గోదావరి లిఫ్ట్ ప్రారంభించిన మంత్రి లక్ష్మణ్ కుమార్ !

👉 ₹ 81 లక్షల నిధులతో లిఫ్ట్ మరమ్మతులు చేయించిన మంత్రి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

ధర్మపురి నియోజకవర్గ వెల్గటూర్ మండలంలోని ముత్తునూర్ గ్రామంలో గోదావరి నది ఒడ్డున గల లిఫ్ట్ ను సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  గురువారం పునఃప్రారంభించారు. గత కొన్ని రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు
లిఫ్ట్ వద్ద గల విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్‌లోని కాపర్ (రాగి వైర్లు) దొంగిలించడంతో లిఫ్ట్ పని చేయకుండా నిలిచిపోయింది. ఈ విషయం గ్రామ ప్రజలు, రైతులు మంత్రి  లక్ష్మణ్ కుమార్ కు వివరించారు.

వెంటనే స్పందించి మంత్రి లక్ష్మణ్ కుమార్,   ఇరిగేషన్ మంత్రి  ఉత్తమ్ కుమార్ రెడ్డి తో మాట్లాడి రైతుల, పంటల పరిస్థితిని వివరించారు.

లిఫ్ట్ పనిచేయకపోవడం వల్ల  నదిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వ్యవసాయ ఆధారిత కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, వేలాది ఎకరాల పంటల సాగు పూర్తిగా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడుతుందని, రైతుల ఇబ్బందులను మంత్రి లక్ష్మణ్ కుమార్ వివరించారు.


మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి  స్పందించి, తక్షణమే ₹ 81 లక్షల నిధులు మంజూరు చేసి జీఓ జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.

👉 ఈ సందర్భంగా మంత్రుల లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…

ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతుల పక్షానే ఉంటుందని, గోదావరి నదిపై ఆధారపడిన ముత్తునూర్‌తో పాటు ఆరేపల్లి, జైన, రాజారాం,  రాయపట్నం, తిమ్మాపూర్ తదితర గ్రామాల రైతులకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా లిఫ్ట్ నిర్వహణకు కాంట్రాక్టర్ ద్వారా నిరంతర పర్యవేక్షణ, తక్షణ మరమ్మతులు చేపడతామని మంత్రి అన్నారు.

ఇటీవల మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో దొంగతనాల ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండి మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ పరికరాలను కాపాడుకోవాలని మంత్రి సూచించారు.

కరెంట్ ఆన్–ఆఫ్ సమస్యల వల్ల మోటార్లు దెబ్బతినే ప్రమాదం ఉందని, విద్యుత్ శాఖ అధికారులతో సమన్వయం చేసి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సన్న వడ్లకు బోనస్, వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా, నీటి సమస్యలు రాకుండా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని తెలిపారు.

రైతులు కష్టపడి పండించిన పంటకు న్యాయం జరిగేలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా పాలనలో ముందుకు సాగుతుందని మరోసారి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి, మంత్రివర్యులకు కృతజ్ఞతలు తెలిపారు.