అర్హులైన జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులిస్తాం !

👉 అనర్హులకు కోత పెడతాం..!

👉 సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి !


J.SURENDER KUMAR,

జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు భారీగా తగ్గిస్తున్నట్లు వస్తున్న వదంతుల్లో ఎలాంటి వాస్తవం లేదని, అయితే ఎంతో గౌరవప్రదమైన అక్రెడిటేషన్ కార్డులను దుర్వినియోగం చేస్తున్న వారి ఆగడాలకు మాత్రం ఖచ్చితంగా బ్రేక్ వేసి, అర్హులైన జర్నలిస్టులందరికీ కార్డులు అందించేలా పగడ్భందీ చర్యలు చేపడతామని రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేసారు.

శనివారం నాడు సచివాలయంలోని తన ఛాంబర్ లో,  మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి, సమాచార శాఖ కమిషనర్ ప్రియాంక, ముఖ్యమంత్రి చీఫ్ పిఆర్ఓ మల్సూర్ లతో కలిసి  నిర్వహించిన జర్నలిస్టు సంఘాల ప్రధాన బాధ్యుల సమావేశంలో మాట్లాడారు.


👉 252 జీవో లో కొన్ని లోటు పాట్లపై జర్నలిస్టు సంఘాలు చేస్తున్న సూచనలను పరిగణలోకి తీసుకొని వాటిని సరిచేసేందుకు కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.


👉 ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె. విరాహత్ అలీ మాట్లాడుతూ, గతంలో డెస్క్ జర్నలిస్టులందరికీ కాకుండా, కొందరికే న్యాయం జరిగేదని, ప్రస్తుతం అలా కాకుండా, బస్ పాస్ లతో సహా ప్రభుత్వం కల్పించే ప్రతి సంక్షేమ పథకం రిపోర్టర్లు, డెస్క్ జర్నలిస్టులనే తేడా లేకుండా, ఎలాంటి వివక్ష లేకుండా ప్రతి డెస్క్ జర్నలిస్టుకు వర్తింపజేసేలా జీవో లో స్పష్టత ఇవ్వాలని కోరారు. కేబుల్ టీవీ ఛానెల్స్ కు సంబంధించి, జీవో లో నెలకొన్న అస్పష్టతను తొలగించాలని విజ్ఞప్తి చేసారు.


👉 గ్రేటర్ హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రధాన నగరాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు మండలానికి ఒకటి కాకుండా, ప్రధాన డేట్ లైన్ లను గుర్తించి, వాటి ప్రకారం అక్రెడిటేషన్ కార్డులు జారీ చేయాలన్నారు. చిన్న పత్రికలకు గ్రేడింగ్ ఆధారంగా జిల్లాల్లో కూడా అక్రెడిటేషన్ కార్డులు జారీ చేయాలన్నారు. ప్రధాన పత్రికలు, శాటిలైట్ న్యూస్ ఛానెల్స్ కు కార్డుల కుదింపు జరగకుండా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.


👉 ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు, వీడియో జర్నలిస్టులకు, కెమెరా జర్నలిస్టులకు వారి కార్యాలయాల సిఫారసుల మేరకు అందరికీ అక్రెడిటేషన్ కార్డులు జారీ చెయ్యాలన్నారు.


👉 రాష్ట్రంలో ఉర్దూ అధికార భాషా కనక, ఇతర భాషల సర్క్యూలేషన్ లతో, గ్రేడింగ్ లతో వాటిని పోల్చకుండా, ఉర్దూ పత్రికలు సర్క్యూలెట్ అవుతున్న ప్రాంతాలను గుర్తించి, ప్రత్యేక కేటగిరి క్రింద జిల్లా, మండల స్థాయిల్లో ఉర్దూ జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు ఇచ్చేలా జీవో లో పొందుపర్చాలని కోరారు.


👉 వెటరన్, ఫ్రీలాన్స్ జర్నలిస్టులు అక్రెడిటేషన్ కార్డులు పొందడానికి, జీవో లో పేర్కొన్న వృత్తి అనుభవాన్ని కొంత తగ్గిస్తూ సవరించాలని విరాహత్ అలీ కోరారు.


👉 టీ యూ డబ్ ల్యూ జే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రాంనారాయణ మాట్లాడుతూ, అక్రెడిటేషన్ కార్డులకు ప్రభుత్వం కోత పెడుతుందని జర్నలిస్టుల్లో జరుగుతున్న చర్చకు ఇవాళ్టి సమావేశం ఫుల్ స్టాప్ పెడుతుందన్నారు.


👉 అక్రెడిటేషన్ కార్డులతో పాటు జర్నలిస్టుల ప్రధాన సమస్యలైన ఆరోగ్య పథకం, ఇళ్ల స్థలాలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని మంత్రిని కోరారు.


👉 ఈ సమాశంలో టీయుడబ్ల్యూజే-ఐజేయు అనుబంధ సంస్థలైన చిన్న,మద్య తరగతి పత్రికల సంఘం బాధ్యులు యూసుఫ్ బాబు, అశోక్, ఫోటో జర్నలిస్టుల సంఘం బాద్యులు గంగాధర్, కె.ఎన్.హరి, వీడియో జర్నలిస్టుల సంఘం బాధ్యులు నాగరాజు, హరి, ఉర్దూ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ బాద్యుడు గౌస్ మోహియుద్దీన్, మహిళా జర్నలిస్ట్స్ విభాగం బాద్యురాలు వాకాటి మంజుల లతో పాటు ఆయా ప్రధాన జర్నలిస్టు సంఘాల రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.