ పార్టీకి కట్టబెట్టారని మంత్రి లక్ష్మణ్ కుమార్ వివరించారు.
గత దశాబ్ద కాలంలో నేనే రాజు, నేనే మంత్రి అన్నట్టుగా టిఆర్ఎస్ అగ్ర నాయకులు ఇష్ట రాజ్యాంగ ప్రవర్తించి, రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి ప్రజలపై అప్పులఆర్థిక భారం మోపారు అని మంత్రి ఆరోపించారు. బి ఆర్ ఎస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీరుపై విమర్శల వర్షం గుప్పిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినప్పటికీ ప్రజలు వాటిని పట్టించుకోలేదన్నారు.
మా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు హామీల్లో నాలుగు ప్రధానమైన అంశాలను అమలు చేస్తూ గ్రామాలను అభివృద్ధి చేసే దిశలో ముందుకు వెళ్లేందుకే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం జరిగిందని మంత్రి అన్నారు.
జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు మెజారిటీ స్థాయిలో విజయం సాధించి తమ ప్రభుత్వ పనితీరుకు అద్ధం పట్టారని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
