👉 శేషప్ప కళావేదికలో ఘనంగా సాగిన సాహితీ సమరం !
👉 సాహిత్య పరిమళాలతో అలరించిన మాడుగుల నారాయణమూర్తి !
J SURENDER KUMAR,
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి సన్నిధిలో, అన్నపూర్ణ సేవా సమితి సౌజన్యంతో శనివారం సాయంత్రం జరిగిన ‘అష్టావధానం’ సాహితీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంది. ధర్మపురి సాహితీ మిత్రబృందం ఆధ్వర్యంలో స్థానిక శేషప్ప కళావేదికలో ఈ కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది.

ప్రముఖ అవధాని, వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాల ప్రధానాచార్యులైన మాడుగుల నారాయణమూర్తి చేసిన సాహిత్య విన్యాసం సభికులను మంత్రముగ్ధులను చేసింది. తనదైన శైలిలో పద్యాలను ఆలపిస్తూ, పృచ్ఛకుల చిక్కు ప్రశ్నలకు చమత్కారంగా, పాండిత్య స్ఫోరకంగా సమాధానాలిచ్చి ‘భళా’ అనిపించుకున్నారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కొరిడె విశ్వనాథ శర్మ సభను ఉద్దేశించి మాట్లాడుతూ, తెలుగు భాషా వికాసానికి ఇటువంటి అవధానాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు.
👉 రక్తి కట్టించిన పృచ్ఛకుల ప్రశ్నలు:

అష్టావధానంలో ఎనిమిది మంది పృచ్ఛకులు తమ తమ అంశాలతో అవధానిని పరీక్షించారు.
👉 నిషిద్ధాక్షరిలో సంగనభట్ల చిన్న రామకిష్టయ్య, సమస్యలో బక్కశెట్టి మల్లేశం, దత్తపదిలో జన్మంచి నర్సయ్య క్లిష్టమైన ప్రశ్నలు సంధించగా అవధాని వాటిని అవలీలగా పూరించారు.
👉 వ్యస్తాక్షరిని పెండ్యాల చంద్రశేఖర్, పురాణపఠనాన్ని శ్రీమతి పణతుల వరలక్ష్మి నిర్వహించారు.

👉 గొల్లపెల్లి గణేశ్ (ఆశువు), గాజుల మహేందర్ (వర్ణన) అడిగిన అంశాలపై అవధాని చెప్పిన పద్యాలు అలరించాయి.
👉 ముఖ్యంగా అప్రస్తుత ప్రసంగంలో పెండ్యాల మహేందర్ వేసిన చమత్కార బాణాలకు, అవధాని అంతే దీటుగా వేసిన పంచ్‌లతో సభలో నవ్వులు పూశాయి.

ఈకార్యక్రమంలో ఆహ్వానకర్త గుండి రామ్‌కుమార్, సంచాలకులు బోగ శివప్రసాద్‌తో, పెండ్యాల రాజేష్ తో పాటు ధర్మపురి పట్టణ ప్రముఖులు, కవులు, సాహితీ అభిమానులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
చివరగా అవధాని మాడుగుల నారాయణమూర్తి గారిని దేవస్థానం పక్షాన చైర్మన్ జక్కు రవీందర్, ఆలయ సిబ్బంది అలువాల శ్రీనివాస్, పెండ్యాల గణేశ్ అర్చకులు నంబి శ్రీనివాస్ చారి, బొజ్జ రమేష్ లు, నిర్వాహకుడు మాడిశెట్టి శ్రీనివాస్, ఘనంగా సత్కరించారు.
