హైదరాబాదులో బ్యూటీ–టెక్ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ !

👉 దావోస్‌లో లోరియల్ (L’Oreal) సంస్థ ప్రకటించింది!


J.SURENDER KUMAR,


ప్రపంచంలోనే తొలి బ్యూటీ–టెక్ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ (GCC)ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు లోరియల్ (L’Oreal) సంస్థ ప్రకటించింది. ఈ అత్యాధునిక కేంద్రాన్ని ఈ ఏడాది నవంబర్‌లోనే ప్రారంభించనుంది.


👉 దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ – 2026లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  లోరియల్ సీఈవో  నికోలస్ హియెరోనిమస్ తో భేటీ అయ్యారు.


👉 ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో హైదరాబాద్‌లో భారీ పెట్టుబడులతో బ్యూటీ–టెక్ జీసీసీ ఏర్పాటు చేసే నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ జీసీసీ ఏర్పాటుతో లోరియల్‌కు గ్లోబల్ ఇన్నోవేషన్, టెక్నాలజీ, డేటా, సప్లై చైన్ కార్యకలాపాలకు హైదరాబాద్ కీలక కేంద్రంగా నిలవనుంది.


👉 డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, ఏఐ, అనలిటిక్స్ రంగాల్లో రూపొందించే సాంకేతిక పరిష్కారాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న లోరియల్ యూనిట్లకు అందిస్తామని నికోలస్ గారు తెలిపారు. తద్వారా గ్లోబల్ ఎంటర్‌ప్రైజ్ కార్యకలాపాలకు హైదరాబాద్ ప్రాముఖ్యత మరింత పెరుగనుంది.


👉 నవంబర్‌లో జరగబోయే జీసీసీ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి ని, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ని లోరియల్ సంస్థ ఆహ్వానించింది.


👉 ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు  మాట్లాడుతూ, లోరియల్ జీసీసీని హైదరాబాద్‌కు తీసుకురావాలన్న ఆలోచనపై ముఖ్యమంత్రి  ప్రత్యేక ఆసక్తి చూపారని, ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు.


👉 హైదరాబాద్ పెట్టుబడులకు అనువైన ప్రదేశమని, మెడ్‌టెక్‌, హెల్త్‌టెక్‌ మాత్రమే కాకుండా బ్యూటీ–టెక్‌ వంటి కొత్త విభాగాల్లోనూ తెలంగాణ ముందుంటోందని మంత్రి  అన్నారు. ఇప్పటికే మారియట్, వాంగార్డ్, నెట్‌ఫ్లిక్స్, మెక్‌డొనాల్డ్స్, హైనికెన్, జాగర్, కోస్ట్కో వంటి గ్లోబల్ కంపెనీలు హైదరాబాద్‌లో జీసీసీలను ఏర్పాటు చేశాయని గుర్తుచేశారు.


👉 తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్ (TAIH) గురించి రాష్ట్ర ప్రతినిధి బృందం ఈ సందర్భంగా వివరించింది. జీసీసీతో పాటు మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుకు తెలంగాణలో ఉన్న అవకాశాలను పరిశీలించాలని లోరియల్ సంస్థను ఆహ్వానించారు. రాష్ట్రంలో ఉన్న మౌలిక వసతులు, పరిశ్రమల ఎకోసిస్టమ్‌ను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో తయారీ రంగంలోనూ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు నికోలస్ హియెరోనిమస్  సానుకూలంగా స్పందించారు.