డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను స్వాగతించనున్న మంత్రి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయానికి శనివారం రానున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను  తెలంగాణ ప్రభుత్వ పక్షాన ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్వాగతించనున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శుక్రవారం రాత్రి జగిత్యాల కలెక్టర్ ఎస్పీలకు ఈ మేరకు వైర్ లెస్ సమాచారాన్ని పంపించారు.

వైర్లెస్ మెసేజ్.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ లో ఉదయం 10.30 గంటలకు కొండగట్టుకు చేరుకుని  ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. తరువాత టిటిడి ₹ 30.19 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఏపీ శాసనమండలి విప్ హరిప్రసాద్, స్థానిక చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కూడా పాల్గొంటారు.

👉 అర్చకులు అభ్యర్థన మేరకు..

ఆంధ్రప్రదేశ్ లో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, పవన్ కళ్యాణ్ జూన్ 29న కొండగట్టు ఆలయాన్ని సందర్శించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.  కొండగట్టు ఆంజనేయస్వామి ఆయనకు ఇష్టమైన దేవుడు కాబట్టి ఆయన ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా, ఆలయంలో అతిథి గృహాలు లేకపోవడం వల్ల భక్తులు ఇబ్బందులు పడుతున్నారని ఆలయ అధికారులు, పూజారులు పవన్ కళ్యాణ్  దృష్టికి తీసుకువచ్చారు. టిటిడి ద్వారా 100 గదుల కెపాసిటీ గల గెస్ట్ హౌస్ మరియు 2000 సీటింగ్ కెపాసిటీ గల దీక్ష విరమణ హాల్ నిర్మాణానికి చొరవ తీసుకోవాలని వారు పవన్ కళ్యాణ్ కు వినతి పత్రం ఇచ్చారు.

ఆయన సానుకూలంగా స్పందించారు.
ఆలయ పూజారులు మరియు స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఈ విషయాన్ని పలు సందర్భాల్లో ఎపి డిప్యూటీ సిఎం దృష్టికి తీసుకెళ్లారు. అక్టోబర్‌ మాసం లో తిరుమల తిరుపతి దేవస్థానం , ఇంజనీరింగ్ విభాగం అధికారులు కొండగట్టు క్షేత్రాన్ని సందర్శించి, ఘాట్ రోడ్డు పక్కన, మరియు జెఎన్‌టియు ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో రెండు ప్రదేశాలలో భూమిని పరిశీలించారు.

ఎట్టకేలకు, ఘాట్ రోడ్డు పక్కన ఉన్న స్థలాన్ని ఖరారు చేశారు. కొండగట్టు ఆలయ అధికారులు సర్వే నంబర్ 362/1లోని భూమిని అతిథి గృహం మరియు హాల్ నిర్మాణం కోసం కేటాయించి, టిటిడికి లేఖ రాశారు.

👉 కట్టుదిట్టమైన భద్రత !

ఏపీ డిప్యూటీ సీఎం పర్యటన కోసం జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. శుక్రవారం కలెక్టర్ సత్య ప్రసాద్, పోలీసు సూపరింటెండెంట్ అశోక్ కుమార్ ఇద్దరూ  సమావేశ వేదిక, హెలిప్యాడ్, శిలఫలకం మరియు ఆలయ ప్రాంగణంలో ఏర్పాట్లను పరిశీలించారు.


పోలీసు అధికారులు 1,200 మంది పోలీసులను మోహరించి భద్రతా ఏర్పాట్లు చేశారు. భద్రతా చర్యలను సెక్టార్ ల వారీగా  విభజించి ఒక్కొక్క సెక్టార్ కు అడిషనల్ ఎస్పీలను  ఇన్చార్జిలుగా నియమించారు