సీఎం రేవంత్ రెడ్డి నేడు దావోస్ పర్యటనకు !

👉 సీఎంతో పాటు మంత్రులు  శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి , కార్యదర్శులు జయేష్ రంజన్ , సంజయ్ కుమార్ , సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి లు !

J.SURENDER KUMAR,

ప్రపంచ ఆర్థిక ఫోరం (WEF26 ) వార్షిక సమావేశాల్లో పాల్గొనేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం నేడు స్విట్జర్లాండ్‌లోని దావోస్ పర్యటనకు బయలుదేరనుంది.


👉 సోమవారం ఉదయం మేడారంలో పునర్నిర్మించిన సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద ముఖ్యమంత్రి  పూజలు నిర్వహించి మహా జాతరను ప్రారంభిస్తారు.


👉 ఉదయం 8 గంటలకు అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారు. ఉదయం 9.30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ముఖ్యమంత్రి  దావోస్‌కు బయలుదేరుతారు.


👉 జనవరి 20 నుంచి నాలుగు రోజుల పాటు దావోస్‌లో జరిగే సదస్సులో ముఖ్యమంత్రి  ప్రముఖ కంపెనీల సీఈఓలు, అంతర్జాతీయ స్థాయి పెట్టుబడిదారులు, వివిధ రంగాల ప్రతినిధులతో విస్తృత స్థాయి భేటీలు నిర్వహించనున్నారు.


👉 దావోస్‌లో తెలంగాణ పెవిలియన్ వేదికగా గూగుల్, సేల్స్‌ఫోర్స్, యూనిలీవర్, హనీవెల్, లోరియల్, నోవార్టిస్, టాటా గ్రూప్, డీపీ వరల్డ్, ఇన్ఫోసిస్, సిస్కో వంటి ప్రముఖ సంస్థల అధినేతలతో ముఖ్యమంత్రి  విడివిడిగా భేటీ అవుతారు. అలాగే పలు రౌండ్‌టేబుల్ సమావేశాల్లో పాల్గొంటారు.


👉 తెలంగాణలో పెట్టుబడులు, పరిశ్రమల విస్తరణ, ఐటీ, ఏఐ, లైఫ్ సైన్సెస్, తయారీ రంగాల్లో పెట్టుబడులపై ప్రధానంగా చర్చలు జరుపుతారు.


👉 తెలంగాణ రైజింగ్ 2047  విజన్‌ను, రాష్ట్రంలో వివిధ రంగాల అభివృద్ధికి ఉన్న అనుకూలతలను దావోస్ వేదికగా ప్రపంచానికి చాటి చెప్పాలని ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం చేశారు.