👉 తెలంగాణ రైజింగ్ 2047 నిర్దేశిత లక్ష్యాలు ప్రపంచానికి చాటడంలో ప్రతినిధి బృందం సఫలీకృతం !
J SURENDER KUMAR,
ముఖ్యమంత్రి . రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసింది. మూడు రోజుల పాటు జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో తెలంగాణ రైజింగ్ 2047 నిర్దేశిత లక్ష్యాలు, దార్శనికతను ప్రపంచానికి చాటడంలో ప్రతినిధి బృందం సఫలీకృతమైంది.
👉 హైదరాబాద్‌లో గత నెలలో జరిగిన తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో రాష్ట్ర ప్రభుత్వం ₹5.75 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించింది. ఆ నేపథ్యంలో 2026 ప్రపంచ ఆర్థిక వేదికలో పెట్టుబడులకు మించి రాష్ట్ర భవిష్యత్ ప్రణాళికలు, సమగ్రాభివృద్ధిపై తెలంగాణ రైజింగ్ విజన్ లక్ష్యాలు, బృహత్ ప్రణాళికలను ప్రపంచానికి చాటి చెప్పాలన్న ప్రభుత్వ సంకల్పం నెరవేరింది.
👉 మూడు రోజుల పాటు సాగిన ఈ పర్యటనలో ప్రతినిధి బృందం గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, డేటా సెంటర్లు, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ, తయారీ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించింది. అలాగే ప్రభుత్వం ఏఐ, సస్టైనబిలిటీ, స్కిల్లింగ్ కార్యక్రమాలకు సంబంధించిన పలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది.
👉 ఈ పర్యటనలో ముఖ్యమంత్రి వరల్డ్ ఎకనమిక్ ఫోరం నిర్వహించిన రెండు కీలక సెషన్లలో పాల్గొన్నారు. దావోస్ 2026 సదస్సు అనంతరం ఫాలోఅప్‌గా జూలై – ఆగస్టు నెలల్లో హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి సదస్సులో చేసిన ప్రతిపాదనకు సానుకూల స్పందన లభించింది.
👉 ఈ మూడు రోజుల్లో ప్రపంచ స్థాయి ప్రముఖ కంపెనీలు, పారిశ్రామిక దిగ్గజాలతో 12 ముఖాముఖి సమావేశాల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. పలు కీలక సమావేశాలు, ప్రత్యేక సెషన్ల అనంతరం మూడు రోజుల తెలంగాణ ప్రతినిధి బృందం దావోస్ పర్యటన గురువారం సాయంత్రంతో ముగిసింది.
👉 దావోస్ పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి జూరిచ్ బయల్దేరారు. అక్కడి నుంచి అమెరికా పర్యటనకు వెళ్తారు. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు , పొంగులేటి శ్రీనివాస రెడ్డి దావోస్ నుంచి భారత్‌కు తిరుగు పయనమయ్యారు.
