దివ్యాంగులలో వెలుగులు నింపుతున్న ప్రజా ప్రభుత్వం !

👉 ₹ 50 కోట్లతో సాధికారత 7 వేల మందికి ఉపకరణాల పంపిణీ !

👉 బాల భరోసా–ప్రణామంతో మానవీయ సంక్షేమానికి కొత్త నిర్వచనం !

👉 వృద్ధుల సంక్షేమానికి ప్రత్యేకంగా రాష్ట్రవ్యాప్తంగా 37 ‘ప్రణామం’ డే కేర్ సెంటర్లను ఏర్పాటు !

👉 సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J SURENDER KUMAR,

ముఖ్యమంత్రి  రేవంత్‌రెడ్డి  నాయకత్వంలో తెలంగాణలో సంక్షేమ పాలనకు నేడు మరో సార్థక అధ్యాయం ఆవిష్కృతమైందనీ దివ్యాంగులు, వృద్ధులు, చిన్నారుల సంక్షేమాన్ని ప్రభుత్వ ప్రధాన కర్తవ్యంగా తీసుకుని, మాటలకే పరిమితం కాకుండా కార్యరూపంలో అమలు చేస్తున్న ప్రజా ప్రభుత్వ సంకల్పానికి నేటి దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమం నిదర్శనంగా నిలిచిందనీ ఎస్సీ ,ఎస్టీ , దివ్యాంగులు ట్రాన్స్ జెండర్ల శాఖ మంత్రి  అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

సోమవారం ప్రజాభవన్ లో  ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి  భట్టి విక్రమార్క సారధ్యంలో దివ్యాంగులకు వివిధ  పరికరాలు,  ఉపకరణాలు ల్యాప్ టాప్  లు పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మంత్రి ప్రసంగించారు.

👉 ఈ సందర్భంగా  మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  మాట్లాడుతూ…..

దివ్యాంగుల సాధికారతే లక్ష్యంగా ఒకే ఆర్థిక సంవత్సరంలో ₹50 కోట్ల భారీ నిధులను కేటాయించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఈ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా 7 వేల మంది అర్హులైన దివ్యాంగులకు ₹ 43.22 కోట్ల విలువైన ఉపకరణాలను పంపిణీ చేశామన్నారు.

👉 ప్రతి దివ్యాంగుడి వ్యక్తిగత అవసరాలను గుర్తించి, గౌరవం, ఆత్మవిశ్వాసం పెంచేలా పరికరాల ఎంపిక జరిపినట్లు తెలిపారు. ట్రైసైకిళ్లు, వీల్‌చెయిర్లు, మోటరైజ్డ్ వాహనాల ద్వారా స్వేచ్ఛగా ప్రయాణించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోందన్నారు.

👉 ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్ల ద్వారా దివ్యాంగ విద్యార్థులకు డిజిటల్ సాధికారత అందిస్తూ విద్య, ఉపాధిలో సమాన అవకాశాలకు బాటలు వేస్తోందన్నారు. వినికిడి యంత్రాల పంపిణీతో సామాజిక జీవనంలో వారికి సమాన స్థానం కల్పిస్తున్నామన్నారు.

👉 వృద్ధుల సంక్షేమానికి ప్రత్యేకంగా రాష్ట్రవ్యాప్తంగా 37 ‘ప్రణామం’ డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ కేంద్రాల్లో వృద్ధులకు భోజనం, వినోదం, మానసిక ఉల్లాస కార్యక్రమాలతో పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు భద్రతతో కూడిన సంరక్షణ అందిస్తున్నామని అన్నారు. ఒంటరితనం కాకుండా ఆత్మీయతతో కూడిన వాతావరణాన్ని కల్పించడమే లక్ష్యమన్నారు.

👉 చిన్నారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ‘బాల భరోసా’ పథకం కీలక మైలురాయిగా నిలుస్తోందన్నారు. ఐదేళ్లలోపు పిల్లల వైకల్యాలను ముందస్తుగా గుర్తించి, అంగన్వాడీల ద్వారా గ్రామస్థాయిలో ప్రాథమిక స్క్రీనింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అవసరమైన పిల్లలకు ఉచిత వైద్య పరీక్షలు, చికిత్సలు, శస్త్రచికిత్సలు, థెరపీ, పునరావాస సేవలకు ప్రభుత్వం సంపూర్ణ భరోసా ఇస్తోందన్నారు.

👉 సంక్షేమ పథకాలు కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అమలు అవుతున్నాయని ఇవే ప్రత్యక్ష సాక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.

👉 సీఎం రేవంత్‌రెడ్డి  దిశానిర్దేశంలో వేగవంతమైన నిర్ణయాలతో దివ్యాంగులు, వృద్ధులు, చిన్నారుల జీవితాల్లో నమ్మకం నింపే పాలన కొనసాగుతోందన్నారు. వైకల్యరహిత, సమాన అవకాశాలతో కూడిన తెలంగాణ నిర్మాణమే ప్రజా ప్రభుత్వ సంకల్పమని మంత్రి స్పష్టం చేశారు.

👉 ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ,ఎంపీ బలరామ నాయక్, అనిల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి ,ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ , సంక్షేమ శాఖ ప్రత్యేక  కార్యదర్శి సభ్యసాచ్ ఘోష్, హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరి చందన,  దివ్యాంగుల శాఖ కార్యదర్శి అనిత రామచంద్రన్, హెల్త్ సెక్రటరీ క్రిస్టినా,  డైరెక్టర్ శైలజ తదితరులు పాల్గొన్నారు.