👉 జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ !
J . SURENDER KUMAR,
మే21 నుండి జూన్ 1వ తేదీ వరకు మహదేవ్‌పూర్ మండలం కాళేశ్వరంలో నిర్వహించనున్న సరస్వతి అంత్యపుష్కరాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు.
బుధవారం కాళేశ్వరం దేవాలయ ఈఓ కార్యాలయంలో పోలీస్, రెవెన్యూ, దేవాదాయ, ఆర్కిటెక్చర్, ఇరిగేషన్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖల అధికారులతో జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తో కలిసి సరస్వతి అంత్యపుష్కరాల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
👉 ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…
గత సంవత్సరం నిర్వహించిన సరస్వతి ఆది పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని, అంత్య పుష్కరాలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యవంతమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. గత పుష్కరాలలో ఎదురైన సమస్యలు పునరావృతం కాకుండా అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు.

👉 సరస్వతి అంత్యపుష్కరాల నిర్వహణ కోసం ప్రభుత్వం ₹ 30.16 కోట్ల నిధులను మంజూరు చేసిందని, ఇందులో ₹16 కోట్లతో శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు అంచనాలు తయారుచేసి ప్రతిపాదనలు పంపించాలని, ఫిబ్రవరి మొదటి వారంలోపే టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు.
👉 కాళేశ్వరం మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా శాశ్వత పనులు చేపట్టాలని, పుష్కరాల సమయంలో భక్తుల రాకపోకలు, భద్రత, తాగునీరు, పారిశుధ్యం, వైద్య సేవలు, విద్యుత్ సరఫరా వంటి అంశాల్లో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.
👉 కాళేశ్వరానికి వచ్చే భక్తులకు సౌకర్యవంతమైన ఆధ్యాత్మిక వాతావరణం కల్పించడమే లక్ష్యంగా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
👉 జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ మాట్లాడుతూ…
సరస్వతి అంత్యపుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ శాఖ తరపున ప్ పటిష్టమైన బందోబస్తు చేస్తామని తెలిపారు. ట్రాఫిక్ నిర్వహణ, వాహనాల పార్కింగ్, భక్తుల భద్రత వంటి అంశాలపై ముందుగానే ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తామని తెలిపారు.
👉 ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక రహదారి మార్గాలను పరిశీలిస్తున్నామని, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేస్తామని తెలిపారు. వాహనాల పార్కింగ్ సమస్యలు నివారించేందుకు మల్టీ లెవల్ పార్కింగ్ స్థలాలను గుర్తించామని, ప్రైవేట్ వాహనాల నియంత్రణకు డ్రాప్ గేట్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.
👉 రాష్ట్ర ధార్మిక సలహాదారు గోవింద హరి మాట్లాడుతూ….
సరస్వతి అంత్య పుష్కరాలను ఆది పుష్కరాల మాదిరిగానే అత్యంత వైభవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.
👉 అంత్యపుష్కరాలపై విస్తృత ప్రచారం చేపట్టాలని, పెండింగ్‌లో ఉన్న దేవాదాయ శాఖ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
👉 కాళేశ్వరం క్షేత్రానికి ఉన్న చారిత్రక ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేసేలా త్వరలోనే “కాళేశ్వర ఖండం” అనే పుస్తకాన్ని విడుదల చేస్తామని తెలిపారు.
👉 పీఠాధిపతులు, హారతి, ఇతర తాత్కాలిక ఏర్పాట్ల కోసం ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించాలని సూచించారు.
👉 అంత్యపుష్కరాలకు వచ్చే భక్తులకు గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని అందించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ మాయం సింగ్, సంబంధిత శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
