ప్రీ ప్రైమరీ విద్య విధానం అమలు చేస్తాం సీఎం రేవంత్ రెడ్డి !

J SURENDER KUMAR,

ప్రైవేటు విద్యా సంస్థలకు ధీటుగా తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి అనుగుణంగా ప్రీ ప్రైమరీ విద్యను అందించే విధానాన్ని అమలు చేయనున్నట్టు ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి , హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి  రోహిత్ ఠాకూర్  నేతృత్వంలోని ప్రతినిధి బృందానికి తెలిపారు.

👉 హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి  నేతృత్వంలోని ప్రతినిధి బృందం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విద్యా రంగం పట్ల తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రి  వివరించారు.


👉 జాతీయ విద్యా విధానం తరహాలోనే తెలంగాణలోనూ త్వరలోనే ప్రత్యేక విద్యా విధానం తీసుకురాబోతున్న విషయాన్ని తెలిపారు. విద్యా విధానం కోసం ఇప్పటికే ఒక ఉన్నతస్థాయి కమిటీని నియమించామని, త్వరలోనే ఆ పాలసీని అమలులోకి తీసుకొస్తామని చెప్పారు.


👉 గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ బడుల్లో ప్రీ ప్రైమరీ ప్రారంభించడమే కాకుండా పిల్లలను పాఠశాలలకు తీసుకెళ్లడానికి రవాణా సౌకర్యం కల్పించే ఆలోచన కూడా చేస్తున్నట్టు తెలిపారు.


👉 రాష్ట్రంలోని ఐటీఐలను ఏటీసీలుగా తీర్చిదిద్దుతున్న వివరాలను, అలాగే ప్రతి నియోజకవర్గంలో ఏటీసీ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.


👉 విద్యా రంగంలో సమూల మార్పుల్లో భాగంగా చేపడుతున్న సంస్కరణలతో పాటు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ (YIIRS) ఏర్పాటు చేస్తున్న వివరాలను తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ₹ 200 కోట్ల రూపాయల వ్యయంతో 25 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ఒకేచోట మినీ యూనివర్సిటీ స్థాయిలో ఈ స్కూల్స్‌ను నిర్మిస్తున్నట్టు చెప్పారు.


👉 ఏటీసీగా మార్చిన మల్లేపల్లి (ఐటీఐ)ని సందర్శించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  హిమాచల్‌ప్రదేశ్ మంత్రి కి సూచించారు. రాష్ట్రంలో నెలకొల్పుతున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణంపైన ఆసక్తి చూపించిన హిమాచల్ ప్రదేశ్ మంత్రి  అందుకు సంబంధించిన సమగ్ర వివరాలను అందించాలని కోరారు.


👉 ప్రభుత్వ రంగంలో విద్యా వ్యవస్థను పటిష్టపరచాలన్న ముఖ్యమంత్రి  విజన్‌ను రోహిత్ ఠాకూర్ అభినందించారు. ఈ సమావేశంలో విద్యా శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.