విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు !

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J SURENDER KUMAR,

ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులను తమ పిల్లల్లాగా చూసుకోవాలని, వారిపట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, రాష్ట్ర షెడ్యూల్ కులాలు,  గిరిజన సంక్షేమం,  దివ్యాంగులు వయోవృద్ధులు మరియు ట్రాన్స్ జెండర్ సాధికారిక శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

భూపాల్ పల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయ భవనంలో బుధవారం భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు, పోలీస్, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల అధికారులు, ఆర్సీఓలు, జిల్లా కో ఆర్డినేటర్లు, ఎస్సి కార్పోరేషన్ ఈడీలతో వసతి గృహాలు నిర్వహణ, సౌకర్యాలు, విద్యార్థులకు వైద్య పరీక్షలు తదితర అంశాలపై మంత్రుల లక్ష్మణ్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

👉 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ….

వసతి గృహాల విద్యార్థుల  భద్రత, విద్య, భోజనం, వైద్య సౌకర్యాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని, జిల్లాల వారీగా విద్యార్థుల సంఖ్య, ఉత్తీర్ణత శాతం, అందుతున్న సౌకర్యాలపై వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు.

ఉత్తమ ఫలితాల కోసం స్టడీ అవర్స్ తప్పనిసరిగా నిర్వహించాలని, విద్యార్థులకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేపట్టాలని ఆదేశించారు. అనుమతి లేకుండా విద్యార్థులను బయటకు పంపకూడదని, వసతి గృహాల్లోకి బయటి వ్యక్తులు రానీయకూడదని స్పష్టం చేశారు.
వసతి గృహాలలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ సిబ్బందికి గ్రీన్ ఛానల్ ఏర్పాటు ద్వారా ప్రతినెల వేతనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.

ప్రతి హాస్టల్‌ పర్యవేక్షణకు ప్రత్యేక పర్యవేక్షణ అధికారిని నియమించి విద్యార్థులతో మమేకమై డైట్, మెనూ, సంరక్షణ  పాటించేలా చూడాలని సూచించారు.

ప్రతి హాస్టల్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయాలని, షీ-టీమ్ ద్వారా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి స్పష్టం చేశారు.

👉 శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ...

వసతి గృహాల అభివృద్ధికి ఎస్ డి ఎఫ్  నుంచి ₹6 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. మరుగుదొడ్లు, తాగునీటి సమస్యలపై శాఖల అధికారులు నివేదికలు అందించాలని సూచించారు.

విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సీసీ కెమెరాలు, భద్రతా సిబ్బంది తప్పనిసరిగా ఉండాలని, ఏజెన్సీ ద్వారా సెక్యూరిటీ సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకుంటామన్నారు.

కాస్మెటిక్, డైట్ చార్జీలను రాష్ట్ర ప్రభుత్వం పెంచిందని, విద్యా, వైద్య రంగాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. తప్పులు జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

కొరికిశాల,  భూపాలపల్లి అర్బన్ పాఠశాల ఘటనపై జిల్లా కలెక్టర్ తగిన చర్యలు తీసుకున్నారని  తెలిపారు.

👉 జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ….

వసతి గృహాల్లో సౌకర్యాలు, డైట్ కాస్మెటిక్ చార్జీల పర్యవేక్షణకు మండల ప్రత్యేక అధికారులు, పోలీస్ తదితర శాఖల సమన్వయంతో నిరంతర పర్యవేక్షణ చేపడుతున్నట్లు తెలిపారు.

వరంగల్, హన్మకొండ జిల్లాల కలెక్టర్లు స్నేహ శబరిస్, సత్య శారద, భూపాలపల్లి ఎస్పీ సంకీర్త్, ఐటిడిఎ పీఓ చిత్రామిశ్రా, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్,  విజయలక్ష్మి, ఎస్సి అభివృద్ధి శాఖ అదనపు డైరెక్టర్ సి శ్రీధర్, ఎస్సి కార్పొరేషన్ జనరల్ మేనేజర్ హన్మంతు నాయక్,  గిరిజన సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ పోశం, మంత్రి ఓఎస్డీ విజయ్ కుమార్, పిఆర్వో అమృత్ తదితర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.